టీడీపీలో తూర్పు గాలి...సీనియర్లకు అర్థం కావాలి !
టీడీపీలో ఏ పదవి అయినా సరే ఇక మీదట కొత్త వారికే దక్కుతుంది. అలాగే యువతకే పెద్ద పీట వేస్తారు. అదే విధంగా జనాలకు న్యూ ఫేస్ చూపిస్తుంది.
తూర్పు అంటే మార్పు. తూర్పు అంటే వేకువ. తూర్పు అంటే అరుణోదయం. కొత్త ఆవిష్కరణ. నూతనమైన రోజు పుట్టుక. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. ఇపుడు టీడీపీలో కూడా తూర్పు గాలి బలంగా వీస్తోంది అంటే కొత్త ఉషస్సు కోసం చూస్తోంది. నవ శక్తిని యువ శక్తిని కలిపి పట్టం కడుతోంది. తాజాదనానికి నూతనత్వానికి అగ్ర తాంబూలం అందిస్తోంది. తెలుగుదేశంలో మొదలైన ఈ పరిణామ క్రమం అయితే అనివార్యం. ఇది జరిగి తీరాల్సిందే. ఒక రాజకీయ పార్టీ తన దశ దిశను ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది. కాలానికి ఎవరూ ఎదురీదలేరు. కాలం తెచ్చే మార్పులు చేదుగా ఉన్నా స్వీకరించాల్సిందే. టీడీపీలో ఇపుడు కొత్త పూత పూస్తోంది.
అంటే పాత రోతని కాదు, కాస్తా పక్కకు తొలగమని మాత్రమే అర్ధం.
సీనియర్లకు బ్యాక్ బెంచ్ :
ఒక రాజకీయ పార్టీ ఎన్నో సార్లు ఎందరికో అవకాశం ఇస్తోంది. అలా ఇవ్వడం కేవలం భారతీయ రాజకీయాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే మన దగ్గర వృద్ధ నాయకత్వం ఉంటుంది.రెండున్నర లక్షల జనాభాకు ఒకరు ఎమ్మెల్యే అవుతారు. ఇరవై లక్షల జనాభాకు ఒకరు ఎంపీ అవుతారు. ఇక మంత్రి అయ్యేవారు కనీసంగా పాతిక లక్షల మందిలో ఒకరే ఉంటారు. ఇవన్నీ రాజకీయ గణితాలు. జాతకాలు నమ్మినా నమ్మకపోయినా ఈ గణితాన్ని ఫాలో కావాల్సిందే. ఇక చూస్తే దేశంలో ట్రెడిషనల్ పార్టీలు అనేకం ఉన్నాయి. అవి ఒక అభ్యర్ధికే పదే పదే అవకాశాలు ఇస్తూ పోతూంటాయి. దాని వల్ల ఆయా నియోజకవర్గాలలోనే చాలా మంది జెండా మోసి ముసలివారు అయిపోతున్నారు. చాన్స్ మాత్రం దక్కడం లేదు. ఎట్టకేలకు టీడీపీ ఈ సత్యం తెలుసుకుంది. మార్పు కనిపిస్తోంది. దాంతో సీనియర్లకు బ్యాక్ బెంచ్ చూపిస్తోంది.
ఏ పదవి అయినా సరే :
టీడీపీలో ఏ పదవి అయినా సరే ఇక మీదట కొత్త వారికే దక్కుతుంది. అలాగే యువతకే పెద్ద పీట వేస్తారు. అదే విధంగా జనాలకు న్యూ ఫేస్ చూపిస్తుంది. ఆ తాజాదనమే పార్టీకి ఎనలేని ధనంగా మారి మరిన్ని దశాబ్దాల పాటు పార్టీ ప్రగతి దారులలో పయనిస్తుందని నమ్ముతోంది. దాంతో అది ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎంపీ అయినా రాజ్యసభకు అయినా యూత్ కే టీడీపీ ప్రయారిటీ ఇస్తోంది. తాజాగా టీడీపీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక అలాగే జరిగింది. దాంతో సీనియర్లు ఖంగు తింటున్నారు అని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ పరిణామ క్రమం అన్నది 2024 నుంచే మొదలైంది. అది ఇప్పటికే వారికి అలవాటు కావాలని కూడా అంటున్న వారూ ఉన్నారు.
వీరంతా ఆశించినా :
ఇక టీడీపీకి తాజాగా మూడు రాజ్యసభ సీట్లు ఉంటే దాని కోసం పెద్ద ఎత్తున పోటీ జరిగింది. ఆ లిస్ట్ చూస్తే మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య వంటి ఉన్నారు. వీరంతా రాజ్యసభకు వెళ్ళాలని ఉత్సాహం చూపించారు. కానీ టీడీపీ లిస్ట్ చూస్తే సీనియారిటీకి నో చాన్స్ అని తేలిపోయింది ఇది పార్టీకి మంచిదని అంతా అంటున్నారు. అయితే సీనియర్లు మాత్రం నొచ్చుకుంటున్నారు. తమకు లేదా అవకాశం అని మధన పడుతున్నారు. అది సహజమైన పరిణామం. కానీ ఎవరూ చేయగలిగింది అయితే లేదు టీడీపీ ఒక విధానం పెట్టుకుని ముందుకు సాగుతోంది. నాలుగున్నర దశాబ్దాల టీడీపీ కొత్త రెక్కలు తొడుక్కోవాలని చూస్తోంది. కొత్త నీరుని ఆహ్వానిస్తోంది. అందుకే ఈ ఎంపికలు అని అంటున్నారు సీనియర్లు ఆశించడంలో తప్పు కాదు కానీ ఆవేదన చెందడంలోనే ఉంది అని అంటున్నారు. టీడీపీలో మారుతున్న గాలిని అర్ధం చేసుకోవాల్సి ఉందని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే పార్టీ ఏపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు ఆశావహులకు స్వయంగా ఫోన్లు చేసి సర్ది చెబుతున్నారని భోగట్టా.