తెలంగాణ కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు.. ఏబీఎన్ ఆర్కే విశ్లేషణ, రేవంత్ రెడ్డికి సెగ మొదలైందా?
ఆర్కే విశ్లేషణ ప్రకారం వచ్చే ఏడాది తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబుతున్నాయట.. దీంతో ఆర్కే విశ్లేషణపై తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందా? ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీన పడుతున్నారా? రాష్ట్రంలో ఆయనకు అంటూ సొంతవర్గం లేకపోయిందా? అంటే ఔను అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోందని అంటున్నారు ప్రముఖ జర్నలిస్టు, ఏబీఎన్ సంస్థల అధినేత రాధాకృష్ణ (ఆర్కే). వర్తమాన రాజకీయ అంశాలపై ఆయన ప్రతి ఆదివారం రాసే ‘కొత్తపలుకు’ కాలమ్ లో సంచలన విషయాలను వెల్లడించారు. ఆర్కే విశ్లేషణ ప్రకారం వచ్చే ఏడాది తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబుతున్నాయట.. దీంతో ఆర్కే విశ్లేషణపై తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
తెలంగాణలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆర్కే తన కొత్తపలుకులో విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేకులు అందరూ ఏకమవుతున్నారని, ఆయనకు వ్యతిరేకంగా రాజకీయాలు ఊపందుకున్నాయని వెల్లడించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లోకి వెళుతున్నారని, ఇంకా రెండేళ్లు అధికారం ఉండగానే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సర్దుకుంటుండటం తప్పుడు సంకేతాలు ఇస్తోందని రాసుకొచ్చారు. ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్త పడటానికి హెచ్చరికగానే పరిగణించాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక తెలంగాణలో బలమైన నాయకుడు కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బలహీన పర్చడానికి కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యతిరేకులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ కుమార్తె విషయంలో చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం సమయం తీసుకోవడంపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. సురేఖపై చర్యలు లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత బలహీనమవుతారని, అంతిమంగా ఎన్నికలకు ఏడాది ముందే కాంగ్రెస్ లో కల్లోలం పతాకస్థాయికి చేరుకుంటుందని ఆర్కే విశ్లేషణగా ఉందని అంటున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆప్తుడిగా భావిస్తున్న సీనియర్ జర్నలిస్టు ఆర్కే విశ్లేషణ కాంగ్రెస్ రాజకీయాలుపై సరికొత్త సందేహాలకు తావిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో సగం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మంత్రి సురేఖ విషయంలో ముఖ్యమంత్రికి మద్దతుగా కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే మీడియా ముందుకు రావడాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామాలను ఉటంకిస్తూ ఆర్కే తన విశ్లేషణలో కాంగ్రెస్ లో తుఫాన్ వచ్చే సూచనలు ఉన్నాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేల్కొలిపేందుకు కూడా పనికొస్తుందని అంటున్నారు. అయితే ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారు అనేది మునుముందు చూడాల్సివుందని అంటున్నారు.