'ప్రత్యక్ష ఎన్నిక' 'పోటీ' పెంచుతుందా.. ?
మునిసిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ పదవులకుకూడా ప్రత్యక్ష ఎన్నికలు తీసుకువచ్చిన నేపథ్యంలో ఆయా పదవులకు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది.
మునిసిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ పదవులకుకూడా ప్రత్యక్ష ఎన్నికలు తీసుకువచ్చిన నేపథ్యంలో ఆయా పదవులకు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది. గతంలో ఎన్నికలు అయి పోయిన తర్వాత..కోటాల వారీగా మేయర్, మునిసిపల్ చైర్మన్ లేదా చైర్ పర్సన్‌లు పార్టీలు ఎంపిక చేసేవి. దీంతో పార్టీల్లో ఈ పదవుల కోసం ఎన్ని కల అనంతరం.. చర్చ సాగేది. కానీ, తాజాగా ఎన్నికలకు ముందే ఈ పదవులకు అభ్యర్థులను ఖరారు చేయడం గమనార్హం. వారిని కూడా ఎన్నికునే అవకాశం ప్రజలకే ఇవ్వడం విశేషం.
ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీడీపీ ఆలోచన విధానం డిఫరెంట్‌గా ఉంది. మేయర్ లేదా మునిసిపల్ చైర్మన్ పదవికి ఎంపిక చేసే అభ్యర్థుల ద్వారా.. స్థానిక ఎన్నికలు ప్రభావితం అవుతాయని.. తద్వారా గెలుపు గుర్రం ఎక్కేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అభ్యర్థులను కూడా పార్టీనే ఎంపిక చేయనుంది. అయితే..ఇక్కడే పెద్ద సమస్య తెరమీదికి వస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. మేయర్, మునిసిపల్ చైర్మన్ పదవులు స్థానికంగా రాజ్యాంగ హోదాతో కూడి ఉంటాయి. వారికి దక్కే గౌరవం కూడా భిన్నంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఆయా పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం అంటే.. ముందు గానే అభ్యర్థులను ఖరారు చేసేయడం అన్నమాట. ఇది ప్రజల కోణంలో చూసుకుంటే.. వారికి నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కానీ, పార్టీల పరంగా చూస్తే మాత్రం ఇది ఒకింత ఇబ్బందికర వాతావరణానికి దారి తీయొచ్చని అంటు న్నారు. ఉదాహరణకు ఒక నాయకుడు లేదా నాయకురాలు ఈ పదవిపై ఆశలు పెట్టుకుంటే.. తాజా విధానంలో వారికి అవకాశం రాకపోతే.. ఏంటి పరిస్థితి? అనేది ప్రశ్న. పాత విధానంలో ఎన్నికలు పూర్తయ్యాక.. ఎంపిక ఉండేది.
దీంతో ఆశావహులు పోటీ తత్వంతో పనిచేసేవారు. ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కితే.. మేయర్, డిప్యూటీ మేయర్.. సహా ఇతర కీలకమైన పదవులు దక్కుతాయన్న ఆశ ఉండేది. కానీ, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల కారణంగా.. మునిసి పల్ చైర్మన్, మేయర్ పదవులకు అభ్యర్థులను ముందుగానే నిర్ణయించేస్తే.. అది ఆయా పదవులను ఆశిస్తున్నవారి ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మాత్రం ప్రజల అభిప్రాయానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికలకే మొగ్గు చూపుతున్నారు.