ఏపీలో పెరుగుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ
ఏపీని ఒక సామాజిక సమస్య డేంజర్ బెల్స్ ను మోగిస్తోంది. 13 ఏళ్ల నుంచి 19 ఏళ్ల లోపు వయసున్న టీనేజర్లు ప్రెగ్నెన్సీకి గురికావటం ఎక్కువ అవుతుంది.;
ఏపీని ఒక సామాజిక సమస్య డేంజర్ బెల్స్ ను మోగిస్తోంది. 13 ఏళ్ల నుంచి 19 ఏళ్ల లోపు వయసున్న టీనేజర్లు ప్రెగ్నెన్సీకి గురికావటం ఎక్కువ అవుతుంది. టీనేజ్ లో గర్భధారణ కారణంగా ఆయా కుటుంబాల ఎదుగుదలతో పాటు.. రాష్ట్ర ఆర్థిక, సామాజిక వ్యవస్థల మీదా డెవలప్ మెంట్ మీదా ప్రతికూలత ప్రభావం చూపుతోంది. దీనికి తోడు.. ఆయా బాలికలు ఆరోగ్య సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. టీనేజ్ ప్రెగ్నేన్సీ ఆందోళనకర స్థాయికి చేరుకున్న జిల్లాల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
ఏపీలోని పాతిక జిల్లాల్లో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో అయితే ఇది మరింత ఎక్కువగా ఉండటమే కాదు.. ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. బాల్య వివాహాలు.. అత్యాచారాలు.. తెలిసీ తెలియని వయసులో క్షణికావేశం.. ఇలాంటివన్నీ కూడా పిన్న వయసులోనే గర్భం దాల్చటానికి కారణమవుతుందని చెప్పాలి.
దీంతో తల్లీ బిడ్డలకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రం ఏదైనా టీనేజ్ ప్రెగ్నెన్సీ లక్ష్యం సున్నా స్థాయిలో ఉండదలి. కానీ.. ఏపీలో మాత్రం దీన్ని కనీసం 5 శాతానికి తగ్గించాలన్న బెంచ్ మార్కు పెట్టుకుంటున్న తీరు చూస్తే.. రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్నది అర్థమవుతుంది. ఇప్పుడు బెంచ్ మార్క్ గా పెట్టుకున్న 5 శాతం కంటే తక్కువగా ఉన్న జిల్లాల్లో ఒక్క విశాఖ మాత్రమే ఉంది. మిగిలిన జిల్లాల్లో 5 శాతం నుంచి 12 శాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మరింత దారుణంగా పల్నాడులో 14.94 శాతం.. కర్నూలులో 13.50 శాతం టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు నమోదవుతున్నాయి.
ఈ ఇష్యూలో ప్రమాదకర స్థాయిగా 12 నుంచి 15 శాతంగా చెబుతారు. ఈ పరిధిలోకి వస్తున్న జిల్లాల్ని చూస్తే నెల్లూరు, ప్రకాశం, అనంతపురం,బాపట్ల, కర్నూలు, పల్నాడు జిల్లాలు ఉన్నాయి. సమస్య చాలా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాలు ఉంటే.. సమస్య ఎక్కువగా ఉన్న జిల్లాల పరిధిలో అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు ఉన్నాయి. ఒక మోస్తరుగా ఉన్న జిల్లాల్లో అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, క్రిష్నా, అనకాపల్లి, ఎన్టీఆర్, వైఎససార్ కడప ఉన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి