మహానాడులో సంచలన రాజకీయ తీర్మానాలు ?
మహానాడుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహానాడు కడప గడ్డ మీద నిర్వహిస్తున్నారు.;
మహానాడుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహానాడు కడప గడ్డ మీద నిర్వహిస్తున్నారు. అంగరంగ వైభవంగా మహానాడు మూడు రోజుల పాటు జరగనుంది. మహనాడులో ప్రతీ రోజూ కొన్ని కీలక అంశాల మీద తీర్మానాలు ఉంటాయి. అలాగే చివరి రోజున చంద్రబాబు అధ్యక్ష ఉపన్యాసం ఉంటుంది. ఇలా మహానాడు రీసౌండ్ చేసే అవకాశం ఉంది.
ఇక మహానాడులో రాజకీయ తీర్మానాల విషయం మీదనే అంతా ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ఉంది. తెలంగాణాలోనూ ఉంది. అలాగే జాతీయ స్థాయిలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. అక్కడ టీడీపీ మంత్రులు ఉన్నారు.
దాంతో పాటు దేశంలో వర్తమాన రాజకీయాల మీద ఏపీ రాజకీయాల మీద తెలంగాణా రాజకీయాల మీద మహానాడులో చర్చిస్తారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో రాజకీయ తీర్మానాలు ఎలా ఉంటాయన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. పొత్తులతో ఏపీలో కూటమి 2024లో అధికారంలోకి వచ్చింది. దాంతో పొత్తుల పైన మిత్రుల పైనా కూడా మహానాడులో చర్చలు సాగే అవకాశం ఉంది.
అదే సమయంలో సీనియర్లు చాలా మంది పొత్తుల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతోంది అని అంటున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అయితే పొత్తులతో టీడీపీ దెబ్బ తింటోంది అన్న భావన వ్యక్తం చేశారు. టీడీపీకి అవకాశాలు దక్కడం లేదు అని ఆయన అంటున్నారు.
అలాగే కూటమిలో మూడు పార్టీలు ఉండడంతో అవకాశాలు కలసి పంచుకోవాల్సి వస్తోంది దాంతో తమ్ముళ్ళకు ఉన్న అవకాశాలు తగ్గిపోతున్నాయన్న చర్చ ఉంది. ఈ నేపధ్యంలో టీడీపీ రాజకీయ తీర్మానాలలో వీటి గురించి ఏమైనా చర్చిస్తారా టీడీపీ మరింత బలోపేతం అయ్యేలా నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది.
అదే విధంగా చూస్తే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పొత్తులు మరో పదిహేనేళ్ళ పాటు కొనసాగాలని కోరారు. అంతే కాదు కూటమి 2039 దాకా అధికారంలో ఉండాలని అభిలషించారు. దాంతో ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద అభివృద్ధి కోసం పొత్తుల విషయంలో టీడీపీ స్టాండ్ ఏమిటి అన్నది రాజకీయ తీర్మానంలో వెల్లడి అవుతుందని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే మహానాడు ఈసారి టీడీపీలో జరిగే మార్పులకు సంకేతంగా మారబోతోంది అని అంటున్నారు. ఎక్కువగా యువతకు అవకాశాలు ఇచ్చేలా పార్టీలో సమూలమైన మార్పులు ఉంటాయని కూడా చెబుతున్నారు. అదే సమయంలో పార్టీకి సుదీర్ఘ కాలం సేవ చేసిన సీనియర్ల సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
ఇక పార్టీ స్వరూప స్వభావాలలో కూడా కీలక మార్పులు ఉంటాయని అంటున్నారు. ఇక పార్టీలో ఒకే పదవిని ఎక్కువ సార్లు ఒక్కరే చేయడానికి చెక్ పెడతారు అని అంటున్నారు. అలాగే ఒకరికి ఒకే పదవి అన్నది కూడా ఒక నియమంగా తీసుకుని వస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక మహానాడులో ఈసారి రాజకీయంగా సంచలనమైన నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఇక్కడ మరో విషయం కూడా ఉంది సీనియర్ల అభిప్రాయాలను వారి గొంతుని ఈసారి మహానాడులో గట్టిగా వినిపించే చాన్స్ ఉందా అన్నదే అంతటా ఆసక్తిని కలిగించే విషయంగా చూస్తున్నారు.