మరో నిర్భయ దారుణం: కదులుతున్న స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై గ్యాంగ్ రే*ప్

ఘాతుకానికి ఒడిగట్టిన అనంతరం నిందితులు ఏమీ తెలియనట్లు బాలికను కశ్మీరీ గేట్ బస్ స్టాండ్ వద్ద దింపేసి పారిపోయారు.

Update: 2026-08-31 06:09 GMT

దేశ రాజధాని నగర పరిసరాల్లో మహిళల భద్రత మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. నాడు 'నిర్భయ' ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడగా నేడు సరిగ్గా అదే తరహాలో ఒక 16 ఏళ్ల అమాయక బాలికపై జరిగిన దారుణం సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కదులుతున్న స్లీపర్ బస్సులోనే రక్షణ కల్పించాల్సిన డ్రైవర్, కండక్టర్లే కామాంధులుగా మారి ఆ చిన్నారి జీవితాన్ని చీకటిమయం చేశారు.

47 కిలోమీటర్ల భయానక ప్రయాణం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలిక ఇంట్లో గొడవపడి నోయిడాలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. గ్రేటర్ నోయిడాలోని 'పరీ చౌక్' వద్ద ఢిల్లీ వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు ఎక్కింది. ఆ పసిపాపకు తెలియదు.. తాను ఎక్కింది బస్సు కాదు.. ఒక నరకకూపమని.. పరీ చౌక్ నుంచి ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వరకు ఉన్న దాదాపు 47 కిలోమీటర్ల ప్రయాణంలో ఆ నిముషాలు బాలికకు నరకాన్ని చూపించాయి. స్లీపర్ బస్సులోని బెర్త్‌లకు, కిటికీలకు ఉన్న తెరలను ఆసరాగా చేసుకుని.. డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ కలిసి ఆ మైనర్ బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఆక్రందనలు ఆ బస్సు నాలుగు గోడల మధ్యే నలిగిపోయాయి.

రోడ్డుపై పడేసి వెళ్లిపోయిన కామాంధులు

ఘాతుకానికి ఒడిగట్టిన అనంతరం నిందితులు ఏమీ తెలియనట్లు బాలికను కశ్మీరీ గేట్ బస్ స్టాండ్ వద్ద దింపేసి పారిపోయారు. తీవ్ర భయాందోళనలో మాట్లాడలేని అచేతన స్థితిలో ఉన్న ఆ చిన్నారి ఎలాగోలా కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. రక్తమోడుతున్న శరీరంతో మానసిక వేదనతో ఉన్న కుమార్తెను చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల వేగవంతమైన చర్యలు.. నిందితుల అరెస్ట్

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు తిమర్‌పూర్ ప్రాంతంలో దాక్కున్న డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన స్లీపర్ బస్సును సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. నిందితులపై కఠినమైన పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఈ ఘటనతో ప్రజా రవాణా వ్యవస్థల్లో మహిళల భద్రత ఎంత ప్రమాదకరంగా ఉందో మరోసారి బయటపడింది. ఆ కామాంధులను కఠినంగా శిక్షించి, ఆ బాధితురాలికి త్వరితగతిన న్యాయం జరగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News