బిల్ గేట్స్ విత్ బాబు : హలో ఫ్రెండ్... హౌ ఆర్ యూ..?
గేట్స్ ఫౌండేషన్ అధినేత అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం బిల్ గేట్స్ ఏపీకి వచ్చారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు.;
గేట్స్ ఫౌండేషన్ అధినేత అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం బిల్ గేట్స్ ఏపీకి వచ్చారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్దకు ఆయన వస్తూనే ఏపీ సీఎం చంద్రబాబుని చూసి ఎంతో ఆప్యాయత కురిపించారు. హలో ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటూ సీఎం చంద్రబాబును పలకరించిన బిల్ గేట్స్ తమ మధ్యన ఉన్న స్నేహ బంధం ఎంతటి గాఢమైనదో మరోసారి చాటి చెప్పారు. బాబు సైతం బిల్ గేట్స్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ ఇద్దరు మిత్రులు ఎన్నో విషయాలను చర్చించుకుంటూ ముందుకు సాగుతూంటే చూసిన వారికి ఎంతో ముచ్చటేసింది.
మంత్రులందరితో బిల్ గేట్స్ :
ఇదిలా ఉంటే ఏపీకి వచ్చిన తన మిత్రుడు బిల్ గేట్స్ కి మంత్రులను అందరినీ వరసగా చంద్రబాబు పరిచయం చేసిన చేశారు. ఆయన సైతం వారిని ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటూ ఆసక్తిగా సంభాషించడం కనిపించింది. బిల్ గేట్స్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో పాటు మంత్రులు అందరూ బిల్ గేట్స్ తో ముచ్చటించారు. నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, కొలుసు పార్ధసారధి వంటి వారు బిల్ గేట్స్ తో షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడటం జరిగింది.
ఆర్టీజీఎస్ కేంద్రం సందర్శన :
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించిన బిల్ గేట్స్ వాటి గురించిన వివరాలు తెలుసుకున్నారు. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు ఫలితాలను బిల్ గేట్స్‌కు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అలాగే, డేటా లేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి ఎంతో ఆసక్తిగా బిల్ గేట్స్ తెలుసుకున్నారు.
శభాష్ అన్న బిల్ గేట్స్ :
ఇక ఆర్టీజీఎస్‌లోని డిస్ ప్లే వాల్స్‌పై ప్రజంటేషన్లను పరిశీలించిన బిల్ గేట్స్ వాటి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని చంద్రబాబు ఆయనకు చెప్పారు. డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం ఎంతో బాగుందని బిల్ గేట్స్ మెచ్చుకున్నారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గేట్స్‌కు బాబు తెలిపారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును ఖుణ్ణంగా బిల్ గేట్స్ పరిశీలించారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని బాబు వెల్లడించారు.
ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతం :
ఇక ఏపీలో ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని చంద్రబాబుని బిల్ గేట్స్ ప్రశ్నించారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని బాబు ఆయనకు వివరించారు. అలాగే భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారులు సైతం బిల్ గేట్స్ కి చెప్పారు. ఇక ఏపీలో ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందని బిల్ గేట్స్ ప్రశంసించారు. జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగిందని బాబు ఆయనకు చెప్పారు.
సంజీవిని ప్రాజెక్ట్ మీద ఆరా :
అదే విధంగా తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలు గురించి చంద్రబాబుని బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారని అడిగి తెలుకుకున్న ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ దట్స్ నైస్ అంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించడం విశేషం. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్, ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని బిల్ గేట్స్ అధికారులు వివరించారు
ఏఐ వినియోగం గ్రేట్ :
అంతే కాదు ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగు పరిచేలా చూస్తున్నామని చంద్రబాబు బిల్ గేట్స్ కి చెప్పడంతో గ్రేట్ అంటూ కితాబిచ్చారు. బయో డిజైన్ ద్వారా వైద్య సేవలు అందించే విధానాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికే అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందన్న బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు.
అమరావతి గురించి ఆసక్తి :
ఇక బిల్ గేట్స్ అమరావతి రాజధాని నిర్మాణ వివరాలను సైతం అడిగి తెలుసుకోవడం విశేషం. రాజధానిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. అంతే కాదు, రాజధాని నిర్మాణ తీరును బిల్ గేట్స్‌కు బాబు పూర్తిగా వివరించడంతో గ్రేట్ వర్క్ అంటూ కితాబిచ్చారు. మొత్తానికి బిల్ గేట్స్ ఏపీలోకి అడుగు పెడుతూనే జరుగుతున్న అన్ని కార్యక్రమాల మీద తన అభిప్రాయాన్ని చెప్పారు, ప్రభుత్వం పనితీరుని మెచ్చుకున్నారు.