డాగేశ్ దెబ్బకు ఓలా రైడ్.. అదీ 180 మీటర్లకే
ఊబర్.. ఓలా.. రాపిడో.. ఇలా చెప్పుకుంటూ పోతే.. వాహన సేవలకు సంబంధించి ఎన్నో తలనొప్పులను తగ్గించిన ఈ యాప్ లు.. కొన్ని కొత్త సమస్యల్ని తెచ్చినా.. తాము వెళ్లాల్సిన గమ్యస్థానాలకు ఇట్టే చేరేలా అత్యధికులకు సేవలు అందుతున్న సంగతి తెలిసిందే.;
ఊబర్.. ఓలా.. రాపిడో.. ఇలా చెప్పుకుంటూ పోతే.. వాహన సేవలకు సంబంధించి ఎన్నో తలనొప్పులను తగ్గించిన ఈ యాప్ లు.. కొన్ని కొత్త సమస్యల్ని తెచ్చినా.. తాము వెళ్లాల్సిన గమ్యస్థానాలకు ఇట్టే చేరేలా అత్యధికులకు సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారంగా ఈ సేవల్నినిత్యం లక్షలాది మంది వినియోగించుకుంటున్నారు. ఇలాంటి వేళ.. తాజాగా ఒక ఓలా రైడర్ కు ఎదురైన అనుభవం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి కారణం.. ఒక అమ్మాయి తన రైడ్ ను కేవలం 180 మీటర్ల దూరానికే బుక్ చేయటం.
పట్టపగలు నిర్మానుష్యంగా ఉన్న వీధిలోకి ఒక టీనేజ్ యువతి రైడ్ బుక్ చేయటం.. ఆమెను పికప్ చేసుకోవటానికి వచ్చిన సదరు ఓలా రైడర్.. ఆమె బుకింగ్ ను ఒకటికి రెండుసార్లు చెక్ చేయగా.. కేవలం 180 మీటర్లు మాత్రమే ఉండటం ఆశ్చర్యపోయాడు. దీంతో.. ఆమెనుఎక్కించుకున్న అతను.. ఇంత తక్కువ దూరానికి ఓలా రైడ్ ఎందుకన్న సందేహాన్ని తీర్చుకోకుండా ఉండలేకపోయాడు. అదే విషయాన్ని ఆ టీనేజ్ అమ్మాయిని అడగ్గా.. నిజమే.. దూరం తక్కువే. కానీ దారిలో కుక్కలే ఎక్కువ అంటూ తన బుకింగ్ కు అసలు కారణం చెప్పటంతో ఆశ్చర్యపోవటం రైడర్ వంతైంది.
తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. కొన్నిగంటల వ్యవధిలోనే 20 లక్షల మంది ఈ వీడియోను చూడటం గమనార్హం. అంతేకాదు.. పలువురు దీనిపై స్పందిస్తూ వ్యాఖ్యలు చేశారు. రైడ్ మొదలైనంతనే తన సందేహాన్ని రైడర్ అడగ్గా.. ఆమె సమాధానం ఇచ్చేలోపే గమ్యస్థానానికి చేరుకున్నట్లుగా పేర్కొన్నారు. ఈ రైడ్ కోసం ఆమె రూ.19 చెల్లించారు. 180 మీటర్లకు బైక్ బుక్ చేయొచ్చని తనకు ఇప్పుడే అర్థమైందని పేర్కొన్న రైడర్ పోస్టుకు పలువురు స్పందించారు. స్ట్రీట్ డాగ్ ను డాగేశ్ గా పేర్కొన్న పలువురు నెటిజన్లు.. 'డాగేశ్ ఉన్నాడంటే ఎవరైనా ఆ మాత్రం భయపడాల్సిందే' అంటూ పేర్కొనటం ఆసక్తికరంగా మారింది.