సాయి రెడ్డి వెనక ఎవరున్నారు....టార్గెట్ అదేనా ?
వైసీపీలో విజయసాయిరెడ్డి కొన్నాళ్ళ పాటు రాజ్యమేలారు. ఆయన వైసీపీలో జగన్ తరువాత అంత అన్నట్లుగా ఉండేవారు.
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి మీదనే వైసీపీ విమర్శలు చేయాల్సి వస్తుందని ఎవరూ అనుకోని ఉండరు, దాని కంటే ముందు జగన్ మీద తాను మతపరమైన విమర్శలు చేస్తాను అని విజయసాయిరెడ్డి అనుకోలేదేమో. కానీ ఇది రాజకీయం. రాజకీయం ఎలా ఉంటుందో మూడు వేల ఏళ్ళ క్రితమే చాణక్యుడు చెప్పేశాడు. అత్యంత కఠినమైనది రాజకీయం, దానికి బంధాలు అనుబంధాలు ఏవీ ఉండవు, రాగద్వేషాలకు అతీతమైనది. అందుకే దాన్ని అలాగే చూడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి వైసీపీకి ఇపుడు ప్రధాన ప్రత్యర్థి అయ్యారా లేదా ఎదురు నిలిచిన వారు అయ్యారా అంటే జవాబు కష్టమే కానీ దాని కంటే ముందు వైసీపీకి ట్రబుల్ క్రియేటర్ అయ్యారు అంటే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటారు.
ట్రబుల్ షూటర్ నుంచి :
వైసీపీలో విజయసాయిరెడ్డి కొన్నాళ్ళ పాటు రాజ్యమేలారు. ఆయన వైసీపీలో జగన్ తరువాత అంత అన్నట్లుగా ఉండేవారు. ఆయన ట్రబుల్ షూటర్ అని కూడా అనేవారు. అలాంటి నాయకుడే వైసీపీని వీడిపోయి రాళ్ళు వేస్తున్నారు. అవి కూడా మెత్తగా కాదు, గట్టిగానే, తాను జగన్ ని ఏమీ అనను అంటూనే దారుణంగానే విమర్శలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు అనలేని విధంగా ఆయన మాట్లాడుతున్నారు. జగన్ మత మార్పిడులను ప్రోత్సహించారు అన్నది జగన్ మొత్తం పొలిటికల్ కెరీర్ లో ఎదుర్కోని అతి పెద్ద విమర్శ. జగన్ మీద నిత్యం విమర్శలు చేసే టీడీపీ కూడా ఈ తరహా విమర్శలకు సాహసించలేదు అని గుర్తు చేసుకుంటున్నారు. అలాంటిది విజయసాయిరెడ్డి అతి పెద్ద బండ వేశారు. దాని మీద వైసీపీ తీవ్రంగా మధన పడుతోంది.
కోటరీ ప్రచారంతోనే :
వైసీపీ అంటే ఒక పార్టీ, ఒక వ్యవస్థ, ఒక సంస్థాగత నిర్మాణం, అక్కడ అధ్యక్షుడు తో పాటు అందరూ ఉంటారు అన్నది సగటు జనాలలో ఉంటుంది. కానీ అదేమీ లేదు, జగన్ ఆయన చుట్టూ ఒక కోటరీ అంతే అన్నట్లుగా జనాల్లో ప్రచారం చేయడంలో కొంత వరకూ వారిలో దీని మీద చర్చకు తెర లేపడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారని అంటున్నారు. దానికి కూడా వైసీపీలో ఆవేదన చెలరేగుతోంది. తమతోనే ఉంటూ తమ వాడిగానే ఉంటూ విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళాక ఈ తరహా విమర్శలు చేస్తారని వైసీపీ ఊహించకపోవడమే పొరపాటు. బయటకు వెళ్ళిన తరువాత ఆయన ఏమి చేస్తారు అన్నది వైసీపీ ఎందుకు ఆలోచించలేక పోయింది అన్నది కూడా ఇపుడు అందరికీ కలుగుతున్న సందేహం.
ఎవరు ఉన్నారు అని :
ఇక విజయసాయిరెడ్డి వెనక ఎవరు ఉన్నారు అన్నది కూడా వైసీపీకి అంతుబట్టడం లేదు అని అంటున్నారు. ఎవరో ఉండి ఆయన చేత వైసీపీని టార్గెట్ చేయిస్తున్నారా అన్నది కూడా ప్రశ్నగానే ఉంది. విజయసాయిరెడ్డి అయితే సొంత పార్టీ పెట్టుకుంటున్నాను అన్నారు, మరి ఆయన పార్టీ పెట్టినా దానిని కొనసాగించాలంటే ఇమేజ్ ఉండాల్సిందే. అంతే కాదు పార్టీ నిర్వహణ ఆషామాషీ వ్యవహారం కాదు, మరి ఆయన పార్టీ ప్రకటన కూడా వైసీపీకి ఒకింత ఇబ్బందే అని అంటున్నారు. ఎలాగంటే ఆయన వేరే పార్టీలో చేరితే అక్కడ నుంచి ఆయన చేసే విమర్శలకు ఇంత విశ్వసనీయత ఉండదు, ఆయన ఇలా సొంతంగా ఉంటూ చేసే విమర్శలు ఎంతో కొంత ఆలోచింపచేస్తాయని అంటున్నారు. దాంతోనే విజయసాయిరెడ్డి ప్రకటనలు ఆయన వేస్తున్న అడుగులు వైసీపీలో అయితే కొంత కలవరం రేకెత్తిస్తోంది అని అంటున్నారు. ఆయనని పట్టించుకోమని అంటూనే సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇచ్చిన వివరణ సుదీర్ఘమైనదిగా ఉంది అంటే విజయసాయిరెడ్డి టార్గెట్ కి వైసీపీ ఇబ్బంది పడుతున్న వైనం కనిపిస్తోంది. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి ఆగేది ఉండదనే అంటున్నారు. మరి ముందు ముందు ఆయన విమర్శలకు వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది, అంతకంటే తీవ్రమైనవి చేస్తే ఎలా అన్నది కూడా చర్చకు వస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.