టీం లోకేశ్ లో ఎవరెవరు ఉంటారు? ‘మహా’ మార్పులే టాక్ ఆఫ్ ద ఏపీ
మహానాడుతో టీడీపీలో భారీ మార్పులపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యువనేత లోకేశ్ ను పార్టీ భావినేతగా ఈ వేడుక ద్వారానే ప్రకటిస్తారని అంటున్నారు.;
మహానాడుతో టీడీపీలో భారీ మార్పులపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యువనేత లోకేశ్ ను పార్టీ భావినేతగా ఈ వేడుక ద్వారానే ప్రకటిస్తారని అంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును మరోమారు ఎన్నుకున్నా.. ఇక నుంచి పార్టీకి లోకేశ్ అన్నీతానై నడిపిస్తారనేది టీడీపీ వర్గాల టాక్. అంతేకాకుండా టీడీపీ ఆవిర్భావం నుంచి కొన్నిపదవుల్లో కొనసాగుతున్న వారు రిటైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా పార్టీలో అత్యంత ప్రధానమైన పొలిట్ బ్యూరోను సమూలంగా ప్రక్షాళించి యువరక్తాన్ని ఎక్కిస్తారని అంటున్నారు. దీంతో టీడీపీ కొత్త జట్టుపై రకరకాల అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
భావినేత లోకేశ్ టీంలో ఎవరు ఉంటారనేది మాత్రమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇదే టాపిక్ టాక్ ఆఫ్ ద ఏపీగా ఉంది. ఎందుకంటే 94 శాతం స్ట్రైక్ రేట్ తో గత ఎన్నికల్లో విక్టరీ కొట్టిన టీడీపీ కూటమి రాష్ట్రం నలుమూలలా అత్యంత బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ వలసలతో కుదేలవుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మరో 30 ఏళ్లు పాలిస్తామని చెప్పుకుంటున్న టీడీపీ.. అందుకు అవసరమైన శక్తిని కూడదీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏ పార్టీ అయిన పది కాలాలు పనిచేయాలంటే సమర్థ నాయకత్వం అత్యంత అవసరం. ప్రస్తుతం చంద్రబాబు రూపంలో టీడీపీకి సమర్థుడైన రాజకీయ చాణక్యుడు ఉన్నారు. అందుకే 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో 30 ఏళ్లుగా ఎటువంటి ఆటంకం లేకుండా చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఇక 75 వసంతాల చంద్రబాబు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఆయన వయసు, పార్టీ భవిష్యత్తు ద్రుష్ట్యా లోకేశ్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా పార్టీలో చంద్రబాబు సహచరులు కూడా తమ పదవులను వీడాలని యువతరం కోరుతుంది. ప్రస్తుతం టీడీపీలో పదవులు, బాధ్యతల బదిలీ తప్పనిసరిగా చేయాలని అంటున్నారు. దీంతో పొలిట్ బ్యూరోలో అత్యంత సీనియర్లు అయిన అశోక్ గజపతిరాజు, యనమల రామక్రిష్ణుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అయ్యన్నపాత్రుడు, కేఈ క్రిష్ణమూర్తి వంటి నేతలు స్వచ్ఛందంగా తప్పుకుని యువతరానికి అవకాశం ఇవ్వాలంటున్నారు.
అయితే 43 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వీరికి ఇప్పుడు ఎలాంటి స్థానం కల్పిస్తారన్న ప్రశ్నతోపాటు వీరి స్థానంలో పార్టీ బాధ్యతలు తీసుకునే నేతలు ఎవరెవరు? అన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. ఇటు శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు వరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి బలమైన నాయకత్వం ఉంది. అయితే రాష్ట్రస్థాయిలో పార్టీని నడిపడంతోపాటు సంక్షోభాలను ఎదుర్కోవడం, చిక్కుముడులను తప్పించడం, కార్యకర్తలకు మార్గదర్శిగా నిలవడం, అధినేతకు, భావినేతకు నమ్మకస్తులుగా ఉండేవారికి మాత్రమే పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇలాంటి వారు ఎవరెవరు? అంటూ పార్టీ పెద్దలు ఇప్పటికే ఆరా తీశారు. ఈ మహానాడులో వారి పేర్లు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. పార్టీ పొలిట్ బ్యూరోలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చేనేతల పేర్లలో కొన్ని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. వాటిలో శ్రీకాకుళం నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష, విజయనగరం నుంచి మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు, విశాఖ నుంచి గంటా శ్రీనివాస్, గోదావరి జిల్లాల నుంచి జ్యోతుల నవీన్, సాన సతీశ్, పుట్టా మహేశ్ కుమర్, క్రిష్ణా నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న పేర్లు వినిపిస్తున్నాయి.
అదేవిధంగా గుంటూరుకు చెందిన కోడెల శివరామ్, కోవెలమూడి రవీంద్ర, లావు శ్రీక్రిష్ణదేవరాయులు, ప్రకాశం జిల్లా నుంచి దామచర్ల సత్య, నెల్లూరు నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటివారి పేర్లు లోకేశ్ జట్టులో ఉండే అవకాశం ఉందంటున్నారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతం నుంచి బైరెడ్డి శబరి, రెడ్డప్పగారి మాధవీరెడ్డి, పరిటాల శ్రీరామ్, జేసీ పవన్ కుమార్ రెడ్డి లేదా అస్మిత్ రెడ్డి వంటివారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు.
పార్టీలో ఇటు యవతరం, అటు వృద్ధనేతలను సమన్వయం చేసేలా కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఉన్న జాతీయ, రాష్ట్ర కార్యవర్గాల్లో 65 ఏళ్లు పైబడి వారిని తప్పించి వారి స్థానంలో 35 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉన్న నేతలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ ఆలోచిస్తోందని చెబుతున్నారు. దీంతో లోకేశ్ జట్టులో చేరబోయే నేతలు ఎవరన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.