తెలంగాణలో ఎవరికి అడ్వాంటేజ్.. డీలిమిటేషన్ లెక్కలు
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం సన్నాహాలు చేస్తుండటం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.;
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం సన్నాహాలు చేస్తుండటం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కొత్తగా పెరుగుతున్న నియోజకవర్గాల వల్ల ఎవరికి ప్రయోజనం? అన్న ప్రశ్న ఉత్కంఠకు గురిచేస్తోంది. సహజంగా నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందని విశ్లేషిస్తుంటారు. అయితే తెలంగాణ వరకు వచ్చేసరికి ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుందా? అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎన్నికల కమిషన్ పరిధిలో జరిగే ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం నియంత్రించే అవకాశం ఉండగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతోంది. దీంతో తెలంగాణ డీలిమిటేషన్ ప్రక్రియ ఉత్కంఠకు గురిచేస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలలోనే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తెలంగాణలో కొత్తగా 7 వరకు పార్లమెంటు స్థానాలు పెరగనున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు సగానికి సగం పెరిగి 119 నుంచి 178 లేదా 179 స్థానాలకు పెరిగే పరిస్థితి ఉందని అంటున్నారు.
తెలంగాణలో అదనంగా 50 శాతం సీట్లు పెరగనుండటం ఎవరికి అడ్వాంటేజ్ అన్న చర్చకు కారణమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరోసారి తన ప్రభుత్వమే వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసంతో కనిపిస్తోంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి అధికారాన్ని అందుకోవాలని తెగతాపత్రయపడుతోంది.
ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజనను అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా, కాంగ్రెస్, బీజేపీ ఎనిమిది స్థానాలు చొప్పున గెలుచుకున్నాయి. ఇక వచ్చే ఎన్నికలు జమిలి విధానంలో జరిగే అవకాశం ఉండటంతో బీజేపీ తనకు అనుకూలంగా డీలిమిటేషన్ జరిగేలా చూసుకుంటుందని అంటున్నారు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ డీలిమిటేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాల్సివుంటుందని, ఆ విధంగా కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా మార్చుకునే పరిస్థితి కూడా ఉందంటున్నారు.
మొత్తానికి ఇరుపక్షాల మధ్య బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ పడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమదూరం పాటిస్తోంది. బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు జరిగాయని ప్రచారం జరిగినా, అదంతా పొలిటికల్ డ్రామాగానే ముగిసింది. యథావిధిగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ను బలహీనం చేస్తేనే తమకు లాభమని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయని అంటున్నారు. దీంతో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఉన్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధానికి తెరతీస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.