తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్.. కాకరేపుతున్న రాజకీయం!
కట్ చేస్తే.. బీజేపీ ఇప్పుడు సంచలన ప్రకటన చేసింది. అసలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు తాము సంపూర్ణంగా వ్యతిరేకమని పార్టీ తెలంగాణ చీఫ్ రాంచందర్ రావు ప్రకటించారు.;
తెలంగాణ రాజకీయాలు గత కొన్నాళ్లుగా బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రభుత్వ పక్షం కాంగ్రెస్.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు రెడీ అయింది. అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల నుంచే అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీలో పాస్ చేసి.. రాష్ట్రపతికి పంపింది. అయితే..అక్కడ నుంచి రిప్లయ్ రాకపోవడంతో గవర్నర్‌కు పంపించి.. ఆర్డినెన్సు ద్వారా అయినా.. ఈ రిజర్వేషన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. కానీ.. గవర్నర్‌కు పంపించి.. సుమారు వారం రోజులు అయినా.. రాజ్‌భవన్ కూడా మౌనంగా ఉంది.
దీనిపై అధికార పార్టీలో చర్చ సాగుతోంది. ఇక, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ దీనిపై ఆచి తూచి వ్యవహరిస్తోంది. బీసీలకు రిజర్వే షన్లు కల్పించాలని బలంగా చెప్పలేక పోతోంది. చెప్పినా.. సర్కారుపై విమర్శలు చేస్తోంది తప్ప.. చిత్తశుద్ధి కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నా యి. కాంగ్రెస్ ఈ విషయంలో బలంగా ఎదురు దాడి చేస్తోంది. అయితే.. బీఆర్ ఎస్‌లో ఇతర నాయకులు ఎలా ఉన్నా.. ఎమ్మెల్సీ కవిత మాత్రం కొంత జోరుగానే స్పందిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసనగా రైల్ రోకోకు పిలుపునిచ్చినా.. సరైన మద్దతు కొరవడంతో వెనక్కి తగ్గారు.
కట్ చేస్తే.. బీజేపీ ఇప్పుడు సంచలన ప్రకటన చేసింది. అసలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు తాము సంపూర్ణంగా వ్యతిరేకమని పార్టీ తెలంగాణ చీఫ్ రాంచందర్ రావు ప్రకటించారు. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని.. ఇప్పటికే 10 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కేటాయించారని.. అలాంటప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంటే.. ఇది పక్కా మోసమని.. ప్రజలను మాయ చేస్తున్నారని.. దీనిలో బీజేపీ భాగస్వామ్యం కాబోదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనేతాము.. దూరంగా ఉంటున్నామన్నారు.
అంతేకాదు.. దీనిని షెడ్యూల్ 9(తమిళనాడు మాదిరిగా)లో చేర్చే ప్రసక్తి లేదన్నారు. ఇది రాజకీయ రిజర్వేషన్ల వ్యూహమని.. దీనిలో తాము భాగస్వామ్యం కాబోమని వెల్లడించారు. అయితే.. బీజేపీ చేసిన ప్రకటన రాజకీయంగా ఆ పార్టీని ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. తెలంగాణ వ్యాప్తంగా రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్న సమయంలో బీజేపీ ఉన్నట్టుండి ఇలా ప్రకటించడంపై సొంత పార్టీ నాయకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది సుదీర్ఘ కాలంలో బీజేపీని ఇబ్బందుల్లోకి నెడుతుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.