కూట‌మికి 'వెలిగొండ'... ఓట్ల సిరులు!

మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని దాదాపు లక్షా 19 వేల ఎకరాలకు సాగునీరు ఈ వెలిగొండ తొలి ద‌శ ప్రాజెక్టు ద్వారా లభిస్తుంది.

Update: 2026-08-31 10:02 GMT

ఒక ప్రాజెక్టు రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపుతుందా? ఓటు బ్యాంకుగా మారుతుందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తుంది. ముఖ్యంగా క‌రువు పీడిత ప్ర‌కాశం, మార్కాపురం(కొత్త జిల్లా) నెల్లూరు, క‌డ‌ప జిల్లాల్లోని 30 మండ‌లాల్లో తాజాగా సీఎం చంద్ర‌బాబు ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు కీల‌క మార్పులు తీసుకురానుంది. త‌ద్వారా.. ఆయా మండ‌లాల్లోని సుమారు 6 ల‌క్ష‌ల మందికిపైగా ప్ర‌జ‌ల జీవితాల్లోనూ మార్పు తీసుకువ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇక‌, సాగు భూములు మునుప‌టి మాదిరిగా చుక్క‌నీటి కోసం బిక్క‌మొహం వేయ‌కుండా.. జ‌ల జ‌ల పారే కృష్ణానీటితో క‌ళ‌క‌ళ లాడ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదేస‌మ‌యంలో నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఫ్లోరైడ్ నీరు లేదా .. ప్ర‌భుత్వం ట్యాంకుల ద్వారా సర‌ఫ‌రా చేస్తున్న నీటిపైనే ఆధార‌ప‌డిన ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు .. కృష్ణాన‌ది నీరు గంగా జ‌లంలా.. వారి దాహార్తిని తీర్చ‌నుంది. అదేస‌మ‌యంలో ఫ్లోరైడ్ ముప్పును కూడా ప‌రిహ‌రించ‌నుంది.

రాజ‌కీయంగా ప్ర‌భావం..

మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని దాదాపు లక్షా 19 వేల ఎకరాలకు సాగునీరు ఈ వెలిగొండ తొలి ద‌శ ప్రాజెక్టు ద్వారా లభిస్తుంది. ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలలోని సుమారు 4 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. ఇవ‌న్నీ కూడా రాజ‌కీయంగా ప్ర‌భావితం చూపించే అంశాలే కావ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో ఇప్ప‌టికే ఉమ్మ‌డి ప్ర‌కాశం , నెల్లూరు జిల్లాల్లో టీడీపీ స‌హా కూట‌మి పార్టీల‌కు బ‌లం ఉంది. అయితే.. 30 ఏళ్ల క‌ల సాకారం కావ‌డం.. రైతుల‌కు నీటిని స‌మృద్ధిగా అందిస్తున్న నేప‌థ్యంలో మ‌రింత‌గా కూట‌మి ప్ర‌భావం పెరుగుతుంద‌న్న అంచ‌నాలు వ‌స్తున్నాయి.

వెలిగొండ ప్రాజెక్టుతో క‌డ‌ప‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం మ‌రింత చ‌ర్చ‌నీయాంశం. ఈ జిల్లాలోని బ‌ద్వేలు, మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు ఇత‌ర ప్రాంతాల్లోని కరవు పీడిత మండలాల్లో ఉన్న‌ వేలాది ఎకరాల ఆయకట్టుకు శాశ్వతంగా సాగునీరు అందుతుంది. శ్రీశైలం జలాశయం నుండి తరలించే కృష్ణా వరద జలాలు ఈ ప్రాంతాల్లోని వ్యవసాయ స్థిరత్వానికి తోడ్పడతాయి. నీటి లభ్యత పెరగడం వల్ల రైతులు అరటి, బొప్పాయి వంటి వాణిజ్య, ఉద్యానవన పంటల సాగును మ‌రింత పెంచుకునే అవ‌కాశం ఉంది. ప‌రోక్షంగా కూట‌మికి ఇక్క‌డ ఓటు బ్యాంకు పెరుగుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. మొత్తంగా వెలిగొండ.. ప్ర‌జ‌ల‌కు నీటి సిరులు అందిస్తే.. కూట‌మికి ఓట్ల సిరులు అందించ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News