బొప్పరాజుపై తిరుగుబాటు..!? కాకపుట్టిస్తున్న ఉద్యోగ సంఘాల రాజకీయం
ఏపీలో ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు ముసురుకుంటున్నాయా? అన్న చర్చ జరుగుతోంది.
ఏపీలో ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు ముసురుకుంటున్నాయా? అన్న చర్చ జరుగుతోంది. ఉద్యోగుల డిమాండ్ల సాధనకంటూ ఏపీ జేఏసీ (అమరావతి) చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మూడు దశల ఉద్యమ కార్యాచరణ ప్రకటించగా, ఆయన తీరును నిరసిస్తూ రెవెన్యూ ఎంప్లాయిస్ యూనియన్, ఏపీ జేఏసీ నేతలు వేర్వేరుగా మీడియాకు ఎక్కడం చర్చనీయాంశం అవుతోంది. ప్రధానంగా ఏపీ జేఏసీ (అమరావతి) చైర్మన్ బొప్పరాజు రహస్య రాజకీయ అజెండా అమలు చేస్తున్నారని మిగిలిన ఉద్యోగ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంతో సానుకూల సహకారాన్ని కోరుకుంటూనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కించపరిచేలా బొప్పరాజు వ్యాఖ్యలు ఉన్నాయని తప్పుపడుతున్నారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలపై ఉద్యోగుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చాలా ఆశలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా ఉద్యోగుల పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపు వంటి ఆర్థికాంశాలుపై ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లలో రూ.22 వేల కోట్ల బకాయిల చెల్లింపు, ఒకటో తేదీన జీతాలు, 10 వేల మంది ఉద్యోగులకు ఓపీఎస్, 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజేషన్, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం వంటి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చినా ఆర్థిక ప్రయోజనాలు అందజేయడంలో ఇంకా నిర్లక్ష్యం వహిస్తోందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అంటూ ఉద్యోగ సంఘాల జేఏసీలు ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గత శుక్రవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశానికి హాజరైన వివిధ సంఘాల నేతలు, కొందరు కమ్యూనిస్టు పార్టీల నేతలు ఉద్యోగుల సమస్యలపై కాకుండా, రాజకీయ లక్ష్యాలతో మాట్లాడినట్లు కనిపిస్తోందని రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు అనుమానం వ్యక్తం చేస్తూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేయడం సంచలనం రేపుతోంది. ప్రధానంగా అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు లక్ష్యంగా భూపతిరాజు రవీంద్రరాజు చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి.
బొప్పరాజు ఆధ్వర్యంలోని జరిగిన సదస్సులో కొందరు నాయకులతో బయట నుంచి వచ్చిన స్క్రిప్టు ప్రకారం మాట్లాడించేందుకు ప్రయత్నించారని చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. సీఎం చంద్రబాబును విమర్శించడం, ఆయనపై వ్యంగ్య చిత్రాలు ప్రదర్శించడమే కాకుండా, సీఎం సతీమణి వ్యాఖ్యలను కూడా వ్యంగ్యంగా స్క్రీన్ పై ప్రదర్శించారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని భూపతిరాజు రవీంద్రరాజు మండిపడుతున్నారు. ఇక బొప్పరాజు నిర్వహించిన సదస్సుకు సంబంధం లేకుండా ఉద్యోగుల సమస్యలపై తాము సొంతంగా నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ ప్రకటించారు.
సమస్యల పరిష్కారానికి ముందుగా మంత్రులతో చర్చిస్తామని, అనంతరం ముఖ్యమంత్రితో భేటీ అవుతామని విద్యాసాగర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దీంతో అమరావతి జేఏసీతో సంబంధం లేకుండా తాము పనిచేస్తామని ఏపీ జేఏసీ తేల్చిచెప్పినట్లైంది. మరోవైపు బొప్పరాజు ప్రకటించి ఉద్యమ కార్యాచరణతోపాటు ముఖ్యమంత్రిపై విమర్శలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఉద్యోగులు-ప్రభుత్వం మధ్య సఖ్యతను చెడగొట్టేలా బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నారని రెవెన్యూ మంత్రి ఆరోపించారు. తాము ఉద్యోగ సంఘాల డిమాండ్లపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ, గత ప్రభుత్వ బకాయిలను తమకు అంటగడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఈ పరిణామాలతో అమరావతి జేఏసీ ప్రకటించిన మూడు దశల ఉద్యమ కార్యాచరణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని ఆ సమావేశంలో బొప్పరాజు ప్రకటించినప్పటికీ, ఆయన సమక్షంలో కొందరు నేతలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వంతో సంబంధం లేని ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరిపై వ్యంగ్య చిత్రాలు ప్రదర్శించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బొప్పరాజు ప్రకటించిన ఉద్యమంతో తమకు సంబంధం లేదని మిగతా సంఘాల నేతలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఏపీ జేఏసీ కూడా సొంతంగా పనిచేయాలని నిర్ణయించడంతో ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు స్పష్టమవుతున్నాయని అంటున్నారు.