రాజకీయ రాజధానిలో రౌడీల కవాతు.. పోలీసులకే షాక్
రాజధాని అమరావతి పక్కనే రాష్ట్ర రాజకీయ రాజధానిగా గుర్తింపు పొందిన విజయవాడ నగరంలో రెండు రోజుల క్రితం రౌడీషీటర్లు నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు కొన్ని వందల మంది రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ సభ్యులు నగరంలో హల్ చేయడం పోలీసులకు షాకింగ్ గా మారింది. వీఐపీ మూమెంట్ ఎక్కువగా ఉండే నగరంలో అన్నివందల మంది రౌడీషీటర్లు గుమిగూడటానికి పోలీసులు ఎలా అనుమతించారన్న ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలు సైతం అలర్ట్ అయినట్లు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు రావడంతో నగరంలోని భవానీపురం పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో పోలీసులు రౌడీషీటర్లతో రోడ్ షో చేయించడం ఇటీవల తీవ్ర చర్చకు దారితీసింది. అయితే విజయవాడలో పోలీసులకే షాక్ ఇచ్చేలా దాదాపు కొన్ని వందల మంది రౌడీలు ర్యాలీ చేయడమే హాట్ టాపిక్ అవుతోంది. ఓ రౌడీ షీటర్ అంతిమ యాత్ర కోసం విజయవాడతోపాటు గుంటూరు, తాడేపల్లి ప్రాంతాల నుంచి భారీగా రౌడీలు తరలిరావడం, దాదాపు నాలుగైదు గంటలు నగరంలో హల్ చల్ చేయడంపై పోలీసు అధికారులు సీరియస్ అవుతున్నారు. ప్రజలు కూడా రౌడీ మూకల ర్యాలీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
విజయవాడ నగరానికి చెందిన రౌడీషీటర్ 21 ఏళ్ల ఫణీంద్ర అలియాస్ పావురం రెండు రోజుల క్రితం మరణించాడు. నగరపాలక సంస్థ చెత్త వాహనం ఢీకొని పావురం గత శుక్రవారం మరణిస్తే శనివారం అతని అంతిమయాత్రకు వందల మంది రౌడీలు తరలివచ్చారు. వందలాది మోటారు సైకిళ్లతో ర్యాలీ చేయడమే కాకుండా డీజేలుపెట్టి నడిరోడ్డుపై డ్యాన్సులు చేసి వీరంగం సృష్టించారు. ఈ అంతిమయాత్రలో పాల్గొన్న 90 శాతం మందిపై విజయవాడ, గుంటూరు, నరసారావుపేట, తాడేపల్లి పోలీసుస్టేషన్ ల్లో రౌడీషీట్లు ఉన్నట్లు చెబుతున్నారు.
వీఐపీలు ఎక్కువగా తిరిగే విజయవాడ నగరంలో ఇంతమంది రౌడీలు ర్యాలీ చేయడం, డ్యాన్సులు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు లోనుచేస్తే పోలీసులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రౌడీలు ఇంతలా బరితెగిస్తే పోలీసులు చూస్తూ ఉండిపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజులుగా ఈ విషయమై తీవ్ర విమర్శలు రావడం, ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల రాష్ట్రంలో పలు చోట్ల రౌడీలతో రోడ్ షో నిర్వహించి వారిని కట్టడి చేయడానికి పోలీసు శాఖ గట్టి హెచ్చరికలు పంపింది. కానీ, విజయవాడలో రివర్స్ డ్రామా నడవడమే తీవ్ర చర్చకు దారితీస్తోందని అంటున్నారు. ఈ సంఘటన తర్వాత అయినా పోలీసులు అలర్ట్ గా ఉంటూ రౌడీలను అదుపు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.