నోటీసులో చిన్న తప్పు.. రూ.1.84 కోట్ల పెనాల్టీ రద్దు: గురుగ్రామ్ వ్యక్తికి ఐటీఏటీలో బిగ్ రిలీఫ్
విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విధించిన భారీ పన్ను, పెనాల్టీ నుంచి గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి ఊహించని విజయం సాధించారు.
విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విధించిన భారీ పన్ను, పెనాల్టీ నుంచి గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి ఊహించని విజయం సాధించారు. పన్ను అధికారులు చేసిన ఒకే ఒక సాంకేతిక పొరపాటును ఆసరాగా చేసుకుని.. అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో రూ.1.84 కోట్ల పెనాల్టీతో పాటు పన్ను డిమాండ్‌ను పూర్తిగా రద్దు చేయించుకున్నారు.
కేసు నేపథ్యం ఇదీ
గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ మాగ్నోలియాస్‌కు చెందిన భౌమిక్ అనే వ్యక్తి గతంలో సింగపూర్‌లో ఉద్యోగం చేసేవారు. 2015లో తన వేతనం ద్వారా సంపాదించిన 3 లక్షల డాలర్లను బర్ముడా కేంద్రంగా ఉన్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టారు. 2016లో ఆ పెట్టుబడిని రిడీమ్ చేయగా ఆయనకు 3,14,608 డాలర్లు వచ్చాయి. ఈ నిధులు భారత్‌కు చెందినవి కావు అని.. డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (డీటీఏఏ) పరిధిలోకి వస్తాయని వివరించినప్పటికీ ఐటీ అధికారులు అంగీకరించలేదు.
తర్వాత పంపిన నోటీసులకు భౌమిక్ స్పందించకపోవడంతో అధికారులు బ్లాక్ మనీ యాక్ట్ సెక్షన్ 3(1) కింద ఆ పెట్టుబడిని ‘అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్’గా పరిగణించారు. 2019-20 అసెస్‌మెంట్ ఇయర్ కి గానూ 30% పన్నుతో పాటు రూ.1.84 కోట్ల పెనాల్టీ విధించారు.
తీర్పును మలుపు తిప్పిన నోటీసు పొరపాటు
కమిషనర్ వద్ద ఉపశమనం లభించకపోవడంతో భౌమిక్ ఢిల్లీలోని ఐటీఏటీ ని ఆశ్రయించారు. విచారణలో ఆయన తరఫు న్యాయవాదులు ఒక కీలక లోపాన్ని బయటపెట్టారు. అధికారులు సెక్షన్ 10(1) కింద జారీ చేసిన నోటీసులో 2016-17, 2017-18 వార్షిక సంవత్సరం అని మాత్రమే పేర్కొన్నారు. కానీ చివరికి అసెస్‌మెంట్ వేసింది మాత్రం 2019-20కి. ఇది కేవలం ప్రింటింగ్ లేదా సాంకేతిక పొరపాటు అని సెక్షన్ 81 కింద దీనికి మినహాయింపు ఉంటుందని అధికారులు వాదించారు. నోటీసులో చిన్న లోపాలు ఉంటే సెక్షన్ 81 రక్షిస్తుంది కానీ అసలు సంబంధిత సంవత్సరానికి ప్రాథమిక జ్యూరిస్డిక్షనల్ నోటీసే లేనప్పుడు దాన్ని సమర్థించలేమని ఐటీఏటీ తేల్చిచెప్పింది.
సరైన నోటీసు లేకుండా చేపట్టిన చర్యలు చెల్లవని స్పష్టం చేస్తూ ఐటీఏటీ అసెస్‌మెంట్ ఆర్డర్‌ను.. రూ.1.84 కోట్ల పెనాల్టీని పూర్తిగా రద్దు చేసింది. పన్ను అధికారులు పంపే ప్రతి నోటీసులో అసెస్‌మెంట్ ఇయర్ పరిధి సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించడం ఎంత కీలకమో ఈ తీర్పు నిరూపిస్తోంది.