బెజ‌వాడ రాజ‌కీయం ఏక ఛ‌త్రాధిప‌త్య‌మేనా.. !

సీనియర్ నాయకులు విజయం సాధించిన నియోజకవర్గాల్లో ఆధిపత్యం, లేదా ఏక ఛ‌త్రాధిపత్యంగా నాయకులు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.;

Update: 2025-07-07 12:30 GMT

సీనియర్ నాయకులు విజయం సాధించిన నియోజకవర్గాల్లో ఆధిపత్యం, లేదా ఏక ఛ‌త్రాధిపత్యంగా నాయకులు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఎన్నిసార్లు గెలిచినా.. ఒకప్పుడు నాయకులు ప్రజలను పట్టించుకునేవారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రాధాన్యం వచ్చేవారు. అడపా దడపా మాత్రమే సొంత కార్యక్రమాలు చేసుకునేవారు. కానీ, రాను రాను ఈ పరిస్థితి మారిపోయింది. వరుసగా విజయాలు దక్కించుకున్న నాయకులతోపాటు 10 -15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నేతలు ఏకఛ‌త్రాధిపత్యంగా తమ నియోజకవర్గాల్లో రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ముఖ్యంగా విజయవాడ వంటి రాజకీయ చైతన్యం ఉన్న నగరాల్లో ఈ తరహా పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుండడం విశేషం. విజయవాడ సెంట్రల్, అదేవిధంగా తూర్పు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టిడిపి విజయం దక్కించుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం బిజెపి తరఫున సుజనా చౌదరి గెలిచారు. ఆయన సంగతి ఎట్లా ఉన్న.. విజయవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో మాత్రం ఒకింత రాజకీయాల వేరేగా నడుస్తున్నాయని టిడిపిలోనే చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజకీయాలు వేరేగా ఉన్నాయ‌ని టిడిపి నాయకులు చెబుతున్నారు.

వాస్త‌వానికి బొండా ఉమా అంటే మాస్ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తొలుత పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఆయన 2014లో తొలిసారి విజయం దక్కించుకున్నారు. ఆ క్రమంలోనే వైసీపీ నాయకులపై విరుచుకుపడడం ద్వారా చంద్రబాబు కనుసన్న‌ల్లో పడ్డారు. దీంతో తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. అయితే అది రాలేదు. తర్వాత 2019లో పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. అయితే నియోజకవర్గంలో ఆయన ప్రజలకు చేరువ కాకపోవడంతో పాటు కీలక నాయకులకు కూడా ఆయన అందుబాటులో ఉండడం లేదన్నది ప్రస్తుతం చర్చగా మారింది.

అంతేకాదు పార్టీలో కూడా ఆయన సీనియర్లకు దూరంగా ఉండటం తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్లడం అదేవిధంగా వ్యాపారాలు వ్యవహారాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారని విమర్శలు పెరుగుతున్నాయి. ఇది సరికాదు అన్నది సీనియర్లే చెబుతున్న విషయం. ఇక తూర్పు నియోజకవర్గంలో 2014 నుంచి వరుసగా విజయాలు దక్కించుకుంటున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చాలా సైలెంట్ గా ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన కూడా పార్టీ నాయకులకు దూరంగా ఉంటూ సొంత వ్యవహారాలు చేసుకుంటున్నారని ఎక్కువగా ఆయన అసలు నియోజకవర్గంలోనే ఉండడం లేదని చర్చ నడుస్తుంది.

కీలకమైన విజయవాడలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు ఇలా చేయటం వల్ల పార్టీకి ఇప్పటికిప్పుడు ఇబ్బందులు లేకపోయినా భవిష్యత్తులో మాత్రం ఇబ్బందులు తప్పవని సీనియర్లు అంచనా వేస్తున్నారు. మరి వీరికి వీరు సరి చేసుకుంటారా లేకపోతే అధిష్టానం వీరిని సరిచేయాలా అనేది చూడాలి. ప్రస్తుతం చంద్రబాబు పిలుపు ఇచ్చిన సుప‌రిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఈ రెండు నియోజకవర్గాలను ఇప్పటివరకు మొదలు కాలేదు. దీనిని బట్టి వారు ఏ మేరకు పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనేది అర్థమవుతుంది. అయితే వారు పార్టీకి అనుకూలంగానే ఉన్నా.. సొంత ప్రనుల్లోనే ఎక్కువ సమయం పెట్టుకోవడం వల్ల విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News