గుడివాడ వైసీపీలో గడబిడ.. మాజీ మంత్రి కొడాలిపైనే ఆశ!
స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఉత్కంఠకు దారితీస్తున్నాయి.
స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఉత్కంఠకు దారితీస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో వచ్చే ఫలితాలు కూటమి ప్రభుత్వానికి రెఫరెండంగా పరిగణించే పరిస్థితులు ఉండగా, వచ్చే ఎన్నికల నాటికి నిలదొక్కుకోవాలంటే ఈ ఎన్నికల్లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితిలో విపక్షం వైసీపీ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలోని ముఖ్యనేతలకు చెందిన నియోజకవర్గాల్లో ఎన్నికలు ఎలా ఉంటాయనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గంపై దృష్టిపెట్టిన అధికార టీడీపీ ‘వైనాట్ పులివెందుల’ అంటూ గర్జిస్తుంది. ఇక వైసీపీలో జగన్ తర్వాత టీడీపీ మెయిన్ టార్గెట్ గా ఉన్న మాజీ మంత్రి కొడాలిని కూడా దెబ్బతీయాలనే వ్యూహంతో ఆయన సొంత నియోజకవర్గం గుడివాడపైనా పక్కా వ్యూహరచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
వైసీపీ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుడివాడ మున్సిపాలిటీని ఆ పార్టీ సునాయాశంగా దక్కించుకుంది. మొత్తం 31 వార్డులు ఉండగా, అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఇటువంటి బలమైన పట్టు ఉన్న మున్సిపాలిటీని నిలబెట్టుకోవడం ఇప్పుడు వైసీపీకి అత్యంత ప్రధానంగా చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు అనేక సవాళ్లు విసుతున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ ఇంచార్జి, మాజీ మంత్రి కొడాలి నాని స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో కేడర్ డీలా పడుతోందని అంటున్నారు. రెండేళ్లుగా ఆయన ఎక్కువగా హైదరాబాదులోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నా, బలమైన ప్రభుత్వంతో ఢీకొట్టడం కేడర్ కు అంత ఈజీ ఏమీ కాదని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో గుడివాడ మున్సిపాలిటీపై వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు. మాజీ మంత్రి కొడాలి అందుబాటులో ఉంటే కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించగలమని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అయితే కొడాలి ఎన్నికల ముందు వచ్చి ప్రచారం చేస్తామంటే ఫలితం ఉండదని తేల్చిచెబుతున్నారు. దీంతో గుడివాడ భారం అంతా మాజీ మంత్రి కొడాలి భుజాలపై మోపుతున్న పరిస్థితి ఉందని అంటున్నారు. నిజానికి గుడివాడలో రెండు దశాబ్దాలుగా కొడాలి నాని పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఓడిపోయారు. పట్టణంలో వ్యక్తిగత ఇమేజ్ ఉండటంతో వైసీపీ గట్టి పోటీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే కొడాలి తక్షణం హైదరాబాద్ వదిలి వస్తేనే ఈ పోటీ ఇవ్వగలిగే పరిస్థితిలో వైసీపీ ఉంటుందనే అంచనాలు వేస్తున్నారు.
మరోవైపు మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు టీడీపీలో ఉండటం కూడా వైసీపీకి ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. ఒకప్పుడు మాజీ మంత్రి కొడాలి సన్నిహితుడిగా పట్టణంలో రాజకీయాలను యలవర్తి చక్కబెట్టేవారని, కొడాలి లేకున్నా ఆయన తన ప్రతిభతో పార్టీని నడిపించేవారని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన టీడీపీ తరఫున గట్టిగా పనిచేయడం, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూడా టీడీపీ కేడర్ కు వెన్నుదన్నుగా నిలుస్తూ మున్సిపాలిటీపై పసుపు జెండా ఎగరేసేలా వ్యూహాలు రచిస్తుండటంతో వైసీపీ కేడర్ వెనక్కి తగ్గాల్సివస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా కీలకమైన గుడివాడలో వైసీపీ పూర్వవైభం సాధించాలంటే మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి కొడాలి చూసే తెగువే ప్రధాన పోషిస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.