నారా భువనేశ్వరి అన్ స్టాపబుల్.. ఎన్టీఆర్ ట్రస్టు @ 30

ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి అరుదైన మైలురాయిని స్థాపించారు.;

Update: 2026-02-16 09:43 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి అరుదైన మైలురాయిని స్థాపించారు. ఆమె నేతృత్వంలోని ఎన్టీఆర్ ట్రస్టు మూడు దశాబ్దాల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. లక్షలాది మందికి సేవలు అందించిన సంస్థగా ఎన్టీఆర్ ట్రస్టు నిలిచిందని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కూడా భువనేశ్వరి సారథ్యంలో ఎన్టీఆర్ ట్రస్టు సేవలను కొనియాడుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 1997లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో హైదరాబాద్ లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టును ప్రారంభించారు. అప్పటి నుంచి ట్రస్టీగా కొనసాగుతున్న భువనేశ్వరి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి తనదైన ముద్ర వేశారు.

1997లో ఎన్టీఆర్ ట్రస్టు స్థాపించిన నుంచి భువనేశ్వరి ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఈ సంస్థ ద్వారా అందిస్తున్న సేవలకు గాను ఆమె గత ఏడాది లండన్‌లో ప్రతిష్టాత్మక 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025’ అవార్డును సైతం అందుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ప్రధానంగా బ్లడ్ బ్యాంకులు, పాఠశాల నిర్వహణతో భువనేశ్వరి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భర్త చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆమె పూర్తిస్థాయిలో ట్రస్టు బాధ్యతలను తలెకెత్తుకుని 30 ఏళ్లుగా విజయవంతంగా నడుపుతున్నారని అభినందనలు అందుకుంటున్నారు. ఒకవైపు వ్యాపార వేత్తగా హెరిటేజ్ ఫుడ్స్ ను లాభాల బాటలో నడిపిస్తున్న భువనేశ్వరి ట్రస్టీగా కూడా సంస్థ అభివృద్ధికి సమయం కేటాయించడం విశేషంగా చెబుతున్నారు.

30 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి ట్రస్టు సేవలు ప్రారంభించిన భువనేశ్వరి దశలవారీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యాలయాలను విస్తరించినట్లు చెబుతున్నారు. తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరంల్లో బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా విజయవాడలో మరో కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. గండిపేట, కృష్ణా జిల్లా చల్లపల్లిలో విద్యాసంస్థల ద్వారా వందల మంది కార్యకర్తలు, అనాథ పిల్లలకు ఉచిత చదువులు చెప్పిస్తున్నారు భువనేశ్వరి. కాగా, ట్రస్టును 30 ఏళ్లుగా విజయవంతంగా ఒక కార్పొరేట్ సంస్థ తరహాలో నడపడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకవైపు వేల కోట్ల టర్నోవర్ ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లాంటి వ్యాపార సామ్రాజ్యాన్ని, మరోవైపు లక్షలాది మందికి సేవలందించే ఎన్టీఆర్ ట్రస్టును ఆమె సమన్వయం చేసే విధానం చర్చనీయాంశంగా మారింది. భువనేశ్వరి పనితీరు ఇతర మహిళా పారిశ్రామికవేత్తలకు ఆదర్శనీయంగా చెబుతున్నారు. భర్త, కుమారుడు రాజకీయంగా కీలక పదువుల్లో ఉన్నప్పటికీ ట్రస్టు వ్యవహారాల్లో వారిని జోక్యం చేసుకోనీయకుండా భువనేశ్వరి ఒంటిచేత్తో కార్యాకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.

ట్రస్టుకు వచ్చే ప్రతి పైసాకు లెక్క ఉండేలా డిజిటల్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వ్యాపారవేత్తగా ఆమెకున్న అనుభవం ట్రస్టును ఆర్థికంగా స్థిరంగా నడపడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కేవలం కార్యాలయంలో కూర్చోకుండా, ఆమె స్వయంగా తలసీమియా కేంద్రాలను, ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లను సందర్శించి విద్యార్థులతో, రోగులతో నేరుగా మాట్లాడుతుంటారు. దీనివల్ల ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ దేశంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తింపు సాధించినట్లు చెబుతారు. ఇలా 30 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్టు సేవలు అందిస్తున్న భువనేశ్వరి ప్రయాణం అన్ స్టాపబుల్ గా సాగిపోతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News