బాబు వల్లనే హైదరాబాద్ కి ఐటీ...బిల్ గేట్స్ చెప్పిన వాస్తవం

అయితే ఐటీ కేరాఫ్ హైదారాబాద్ కి కారణం చంద్రబాబే అని చెప్పినది ఎవరో కాదు టెక్ దిగ్గజం బిల్ గేట్స్.;

Update: 2026-02-16 10:30 GMT

ఏపీ సీఎం చంద్రబాబు తన వల్లనే హైదరాబాద్ ఐటీ ఫీల్డ్ డెవలప్ అయింది అంటే చాలా మంది విమర్శలు చేస్తారు. బాబు తాను చేసిన మంచి పని గురించి క్రెడిట్ తీసుకున్నా తప్పే అన్నట్లుగా మాట్లాడుతారు. బాబు ఐటీని ఏమి తెచ్చారని అంటూ ఎవరెవరి పేర్లో చెబుతారు. అయితే ఐటీ కేరాఫ్ హైదారాబాద్ కి కారణం చంద్రబాబే అని చెప్పినది ఎవరో కాదు టెక్ దిగ్గజం బిల్ గేట్స్. ఆయన అమరావతిలో సచివాయలంలో మంత్రులతో ముచ్చటిస్తూ మూడు దశాబ్దాల క్రితం నాటి విశేషాలను పంచుకున్నారు.

అంతా బాబు చలవే :

బాబుని ఆయన దార్శనీకుడు అని కొనియాడారు. హైదరాబాద్‌లో మైక్రో సాఫ్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనకు కారణమేంటని ఈ సందర్భంగా బిల్ గేట్స్ ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. దానికి బిల్ గేట్స్ ఆసక్తికర సమాధానం చెప్పారు. ఆనాడు ఉమ్మడి ఏపీ సీఎం గా చంద్రబాబు హైదరాబాద్ లో ఐటీని ప్రమోట్ చేయడం వల్ల టెక్ నిపుణులు చాలా మంది హైదరాబాద్ నుంచే వచ్చేవారని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో చంద్రబాబు మైక్రో సాఫ్ట్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో పెట్టాలనే ప్రతిపాదన పెట్టారని బిల్ గేట్స్ ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు చెప్పారు. అయితే దీనిపైన తమ వద్ద పని చేసే వారి అభిప్రాయం కోరితే హైదరాబాద్ సెంటర్ ఏర్పాటు చేస్తే తాము వెళ్లడానికి సిద్దంగా ఉన్నట్టు చెప్పారని బిల్ గేట్స్ వివరించారు. అలా హైదారాబాద్ లో మైక్రో సాఫ్ట్ సెంటర్ ఏర్పాటు చేశామని అని చెప్పారు. అంతే కాదు ఈ రోజున కూడా భారతదేశంలో మైక్రో సాఫ్ట్ కంపెనీల్లో పని చేసే చాలా మంది ఉద్యోగుల్లో హైదరాబాద్ వారే ఎక్కువగా ఉన్నారని బిల్ గేట్స్ చెప్పడం విశేషం. అంటే ఐటీని హైదరాబాద్ తీసుకుని రావడం వెనక బాబు నూరు శాతం కృషి ఉందని బిల్ గేట్స్ గట్టిగా చెప్పినట్లు అయింది అని అంతా అంటున్నారు.

బాబు గ్రేట్ విజనరీ :

ఇక తాను ప్రపంచ దేశాలలొలోని ఎంతో మంది నాయకులను కలిశాను అని అయితే తాను కలిసిన నాయకుల అందరి కంటే వారి ఆలోచనల కంటే కూడా చంద్రబాబు ఆలోచనలు చాలా ముందున్నాయని బిల్ గేట్స్ చెప్పడం విశేషం. అంతే కాదు బాబుతో జరిగిన తొలి భేటీలోనే తాను ఈ విషయాన్ని గ్రహించినట్టుగా ఆయన వెల్లడించారు. ఆనాటి సింగపూర్ ప్రధాని కూడా చంద్రబాబు తరహాలోనే భిన్నమైన విజన్‌తో కూడిన ఆలోచనలు చేసేవారని మంత్రుల సమావేశంలో బిల్ గేట్స్ వివరించారు.

గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ :

ఇక ఏపీ సీఎం గురించి బిల్ గేట్స్ మంత్రులకు చెబుతూ చంద్రబాబు తనకు గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ అని సమావేశంలో సరదాగా వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఇన్నోవేషన్స్ సూపర్ అని చెప్పారు. అంతే కాదు వేగవంతమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని బిల్ గేట్స్ కొనియాడారు. డిజిటల్ విప్లవానికి భారతదేశంలో బలమైన పునాదులు పడ్డాయని ఆయన చెప్పారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని బిల్ గేట్స్ కితాబిచ్చారు.

ఆరోగ్య రంగానికే :

ఇక తన గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులే మెజార్టీ ప్రాజెక్టులని ఆయన చెప్పుకొచ్చారు ఆరోగ్య సేవలను పేద ప్రజలకు మరింత చేరువ చేయాలన్నది తన ఉద్దేశ్యంగా వెల్లడించారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు.

ఏఐ మేలు చేస్తుంది :

ఇక ఏఐ గురించి ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి వారికి సరైన రీతిలో తగిన స్థాయిలో విద్యా బోధన చేయడానికి ఏఐ ఎంతగానో సహయపడుతుందని చెప్పారు. విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకురావడానికి ఏఐ టెక్నాలజీ పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యవసాయం ప్రాధాన్యత :

అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైన రంగమని బిల్ గేట్స్ చెప్పారు వ్యవసాయ రంగం ఎంత ముఖ్యమో ఇప్పటికీ చాలా మందికి తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. టెక్నాలజీ సాయంతో ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఇది గొప్ప విషయం అన్నారు. అలాగే టెక్నాలజీని రైతులకు అందించేందుకు ఏఐను వ్యవసాయంతో ఇంటిగ్రేట్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషి కొనియాడదగినది అన్నారు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో ఏఐ టెక్నాలజీని వినియోగంచడం లేదని కానీ ఆంధ్రప్రదేశ్ దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుండడం మంచి పరిణామమని బిల్ గేట్స్ అన్నారు

Tags:    

Similar News