30 ఏళ్లలో తొలిసారి.. పులివెందులలో టీడీపీ చారిత్రక విజయం

దశాబ్దాలుగా కొనసాగుతున్న వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి తొలిసారి టీడీపీ బ్రేక్ వేసింది.;

Update: 2025-08-14 09:45 GMT

పులివెందుల కోటలో మూడు దశాబ్దాల తర్వాత టీడీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా మారిన పులివెందులలో పసుపు జెండా ఎగరేయడంతో ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటోంది. కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం అంటే వైఎస్ కుటుంబం కంచుకోటగా భావిస్తారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఏడు మండలాలు ఉండగా, దాదాపు అన్నిచోట్ల వైఎస్ కుటుంబమే శాసిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి తొలిసారి టీడీపీ బ్రేక్ వేసింది. ఏకంగా నియోజకవర్గ కేంద్రం పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుని సరికొత్త రికార్డు స్థాపించింది. అంతేకాకుండా ఎదురేలేదు అన్న చోట వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ లేకుండా చేసింది. సరైన రీతిలో ఎన్నిక నిర్వహించలేదని, అసలు ఇది ఎన్నికే కాదని వైసీపీ చెబుతున్నా, అధికారిక రికార్డుల్లో మాత్రం టీడీపీ గెలుపు చిరస్థాయిగా నిలిచిపోతుందని అంటున్నారు.

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన నుంచి ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది. 1955 నుంచి 2011 వరకు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి మినహా మిగిలిన అన్నిసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2011లో వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ వైసీపీయే విజయబావుటా ఎగురవేసింది. 1962లో ఒకసారి మాత్రమే ఇండిపెండెంట్ పులివెందుల నుంచి గెలిచారు. ఇక 1983లో టీడీపీ ఆవిర్భవించిన నుంచి ఇక్కడ కనీసం ఖాతా తెరవలేదు. 1983, 1985, 1994, 1999, 2014, 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ పులివెందుల ఎమ్మెల్యేను మాత్రం గెలిపించుకోలేకపోయింది.

అదేసమయంలో మండల వ్యవస్థ ఆవిర్భవించిన నుంచి పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 1995లో ఒకసారి మాత్రమే పులివెందులలో టీడీపీ జడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన 2001, 2006, 2014, 2021 ఎన్నికల్లో పులివెందుల ఏకగ్రీవం అవుతూనే వచ్చింది. అయితే 2021లో పులివెందుల స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకున్న వైసీపీ, జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి మరణంతో తాజాగా ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సి వచ్చింది.

పులివెందులలో 1978లో తొలిసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా వైఎస్ కుటుంబ సభ్యులే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. ఈ 45 ఏళ్లలో ప్రత్యర్థులు మారారే కానీ, వైఎస్ కుటుంబ సభ్యుల విజయాన్ని ఆపలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు ఇన్నాళ్లు వచ్చాయి. అయితే తొలిసారిగా టీడీపీ వైఎస్ కుటుంబ జైత్రయాత్రను నిలువరించింది. 8 వేల ఓట్లు పోలైన జడ్పీటీసీ స్థానంలో కనీసం వెయ్యి ఓట్లు తెచ్చుకోలేకపోయింది. అయితే స్థానికేతరులు ఓట్లు వేశారని, ఇది ఎన్నికే కాదని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. ఏదిఏమైనా ఏకపక్ష ఫలితం తీసుకురావడంలో టీడీపీ రాజకీయంగా సక్సెస్ అయిందని అంటున్నారు.

Tags:    

Similar News