'విజయ్ ఫర్ పీఎం'.. కాంగ్రెస్ మంత్రి సంచలన వార్నింగ్

తాజాగా ఈ వివాదంపై తమిళనాడు కాంగ్రెస్ మంత్రి రాజేష్ కుమార్ చేసిన హెచ్చరిక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Update: 2026-08-31 07:45 GMT

తమిళనాడులో అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీపై మిత్రపక్షం కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ దేశ ప్రధాని అభ్యర్థి అవుతారంటూ టీవీకే మంత్రులు, ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఈ వివాదంపై తమిళనాడు కాంగ్రెస్ మంత్రి రాజేష్ కుమార్ చేసిన హెచ్చరిక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు మంత్రి రాజేష్ కుమార్ టీవీకే అధిష్టానానికి స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా టీవీకే తిరస్కరిస్తే రాష్ట్ర కేబినెట్‌ నుంచి కాంగ్రెస్ మంత్రులు వెంటనే రాజీనామా చేస్తారంటూ రాజేశ్ కుమార్ చేసిన ప్రకటన కాకరేపుతోంది. దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న రాహుల్ గాంధీ ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని, 2029లో ఆయనే దేశ ప్రధాని అవుతారని మంత్రి రాజేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో కాంగ్రెస్ మద్దతుతో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విజయ్ ప్రభుత్వం కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు అత్యంత కీలకం. ఇప్పుడు విజయ్ ప్రధాని అభ్యర్థి అంటూ టీవీకే చేస్తున్న హడావుడి కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రాజేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి.

ఇటీవల విడుదలైన ఇండియా టుడే సర్వేలో విజయ్ ప్రధాని అభ్యర్థిగా మూడో స్థానంలో ఉన్నారని వెల్లడించింది. ఇక అప్పటి నుంచి టీవీకే శ్రేణులు విజయ్ ఫర్ పీఎం అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీవీకే మంత్రులు ఇంకా తమ అభిమాన సంఘాల మూడ్‌లోనే ఉన్నారని, వాస్తవ రాజకీయాలకు దూరంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామి. జాతీయ స్థాయిలో 'ఇండియా' కూటమికి రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ గట్టిగా భావిస్తోంది. మరోవైపు, ప్రాంతీయ పార్టీగా బలపడుతున్న టీవీకే అధినేత విజయ్‌ను జాతీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ మంత్రి నేరుగా కేబినెట్ బహిష్కరణ, రాజీనామా హెచ్చరికలు జారీ చేయడం కూటమిలో తీవ్ర కుదుపునకు కారణమైందని అంటున్నారు. ఇది రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సివుందని అంటున్నారు.

Tags:    

Similar News