మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యేలు.. సీనియ‌ర్‌.. జూనియ‌ర్ వివాదం..!

గత ఎన్నికల్లో విజయం సాధించిన చాలామంది సీనియర్లను సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో తీసుకుంటారని భావించారు.;

Update: 2025-04-21 22:00 GMT

గత ఎన్నికల్లో విజయం సాధించిన చాలామంది సీనియర్లను సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో తీసుకుంటారని భావించారు. అయితే కొంతమందికి అవకాశం దక్కినా చాలామంది సీనియర్లకు అవకాశం ద‌క్కలేదు. యువతను ప్రోత్సహించడం కావచ్చు లేదా వైసిపి అనుసరించిన `కొత్తవారికి అవకాశం` ఇవ్వాలనేట‌టువంటి ఉద్దేశంతో చంద్రబాబు కొత్తవారికి అవకాశం కల్పించారు. ఇదే ఇప్పుడు కొన్ని జిల్లాల్లో నాయకుల మధ్య గ్యాప్ ను పెంచేసింది.

సీనియర్లు జూనియర్లు అనే పెద్ద చర్చ నడుస్తుండడం మంత్రి వచ్చినా సహకరించకపోవడం, ఏం జరిగినా కూడా మంత్రి చూసుకుంటాడనేటటువంటి ఉద్దేశంతో చాలామంది సీనియర్ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు పార్టీలో చర్చగా మారాయి. చిత్తూరు జిల్లాలో టిడిపి సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వంటి వారు పార్టీని గతంలో ముందుకు తీసుకువెళ్లారన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఎన్నికల్లో విజయం సాధించిన వీరిద్దరూ మంత్రి పదవులు ఆశించారు. కానీ ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వడం కుదరని నేపథ్యంలో కొత్తగా ఎంపికైన రాంప్రసాద్ రెడ్డిని చంద్రబాబు తన టీం లో చేర్చుకున్నారు. ఇదే వివాదానికి దారితీసింది. తమకన్నా జూనియర్ పైగా తొలిసారి గెలిచిన రాంప్రసాద్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారా అని అమర్నాథరెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంత్రి జిల్లాకు వచ్చినా లేక జిల్లాలో పార్టీ కార్యక్రమాల విషయం చర్చకు వచ్చినా కూడా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు.

పైగా తమకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని కూడా నాయకులు బాధపడుతున్నారు. ఇటీవల నామినేటెడ్ పదవుల విషయంలో అటు అమర్నాథరెడ్డి ఇటు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా కొంతమంది పేర్లను సూచించారు. తమ వారికి పదవులు ఇవ్వాలని చెప్పారు. కానీ ఆ జాబితా ఏమైందో వారికి కూడా తెలియకుండా పోయిందని దీంతో తమ మొహాలు చూపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తూర్పుగోదావరి విషయానికి వస్తే చాలామంది నాయకులు తప్పుకొని జనసేన నాయకులకు అవకాశం కల్పించారు.

జనసేన నుంచి గెలిచిన వారిలో కొంతమంది తొలిసారి ఎమ్మెల్యేలైన వారు కూడా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేల ముందు వీరి ప్రయత్నాలు ఏవి సాగడం లేదు. కనీసం పింఛన్ కొత్తగా రాయమని చెప్పినా కూడా పనులు చేయడం లేదని టిడిపి నాయకులు మండిపడుతున్నారు. తమకు విలువ లేకుండా పోయిందని తాము టికెట్లు త్యాగం చేసి ఇచ్చిన ఏమాత్రం పట్టించుకోవడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలి అని అనుకున్నా.. ఏర్పాట్ల విషయానికి వచ్చేసరికి చాలామంది నాయకులు వెనక్కి తగ్గడం దీనికి నిదర్శనంగా మారింది. ఇలాంటి విషయాలపై చంద్రబాబు పట్టించుకోకపోతే ముందు ముందు ఇది వివాదంగా మారి ఇరు పార్టీలకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని సీనియర్లు చెబుతున్నారు.

Tags:    

Similar News