వెలిగొండ ఓపినింగ్.. జగన్, షర్మిల రియాక్షన్ ఇదే..

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై విపక్ష నేతలు మాజీ సీఎం జగన్మోహరెడ్డి, ఆయన సోదరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షరాలు వైఎస్ షర్మిల స్పందించిన తీరు చర్చనీయాంశం అవుతోంది.

Update: 2026-08-31 13:50 GMT

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై విపక్ష నేతలు మాజీ సీఎం జగన్మోహరెడ్డి, ఆయన సోదరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షరాలు వైఎస్ షర్మిల స్పందించిన తీరు చర్చనీయాంశం అవుతోంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ ఏం లేదని అంతా తమ తండ్రి రాజశేఖరరెడ్డి సంకల్పంతోనే ప్రాజెక్టు కల సాకారమైందని ఇద్దరూ వేర్వేరుగా ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. జగన్, షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల్లో వెలిగొండ విషయంలో మాత్రం ఆ ఇద్దరూ తమ తండ్రి చేసిన కృషిని చాటిచెప్పేందుకు ఒకే తరహాలో ప్రకటనలు చేయడం ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.

మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం తాను శంకుస్థాపన చేశానని, తిరిగి తానే ప్రారంభోత్సం చేశానని చెప్పారు. అంతేకాకుండా ఈ 30 ఏళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులు ఎవరెవరు ఎంత కేటాయించారనే లెక్కలు సైతం వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహనరెడ్డి కలిసి సుమారు 11 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపి కేవలం 2,175 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అదే సమయంలో ఐదేళ్లు ముఖ్యమంత్రులుగా పనిచేసిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి రూ.2,417 కోట్లు వెలిగొండ కోసం వెచ్చించారని వివరించారు. ఇక తన హాయాంలో మొత్తం రూ.5,667 ఖర్చు చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. ప్రస్తుతం రూ.4 వేల కోట్లు వరకు ఖర్చు చేశానని, మిగిలిన మొత్తంతో రెండో దశ పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు.

క్రెడిట్ చోరీ అంటూ జగన్ ట్వీట్

ఇక సీఎం ప్రకటనలు, వెలిగొండ ప్రారంభోత్సవంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం, మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం, ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది.’’ అంటూ ట్వీట్ చేశారు. వెలిగొండపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న హడావిడి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని రోజులుగా చేస్తున్నవన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్‌ చోరీ ప్రయత్నాలే అంటూ జగన్ రెడ్డి తన ట్వీట్ లో విమర్శించారు.

శిలాఫలకం మాత్రమే మీది…

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వేసిన శిలాఫలకం మాత్రమే చంద్రబాబుది అంటూ మాజీ సీఎం జగన్ విమర్శించారు. సంకల్పం, సమగ్ర నిర్మాణం వైయస్సార్‌ది అంటూ స్పష్టం చేశారు. ఇక కీలకమైన కీల‌క జంట సొరంగాల తన ప్రభుత్వం పూర్తి చేసిందంటూ వెల్లడించారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు అంటూ స్పష్టం చేశారు. ‘‘వెలిగొండకు ప్రాణం 37.587 కిలోమీటర్ల జంట సొరంగాలు. అవి లేకపోతే కృష్ణా జలాలు రావు. వైయస్సార్‌ ప్రారంభించిన నిర్మాణ దశలో 20.333 కిలోమీటర్లు పూర్తయ్యాయి. 2014–19 మధ్య మీ హయాంలో జరిగింది కేవలం 6.686 కిలోమీటర్లు మాత్రమే. ఒక్క సొరంగానికీ కూడా బ్రేక్‌త్రూ సాధించలేకపోయారు’’ అంటూ విమర్శించారు. మా ప్రభుత్వ హయాంలో కరోనా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే అత్యంత క్లిష్టమైన 10.568 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వినట్లు వివరించారు. హెడ్‌ రెగ్యులేటర్లు, కాలువల అనుసంధాన పనులు చేపట్టి నీటి తరలింపునకు తమ ప్రభుత్వం అన్నీ సిద్ధం చేసిందని పేర్కొన్నారు. ఏ కాంట్రిబ్యూషన్‌ లేకుండానే మొత్తం క్రెడిట్‌ను కాజేయాలనుకోవడం మీ సహజ నైజానికి మరో నిదర్శనం కాదా? అంటూ విమర్శలు గుప్పించారు.

వైఎస్ కృషిని స్మరించుకోవాలి : షర్మిల

ఇక కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా వెలిగొండ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్స్ లో ట్వీట్ చేశారు. మూడు దశాబ్దాలకు వెలిగొండ మొదటి దశ పూర్తి చేశారంటూ ఎద్దేవా చేస్తూనే శుభసూచకమంటూ పేర్కొన్నారు. తీవ్ర కరువురక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ఇకనైనా సాగు, త్రాగు నీరు మరింత మెరుగ్గా అందుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే మహానేత డాక్టర్ . వైఎస్సార్ ఆశయం, కృషిని స్మరించుకోవాలని, వెలిగొండకు వెలుగు ఆయనే అంటూ తన తండ్రి గొప్పతన్నాన్ని వివరించారు. మూడు దశాబ్దాల వెలిగొండ ప్రజాస్వప్నంపై మహానేతది చెరగని సంతకం. కాగితాల నుంచి క్షేత్రస్థాయికి, కాలువల నుంచి సొరంగాల వరకు సింహభాగం పనులు పూర్తి చేశారని స్పష్టం చేశారు. రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ఫలితంగానే మార్కాపురం వాసులకు తాగు, సాగునీరు అందుతోందని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును ఎక్కువ శాతం రాజశేఖరరెడ్డి పూర్తి చేస్తే, తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేశానని గొప్పలు చెప్పుకొనే ముందు చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. 10 శాతం పనులు చేసి క్రెడిట్ తమదే అంటూ చెప్పుకోవడానికి సిగ్గుపడాలని ఆరోపించారు. ఇక రెండో దశ పనులు, నిజాయితీ, నిబద్ధతతో పూర్తిస్థాయి పునరావాసంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.





Tags:    

Similar News