టి-కాంగ్రెస్‌లో బాబు కోవర్టులు..జడ్చర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఎవరిపై?

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాంచి దూకుడు ఉన్న నాయకుడు. పలు అంశాల్లో ఆయన తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేస్తారు.;

Update: 2025-07-05 16:14 GMT

ఉన్నట్లుండి తెలంగాణ కాంగ్రెస్‌ టీ కప్పులో తుఫాను రేగింది... అసలే బనకచర్ల రగడ దుమారం రేపుతుండగా.. ఏపీ నాయకులతో సంబంధాల వ్యవహారం రచ్చ జరుగుతుండగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఎప్పుడు సమయం దొరుకుతుందా? అని ఎదురుచూస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు ఆయుధంగా మారే అవకాశం ఇచ్చాయి. చినికిచినికి వివాదం ఏకంగా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వద్దకు కూడా చేరింది. ఆయన ఆ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకూ పంచాయతీ ఎక్కడ మొదలైందంటే....?

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాంచి దూకుడు ఉన్న నాయకుడు. పలు అంశాల్లో ఆయన తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేస్తారు.

ఇలానే తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అవి టీపీసీసీ చీఫ్‌ దృష్టికీ రావడంతో ఆయన స్పందించాల్సి వచ్చింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. ‘‘తెలంగాణ కాంగ్రెస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు ఉన్నారు. వారే ఇక్కడ కాంట్రాక్టులు, సాగునీటి ప్రాజెక్టులు చేస్తున్నారు. వారిని కట్‌ చేస్తే బనకచర్ల ప్రాజెక్టు దానంతటదే ఆగిపోతుంది’’ అని అనిరుధ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. బనకచర్ల ఇప్పటికే దుమారం దుమారంగా మారింది. నీళ్లు నిధులు అంటూ ఉద్యమించే బీఆర్‌ఎస్‌కు లేనిపోని ఆయుధం అయింది.

దాన్నుంచి బయటపడాలని అధికార కాంగ్రెస్‌ చూస్తుంటే.. అనిరుధ్‌ రెడ్డి మాత్రం ఏకంగా చంద్రబాబు కోవర్టులు ఆ ప్రాజెక్టును చేపడుతున్నారని అనడం గమనార్హం. విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు టీపీసీసీ చీఫ్‌ పరిశీలనకు తీసుకెళ్లారు. ఇప్పుడు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మల్లు రవి విచారణ జరిపి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌కు నివేదిక ఇవ్వనున్నారు.

తన వ్యాఖ్యలు తీవ్ర వివాదం రేపడంతో అనిరుధ్‌ రెడ్డి స్పందించారు. తాను మాట్లాడింది కాంట్రాక్టర్లను ఉద్దేశించి అని, పార్టీ నాయకుల గురించి కాదని వివరణ ఇచ్చారు. ఈ వివాదంలోకి సీఎం రేవంత్‌రెడ్డిని లాగొద్దని కోరారు. కాగా, అనిరుధ్‌ రెడ్డి వ్యాఖ్యలు.. తాము ఎప్పటినుంచో చేస్తున్న వాదనలకు అనుకూలంగా ఉండడంతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వాగతించారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుందో చూడాలి.

కొసమెరుపుః టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లు రవి.. ఒకప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యేనే. 2008 ఉప ఎన్నికలో ఆయన ఇక్కడనుంచి గెలుపొందారు.

Tags:    

Similar News