కార్తీక పౌర్ణమి....365 ఒత్తుల ఆధ్యాత్మిక సందేశం
| కార్తీక పౌర్ణమిని శివకేశవులకు ప్రీతికరమైన పర్వదినంగా భావిస్తారు. త్రిపురాసుర సంహారానికి గుర్తుగా దేవతలు దీపాలు వెలిగించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున మహిళలు తులసి కోట వద్ద 365 వత్తులతో దీపారాధన చేస్తారు. ఏడాది పొడవునా దీపం వెలిగించినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.
కార్తీక మాసం అంటేనే పుణ్యమైన మాసంగా చెబుతారు. తెలుగు వారికి ఉన్న పన్నెండు నెలలలో ఎంతో పవిత్రమైన మాసంగా దీనికి పురాణేతిహాసాలలో ప్రత్యేకత ఉంది. ప్రతీ ఒక్క రోజూ ఈ నెలలో ఆరాధ్యనీయమైనదే. కార్తీక మాసం వచ్చిందంటే సోమవారాలు ఉపవాసాలు, అలాగే ఏకాదశులు, పున్నములు ఇలా ఎన్నో విశేషాలు ఉంటాయి. ఇక మహిళలు ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలో తేలియాడే దినంగా కార్తీక పున్నమి పండుగను చెప్పుకుంటారు. కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి తిథి కార్తీక పౌర్ణమిగా చెబుతారు. అంతే కాదు ఇది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర పర్వదినంగా కూడా పేర్కొంటారు.
పురాణ ప్రాశస్త్యం :
కారీక పున్నమికి పురాణ ప్రాశస్త్యం ఎంతో ఉంది. తారకాసురుడి ముగ్గురు కుమారులను పరమశివుడు సంహరించిన రోజు ఇదే అని పురాణాలు చెబుతున్నాయి. ఆనాటి విజయానికి గుర్తుగా దేవతలు దీపాలు వెలిగించారని పురాణాలలో ఉంది. అందుకే కార్తీక పున్నమి రోజుని త్రిపుర పూర్ణిమగా దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. ఇక కార్తీక పున్నమి వేడుక వెనక ఉన్న ఆధ్యాత్మిక సందేశం కూడా గొప్పదిగా చెబుతారు. మనిషి తనలోని అహంకారం అజ్ఞానం తొలగి ధర్మ మార్గంలో నడవాలనే సందేశాన్ని ఈ పర్వదినం అందిస్తుంది.
దీపారాధన ప్రత్యేకత :
కార్తీక పున్నమి వేళ దీపారాధన అతి ముఖ్యంగా ఉంటుంది. అలాగే దీపదానం కూడా చేస్తారు. శివుడు, విష్ణువు కొలువు తీరిన ఆలయాల్లోనూ తమ ఇంటి పెరడులో ఉన్న తులసి కోట వద్ద మహిళలకు పున్నమి వేళ దీపాలు వెలిగిస్తారు. ఉసిరికాయ మీద ఒత్తిని పెట్టి దీపం పెట్టడం కూడా ఆచారంగా ఉంటుంది. ఏకంగా 365 ఒత్తులతో దీపారాధన చేస్తారు. సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా 365 ఒత్తులు వెలిగిస్తే ఏడాది పొడవునా దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజూ దీపం వెలిగించడం కుదరని వారు ఈ ఒక్క రోజు 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం ద్వారా ఆ ఫలితాన్ని పొందవచ్చని భావిస్తారు.
జ్ఞానం కోసం :
దీపాలు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని కూడా భక్తులు విశ్వాసంగా ఉంటుంది. సాధారణంగా ఆవు నెయ్యి నువ్వుల నూనెతో శివాలయాలు లేదా తులసి కోట వద్ద ఈ దీపాలను వెలిగిస్తారు. ఇక చెరువులు నదీ తీరాల్లో దీపదానం మహిళలు చేయడం మరో విశేషంగా ఉంటుంది. అదే విధంగా తెల్లవారుజామునే పవిత్ర నదీ స్నానం చేసి శివునికి రుద్రాభిషేకం, కేదారేశ్వర వ్రతం, తులసీ పూజ నిర్వహిస్తారు. అంతే కాకుండా కార్తీక పున్నమి వేళ శైవ క్షేత్రాల్లో జ్వాలా తోరణం నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబర్ 24న మంగళవారం శుభప్రదమైన రోజున కార్తీక పున్నమి రావడంతో మరింత ఉత్సాహంగా భక్తులు ఈ వేడుకను జరుపుకుంటున్నారు.