'రేఖ' దాటిన సురేఖ .. రాజీనామా ? తొలగింపా ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వేడెక్కాయి. మొన్నటి దాకా ప్రశాంతంగా సాగుతున్న సర్కారులో మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత వ్యాఖ్యలు మంటలు రేపాయి.

Update: 2026-08-21 09:39 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వేడెక్కాయి. మొన్నటి దాకా ప్రశాంతంగా సాగుతున్న సర్కారులో మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత వ్యాఖ్యలు మంటలు రేపాయి. సీఎం రేవంత్ రెడ్డి మీద, ఆయన సోదరుడి మీద, మంత్రి పొంగులేటి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిల మీద చేసిన వ్యాఖ్యలపై రేవంత్ వర్గం కొండా కుటుంబం మీద ఆగ్రహంగా ఉంది.

సుష్మిత వ్యాఖ్యల మీద జారీచేసిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చిన కొండా సురేఖ అందులో తన కూతురు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటిని తనకు ఆపాదించడం సరికాదని పేర్కొన్నది. కానీ తన కూతురు చేసిన వ్యాఖ్యల పట్ల కనీసం అభ్యంతరం వ్యక్తం చేయలేదని, అదే సమయంలో కనీసం దురదృష్టకరం అని ఖండించక పోవడం కూడా రేవంత్ వర్గం ఆగ్రహానికి కారణంగా కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం గాంధీభవన్లో సమావేశం అయిన 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొండా సురేఖ కూతురు వ్యాఖ్యలతో పాటు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మీద, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలు ఎప్పుడూ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని, గతంలో సమంత విషయంలో చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేశాయని, అసలు కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలు కూడా కానీ సుష్మిత పార్టీ ఎమ్మెల్యే గురించి అడ్డగోలుగా మాట్లాడే బజారు కల్చర్ ఏంటని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రశ్నించారు.

పిల్లకాకి కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు కొండా సురేఖ మాటలు గానే భావిస్తున్నామని మరో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. తమ పార్టీలోనే కొన్ని గుంట నక్కలు కొండా సురేఖ వెనక ఉన్నాయని, ఆమెను పార్టీ నుండి బహిష్కరించకముందే ఆమె వెళ్లిపోతే బాగుంటుందని, కనీసం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతో అయినా ఆమె కలుపుగోలుగా ఉందా అని ప్రశ్నించారు. అయితే కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో పెట్టిన సమావేశంలో చిన్నారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను కూడా బహిష్కరించాలని డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొన్నది.

సాధారణంగా ఒకే కుటుంబంలోని వ్యక్తులు వివిధ రాజకీయా పార్టీలలో కొనసాగడం సాధరణంగా జరుగుతూ ఉంటుంది. ఇతర పార్టీలలో ఉండి విమర్శలు చేయడం సాధారణం. అయితే కొండా సురేఖ, కొండా మురళి దంపతులకు ఉన్నది ఒక్కతే కూతురు. తను భవిష్యత్తులో పరకాల ఎమ్మెల్యే అవుతుందని కొండా సురేఖ భర్త మురళి కొద్ది రోజుల క్రితం ప్రకటించాడు. ఆ తర్వాత పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పరకాల నుండి మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తాడని ప్రకటించిన నేపథ్యంలోనే కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

కూతురు వ్యాఖ్యలను కొండా సురేఖ ఎక్కడా ఖండించడం లేదా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. అదే సమయంలో సురేఖ భర్త కొండా మురళి ఎక్కడా స్పందించలేదు. అదే సమయంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సుష్మిత చెప్పడం వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తుంది. తన వ్యాఖ్యల మీద స్పందిస్తే రేవంత్ రెడ్డి చిట్టా విప్పుతానని కొండా సుష్మిత ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా గాంధీభవన్ లో కాంగ్రెస్ ప్రజాప్రతినిదుల మీడియా సమావేశం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సుష్మిత ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖ విషయంలో అధిష్టానం ఎలా వ్యవహరిస్తుంది ? ఆమెను మంత్రి పదవి నుండి తప్పించాలని రేవంత్ వర్గం డిమాండ్ చేస్తుందా ? లేక సురేఖ స్వయంగా రాజీనామా చేస్తుందా ? బీసీ మహిళ అయిన నేపథ్యంలో చర్యలు లేకుండా మరోసారి పార్టీ అధిష్టానం రాజీ కుదిరిస్తుందా ? అన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News