స్టాండింగ్ ఒవేషన్.. వెలిగొండలో చంద్రబాబుకు అపూర్వ గౌరవం!
మార్కాపురం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
మార్కాపురం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. శ్రీశైలం నుంచి ఫీడర్ కెనాల్ ద్వారా వచ్చిన కృష్ణా జలాలను నల్లమల సాగర్ లోకి నింపి అక్కడి నుంచి కాలువల ద్వారా మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో పొలాలకు విడుదల చేసే కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో కొన్ని అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు ముఖ్యమంత్రి చాలా ఉత్సాహంతో కనిపించారు. అంతేకాకుండా కృష్ణా జలాలకు హారతి ఇచ్చే కార్యక్రమానికి సంప్రదాయ పంచెకట్టులో సీఎం హాజరై అబ్బురపరిచారు.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు రెగ్యులర్ గా కనిపించే డ్రెస్సింగ్ కు భిన్నంగా సంప్రదాయ పంచెకట్టుతో రావడం ప్రత్యేక చర్చకు తావిచ్చింది. హిందూ సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందు వల్ల సీఎం ఫ్యాంటుకు బదులుగా పంచె ధరించి వచ్చారని చెబుతున్నారు. ఇక కృష్ణా హారతి ఇచ్చిన తర్వాత సీఎం సాష్టాంగ నమస్కారం చేయడం కూడా ఆకట్టుకుందని అంటున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ బంజారా నృత్యంతో మహిళలు, విద్యార్థులు నిర్వహించిన కళా ప్రదర్శన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇక ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరణ తర్వాత ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి వెళ్లగా అక్కడ సభికులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. ఈ దృశ్యాన్ని చూసి పులకించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సభ మధ్యలోకి వెళ్లి తన భుజంపై ఉన్న పచ్చని కండువాను ఊపుతూ సభికులను ఉత్సాహ పరిచారు. ముఖ్యమంత్రి స్వయంగా కండువా ఊపుతూ ఉర్రూతలూగడంతో సభికులు కూడా ప్రతిస్పందనగా తమ కండువాలను గాలిలో తిప్పుతూ ప్రాజెక్టు ప్రారంభంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఆ తర్వాత ముఖ్యమంత్రి వేదికపై ఆశీసులు అవ్వగా, సభకు హాజరైన అతిథులు ఒక్కొక్కరుగా సీఎంను కీర్తిస్తూ ప్రసంగించారు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, దశాబ్దాల కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేయాలని కోరారు. ముఖ్యమంత్రి ఎంతో శ్రమతో వెలిగొండ జలాలను కరువు సీమకు తీసుకువచ్చారని, ఆయన శ్రమకు తగిన గౌరవం ఇవ్వాలని చెబుతూ సభికులు అంతా నిల్చొని చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు. ఇలా ఎంపీ అన్న వెంటనే సభకు హాజరైన వారంతా లేచి నిల్చొని చప్పట్లు కొడుతూ ముఖ్యమంత్రి పట్ల తమ గౌరవాన్ని ప్రదర్శించారు. ఇలా వెలిగొండ సభ ఆద్యంతం ఉత్సాహంగా సాగడంపై ప్రభుత్వ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.