టీడీపీ మహానాడుకు ధీటుగా వైసీపీ భారీ ప్లాన్ ?
ఏపీ రాజకీయ తెర పైన వైసీపీ సందడి తగ్గిపోతోంది. ఆ పార్టీ విపక్షంలోకి వచ్చి రెండేళ్ళు అవుతోంది.
ఏపీ రాజకీయ తెర పైన వైసీపీ సందడి తగ్గిపోతోంది. ఆ పార్టీ విపక్షంలోకి వచ్చి రెండేళ్ళు అవుతోంది. అధినేత జగన్ వెయిట్ అండ్ సీ అన్నట్లుగా ఉన్నారు అధినేత జనంలోకి వెళ్ళకపోవడంతో నాయకులు కూడా అదే విధంగా ఉన్నారని అంటున్నారు. ఇక గతంలో వైసీపీ అధికారంలో ఉన్నపుడు కోటి గొంతుకలు వినిపించేవి ఎన్నో పదవులు సృష్టించి మరీ వైసీపీ ప్రభుత్వంలో పంచి పెట్టారు. పంచాయతీ వార్డు నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా వైసీపీ వారే ఉన్నారు. నామినేటెడ్ పదవులు వీటికి అదనం. ఇలా లెక్కలేనన్ని పదవులు తీసుకున్న వారు అంతా వైసీపీ ఓటమితో సైడ్ అయిపోయారు. ఈ రోజున వైసీపీ తరఫున కేవలం కొన్ని గొంతులు మాత్రమే వినిపిస్తున్నాయి. అవి కూడా మీడియా ముందు మాత్రమే సౌండ్ చేస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్ లోకి వైసీపీ వెళ్లడం లేదు, మరో వైపు క్యాడర్ ఊసు ఎవరికీ పట్టడం లేదు, పార్టీ అధికారంలో ఉన్నపుడు విపక్షంలో ఉన్నపుడు కూడా క్యాడర్ గోడు పట్టని తీరుతోనే వైసీపీ నిర్లిప్తంగా ఉండిపోతోంది.
రెట్టించిన హుషార్ తోనే :
ఇక సాధారణంగా చూస్తే ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చిన పార్టీకి తొలి ఆరు నెలలే హానీ మూన్ గా ఉంటుంది. ఆ తరువాత అంతా గతుకుల బండి మీద ప్రయాణంగానే సాగుతుంది. ప్రతిపక్షాలు జనంలోకి వచ్చి ఆందోళన చేస్తాయి. అలాగే ప్రజలలో అసంతృప్తి కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. దాంతో పాటుగా పార్టీలో సైతం నాయకులు క్యాడర్ మధ్యన అంతరం అధికారంలో ఉన్న వారి ఆశలు తీరక అలకలు అపోహలు అలజడులు ఇలా సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. కానీ అదేమి చిత్రంలో కూటమికి మాత్రం చాలా విషయాలు కలిసి వస్తున్నాయి. రెండేళ్ళు అవుతున్నా ఇంకా మోజు మీదనే ప్రభుత్వం ఉంది. టీడీపీ తమ నాయకులతో క్యాడర్ తో కో ఆర్డినేషన్ చేసుకుంటోంది. మిత్రుల మధ్య కూడా అగ్ర స్థాయిలో విభేదాలు అయితే లేవు. ఇక విపక్షం వైసీపీ అయితే పూర్తిగా హానీమూన్ చేసుకోమని పొలిటికల్ గ్రౌండ్ అంతా వదిలేసింది. దాంతో కూటమికి ఎదురే లేదన్న వాతావరణం అయితే కనిపిస్తోంది. చర్చ అంతా కూటమి వైపు నుంచే సాగుతోంది. అసెంబ్లీలో ఎటూ విపక్షం లేదు బయట కూడా లేదన్న పరిస్థితి ఏర్పడడానికి కారణం వైసీపీ అధినాయకత్వం ఉదాశీన వైఖరులే కారణం అని అంటున్నారు.
పార్టీ పండుగతో దూకుడు :
టీడీపీ క్రమం తప్పకుండా ప్రతీ ఏటా మహానాడుని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటుంది. ఇది పార్టీ క్యాడర్ కి ఎక్కడ లేని హుషార్ ని తెస్తుంది. అలాంటి సందడి సరదా మరే పార్టీలో కనిపించవు. ఈసారి నెల్లూరులో టీడీపీ మహానాడు జరుపుతోంది. దానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మధ్యనే టీడీపీ జాతీయ రాష్ట్ర స్థాయి కమిటీలని కూడా వేసింది. దాంతో పదవులు అందుకున్న వారంత మరింత జోష్ తో ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ రీ చార్జి అవుతూ స్థానిక ఎన్నికలకు ఫుల్ ప్రిపేర్డ్ గా ఉంది. మరో వైపు చూస్తే వైసీపీ శిబిరం డీలాగా ఉందని అంటున్నారు.
భారీ సభకు తయారు :
ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న వైసీపీ అధినాయకత్వం తమ పార్టీ క్యాడర్ లో కూడా హుషార్ తీసుకుని రావాలని చూస్తోంది అని అంటున్నారు. ఎపుడో 2022 లో వైసీపీ అధికారంలో ఉన్నపుడు గుంటూరు వేదికగా ప్లీనరీని వైసీపీ నిర్వహించింది. ఆ తరువాత చూస్తే నాలుగేళ్లుగా పార్టీ పండుగ అంటూ ఏదీ లేదని అంటున్నారు. దాంతో పార్టీ జనాలకు ఉత్సహం పెంచి గ్రౌండ్ లోకి పూర్తి స్థాయిలో దించడానికి వైసీపీ కూడా మహానాడు తరహాలో రాష్ట్ర స్థాయి పార్టీ సమావేశాలను నిర్వహించాలని చూస్తోంది అని ప్రచారం సాగుతోంది. అది కూడా సాధ్యమైంత తొందరగానే చేయాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. పార్టీ బూత్ లెవెల్ కమిటీలు తొందరలో పూర్తి అవుతాయని చెబుతున్న నేపథ్యంలో అవి పూర్తి కాగానే వైసీపీ కూడా ప్లీనరీ లాంటి భారీ సభలతో ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వస్తుందని అంటున్నారు.