ఇక, మొదలు: కూటమి సర్కారుకు సెగే.. !
రాష్ట్ర ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఎన్నికలకు ముందు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా.. ఇప్పుడు వారి నుంచి అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి.;
కూటమి సర్కారుకు ఇప్పటి వరకు ఉన్న గ్రాఫ్ వేరు. ఇక నుంచి ఉండబోయే గ్రాఫ్ వేరు. ఈ విషయంలో స్పష్టత వచ్చేసింది. అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తున్నామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఉద్యోగ వర్గాల నుంచి సెగ తగులుతోంది. ముఖ్యంగా మూడు కీలక డిమాండ్లపై వారు ఉద్య మానికి రెడీ అవుతున్నారు. మరోవైపు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ కూడా వ్యహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ పరిణామాలు సర్కారుకు సెగ పెంచడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు.
ఉద్యోగుల విషయం..
రాష్ట్ర ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఎన్నికలకు ముందు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా.. ఇప్పుడు వారి నుంచి అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా మూడు కీలక డిమాండ్లు ఉన్నాయి.
1) డీఏ బకాయిల చెల్లింపులు: మొత్తంగా మూడు డీఏ బకాయిలు ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. వీటిలో కనీసం రెండు చెల్లించాలని కోరుతున్నారు. ఈ భారం కనీసంలో కనీసం 30 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
2) 12వ పీఆర్సీ: వైసీపీ హయాంలోనే 12వ పీఆర్సీ వేశారు. అయితే.. చైర్మన్‌ను నియమించినా.. ఆ చైర్మన్ తమకు వద్దని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయడంతో వెనక్కి తగ్గారు. ఇక, ఆ తర్వాత ఎన్నికలు రావ డంతో వైసీపీ ఈ విషయాన్ని పక్కన పెట్టింది. ఇప్పుడు మరోసారి ఉద్యోగులు అదే డిమాండ్‌ను తెరమీదికి తెస్తున్నారు. తక్షణం 12వ పీఆర్సీని వేయాలని కోరుతున్నారు. అయితే.. ఇది జరిగితే.. ప్రభుత్వంపై మరింత భారం పడే అవకాశం ఉందని సర్కారు ఆలోచనగా ఉంది.
3) వైసీపీ రగడ: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. తాము కూడా ఉద్యో గులతో కలిసి ఉద్యమిస్తామని వైసీపీ ప్రకటించింది. ఇటీవల 32 విభాగాలను ప్రైవేటుకు అప్పగించేలా యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ.. ఉద్యోగులు కార్మికులు ఉద్యమించారు. ఇప్పుడు వైసీపీ కూడా తోడైతే.. ఆ ప్రభావం టీడీపీపై మరింత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఏం చేయాలన్న విషయంపై సీఎం చంద్రబాబు సమాలోచన చేస్తున్నారు. మొత్తంగా వీటిని సర్దు బాటు చేసుకుంటారో.. లేక ఉద్యమాల వరకు వెయిట్ చేస్తారో చూడాలి.