యుద్ధం అంటే వినాశనమే.. రాలిపోయిన 7 లక్షల రష్యన్ల ప్రాణాల కన్నీటి కథ
| రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో సుమారు 7 లక్షల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు స్వతంత్ర పరిశోధనా సంస్థల అంచనాలు కలవరపెడుతున్నాయి. వేలాది మంది ఆచూకీ లేకుండా పోవడంతో వారి కుటుంబాలు ఎదురుచూపుల్లోనే కాలం గడుపుతున్నాయి. యుద్ధం మిగిల్చిన విషాదం అంతులేని మానవ నష్టాన్ని గుర్తుచేస్తోంది.
వాకిట్లో అడుగుల చప్పుడు వినిపిస్తే చాలు.. ‘నా కొడుకు వచ్చాడేమో’ అని ఆశగా తొంగిచూసే ఓ వృద్ధ తల్లి... రోజూ సాయంత్రం తలుపు చప్పుడైతే.. ‘నాన్న వచ్చాడని’ సంబరపడుతూ పరుగెత్తుకొచ్చే పసిపిల్లలు... నుదుటి సిందూరం చెదరకుండా.. గుండెల్లో భయాన్ని దిగమింగుకుని భర్త రాకకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఇల్లాలు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లకు చేరువవుతున్న వేళ సరిహద్దుల్లో వినిపిస్తున్న తుపాకుల మోత కంటే.. వేలాది ఇళ్లలో వినిపిస్తున్న ఈ నిశ్శబ్ద రోదనలే ఇప్పుడు ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తున్నాయి.
స్వతంత్ర పరిశోధనా సంస్థలు మెడూజా, మీడియాజోనా బయటపెట్టిన లెక్కలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. అధికారిక లెక్కల ప్రకారం 4.9 లక్షల మంది మరణించినట్లు చెబుతున్నా.. 2025, 2026 నాటి రికార్డులు, యుద్ధభూమిలో ఆచూకీ లేకుండా పోయిన వారిని కలుపుకుంటే సుమారు 7 లక్షల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారనే వార్త కలవరపెడుతోంది.
7 లక్షల ప్రాణాలు.. కాగితంపై రాస్తే అది కేవలం ఒక సంఖ్య. కానీ ఒక్కసారి కళ్లు మూసుకుని ఆలోచిస్తే.. అవి 7 లక్షల కుటుంబాల కలలు.. 7 లక్షల ఇళ్లలో ఆరిపోయిన దీపాలు. దేశం కోసం అడుగు ముందుకేసిన ఆ యువకులు.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారన్న నిజాన్ని ఆ కుటుంబాలు ఎలా జీర్ణించుకోగలవు?
యుద్ధం మిగిల్చే విషాదం ఎంత క్రూరమైనదో చెప్పడానికి గల్లంతైన సైనికుల కుటుంబాలే నిదర్శనం. కనీసం తమ వారు శవపేటికలోనైనా ఇంటికి వస్తే కడసారి చూసుకుని గుండె బాదుకుని ఏడవడానికి అవకాశం ఉంటుంది. కానీ వేలాది కుటుంబాలకు ఆ భాగ్యం కూడా దక్కడం లేదు. "నా కొడుకు బతికే ఉన్నాడా? లేక ఏ అడవిలోనో.. ఏ కందకంలోనో మట్టిలో కలిసిపోయాడా?" అన్న ప్రశ్న ఆ తల్లులను ప్రతి క్షణం సజీవ దహనం చేస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏ ఫోన్ కాల్ వచ్చినా గుండె ఆగినంత పనవుతోంది.
సరిహద్దు రేఖలు మార్చడానికి.. ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి దేశాధినేతలు వేసే వ్యూహాల్లో.. సమిధలుగా మారుతున్నది మాత్రం ఏ పాపం ఎరుగని సాధారణ సైనికులే. రేపు ఈ యుద్ధం ముగిశాక చరిత్ర పుస్తకాల్లో ఎవరు గెలిచారని రాసుకున్నా.. తండ్రిని కోల్పోయిన ఆ పసివాడికి నాన్నను ఎవరు తిరిగి ఇవ్వగలరు? కొడుకును కోల్పోయిన ఆ తల్లి కడుపుకోతను ఏ విజయం తీర్చగలదు?
తుపాకీ తూటాలకు బలైన ఆ 7 లక్షల ప్రాణాల సాక్షిగా.. ఈ యుద్ధం రాస్తున్నది ఏ దేశపు విజయగాథ కాదు.. అది కేవలం మానవత్వం ఓడిపోయిన ఒక విషాదగాథ మాత్రమే.. ఎప్పటికి ఆగుతుందో ఈ మారణహోమం.. ఎప్పటికి ఆరుతాయో ఆ తల్లుల కన్నీళ్లు.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సృష్టించింది అంతులేని ఓ మారణహోమమే..