మరో సంచలనం దిశగా.. ట్రంప్ ఏఐ వీడియో.. ఏం చేయబోతున్నారు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక విచిత్రమైన, సంచలనాత్మక ఏఐ వీడియో ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర తీవ్రతను సృష్టించింది.

Update: 2026-08-31 07:29 GMT

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పతాక స్థాయికి చేరాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక విచిత్రమైన, సంచలనాత్మక ఏఐ వీడియో ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర తీవ్రతను సృష్టించింది.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే "ఖర్గ్ ఐలాండ్" చమురు మౌలిక వసతులు, రిఫైనరీలు భారీ పేలుళ్లతో ధ్వంసమవుతున్నట్లు ఈ కృత్రిమ మేధ వీడియోలో చూపించారు. ట్రంప్ పెట్టిన క్యాప్షన్ ప్రపంచదేశాల్లో తీవ్ర కలకలానికి దారితీసింది.

సైనిక చర్యకు సంకేతమా? ఒత్తిడి పెంచే వ్యూహమా?

ఇది కేవలం ఇరాన్‌ను భయపెట్టడానికి చేసిన మానసిక యుద్ధమా? లేక ఖర్గ్ ఐలాండ్‌పై ప్రత్యక్ష దాడికి ముందస్తు హెచ్చరికనా? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ట్రంప్ వీడియో పోస్ట్ చేయడానికి కొద్ది సమయం ముందే అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన "లారక్ ఐలాండ్‌"లోని రాకెట్ లాంచర్లపై డ్రోన్లతో దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించడంతో ఈ ఏఐ వీడియో ప్రభావం మరింత తీవ్రమైంది.

ఖర్గ్ ఐలాండ్ ప్రాముఖ్యత ఇదీ

ఇరాన్ మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఈ ఒక్క ద్వీపం నుంచే జరుగుతాయి. లోతైన సముద్ర జలాలు ఉండటంతో భారీ ఆయిల్ ట్యాంకర్లు ఇక్కడ సులభంగా లోడింగ్ పూర్తి చేసుకుంటాయి. ‘కెప్లర్’ , ‘విండ్‌వర్డ్’ వంటి మారిటైమ్ ఇంటెలిజెన్స్ సంస్థల ప్రకారం.. ఖర్గ్ ద్వీపంలో చమురు రవాణా కార్యకలాపాలు ఇప్పటికే గణనీయంగా మందగించాయి. అక్కడ ఉన్న ప్రధాన ఆయిల్ లోడింగ్ బెర్త్‌లు ఖాళీగా కనిపిస్తున్నట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

గ్లోబల్ మార్కెట్‌పై ప్రభావం

ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవడం లేదా ధ్వంసం చేయడంపై ట్రంప్ గతంలో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అమెరికా నిజంగానే ఖర్గ్‌పై దాడి చేస్తే ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్రంగా కుదేలయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా 'హార్ముజ్ జలసంధి' గుండా జరిగే ఇంధన రవాణా పూర్తిగా నిలిచిపోయి.. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.

అమెరికా ప్రభుత్వం వైపు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రణాళిక వెలువడనప్పటికీ ట్రంప్ ఏఐ వీడియో మాత్రం రాబోయే పెద్ద సైనిక చర్యకు బలమైన హెచ్చరికగానే నిపుణులు భావిస్తున్నారు.


Full View


Tags:    

Similar News