700 ఏళ్ల క్రితం పంజీ ప్రతా సంప్రదాయం గురించి తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

భారతీయ సమాజంలో వివాహం కేవలం రెండు వ్యక్తుల బంధం మాత్రమే కాదు.. రెండు కుటుంబాల, రెండు వంశాల కలయిక.;

Update: 2026-02-16 08:30 GMT

భారతీయ సమాజంలో వివాహం కేవలం రెండు వ్యక్తుల బంధం మాత్రమే కాదు.. రెండు కుటుంబాల, రెండు వంశాల కలయిక. ‘ఒకే గోత్రం వద్దు’, ‘దగ్గరి రక్తసంబంధం వద్దు’ అనే నిబంధనలు మన పెద్దలు శతాబ్దాల క్రితమే అమలు చేశారంటే నమ్మశక్యం కాదు. ఇవి కేవలం ఆచారాలు కాదు.. భావితరాల ఆరోగ్యాన్ని కాపాడాలనే శాస్త్రీయ దృష్టికోణంతో ఏర్పడిన సామాజిక వ్యవస్థలు. ఈ నేపథ్యంలో బిహార్‌లోని మిథిల ప్రాంతంలో 700 ఏళ్లుగా కొనసాగుతున్న ‘పంజీ ప్రథా’ వ్యవస్థ ఒక అసాధారణమైన ఉదాహరణగా నిలుస్తోంది.

మతం–శాస్త్రం కలయిక

‘పంజీ ప్రథా’ అంటే వివాహ రికార్డుల నమోదు. కానీ ఇది సాధారణ రిజిస్ట్రేషన్ కాదు.. వంశవృక్షాల శాస్త్రీయ విశ్లేషణ. మిథిల ప్రాంతంలో మైథిల్‌ బ్రాహ్మణులు, కర్ణ కాయస్థ వర్గాలు ఈ పద్ధతిని అనుసరిస్తూ వచ్చాయి. 14వ శతాబ్దంలో మిథిలను పాలించిన కర్ణాట్‌ వంశానికి చెందిన రాజు హరిసింగ్‌ దేవ్‌ (1304–1325) ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్లు చరిత్ర చెబుతోంది.

వివాహం కుదిరే ముందు వరుడు–వధువు కుటుంబాలు ‘పంజీకార్‌’ అనే నిపుణుడిని సంప్రదిస్తాయి. ఆయన వద్ద వందల ఏళ్లుగా సంరక్షితంగా ఉన్న వంశావళి రికార్డులు ఉంటాయి. గోత్రం ఆధారంగా వరుడి ఏడు తరాలు, వధువు ఐదు తరాల సమాచారాన్ని సేకరించి, వాటిని విశ్లేషిస్తారు. ఒకే గోత్రం, సమీప రక్త సంబంధం లాంటివి లేకపోతే ‘అస్వజన్‌’ అనే నిరభ్యంతర ప్రమాణపత్రాన్ని జారీ చేస్తారు. ఈ ధ్రువీకరణ లేకుండా పెళ్లి జరగదు. ఇది ఒక రకంగా జన్యుపరమైన భద్రతా ధ్రువపత్రం.

సౌరథ్‌ సభ – జీవంత సంప్రదాయం

మధుబని జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌరథ్‌ సభ అనే గ్రామం ఈ వ్యవస్థకు కేంద్ర బిందువు. ఇక్కడ 22 ఎకరాల విస్తీర్ణంలో సామూహిక వివాహాల కోసం ప్రత్యేక స్థలం ఉంది. జ్యేష్ఠ–ఆషాఢ మాసాల్లో వందలాది కుటుంబాలు ఇక్కడికి చేరి వివాహాలు జరుపుకుంటాయి. దర్భంగా మహారాజు ఈ భూమిని పంజీకార్‌కు దానం చేశారని ప్రచీన పత్రాలు, స్థానికులు, పెద్దలు చెప్తున్నారు.

ఈ వ్యవస్థలో విశేషం ఏంటంటే.. ఇది మతపరమైన సంప్రదాయం అయినప్పటికీ, జన్యుశాస్త్రం లక్ష్యాలను చేరుకోవడమే ప్రధాన ఉద్దేశం. సమీప రక్తసంబంధ వివాహాల వల్ల వచ్చే జన్యు సమస్యలను ముందుగానే అడ్డుకోవడం దీని అసలు ఉద్దేశం. ఆధునిక డీఎన్‌ఏ పరీక్షలు లేకున్నా, వంశావళి ఆధారంగా ప్రమాదాలను అంచనా వేసే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది.

ఆధునిక యుగంలో సవాళ్లు

అయితే కాలం మారుతోంది. పంజీకార్లుగా పనిచేసే వారు సాధారణంగా అదే కుటుంబాల్లో తరతరాలుగా వస్తున్నారు. కానీ నేటి యువత ఈ వృత్తిపై ఆసక్తి చూపడం లేదు. తక్కువ వేతనం.. ప్రభుత్వ మద్దతు లోపం కారణాలుగా చెప్పబడుతున్నాయి. దీంతో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ వ్యవస్థ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.

పంజీ రికార్డులను డిజిటలైజ్‌ చేయాలని పలువురు మేధావులు సూచిస్తున్నారు. డిజిటల్‌ డేటాబేస్‌ రూపంలో వంశావళి సమాచారాన్ని భద్రపరిస్తే, ఇది కేవలం మిథిల ప్రాంతానికే కాకుండా దేశ వ్యాప్తంగా ఉపయోగపడే నమూనాగా మారవచ్చు. వివాహానికి ముందు జన్యుపరమైన స్క్రీనింగ్‌ అవసరమని నేటి వైద్య శాస్త్రం చెబుతున్న సందర్భంలో, పంజీ ప్రథా ఒక సాంప్రదాయ ‘జెనెటిక్‌ కౌన్సెలింగ్‌’ విధానంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది.

సంప్రదాయంలో శాస్త్రీయ దృష్టి

మన పూర్వీకులు ఏర్పరిచిన అనేక ఆచారాలు శాస్త్రీయంగా అర్థవంతమైనవే. ఒకే గోత్రం వివాహాలను నిషేధించడం, ఏడు నుంచి ఐదు తరాలను పరిశీలన చేయడం ఇవన్నీ భావితరాల ఆరోగ్యంపై దృష్టి సారించిన చర్యలు. నేడు ఆధునిక వైద్యం చెప్పే సూత్రాలను వందల ఏళ్ల క్రితమే సామాజిక నియమాల రూపంలో అమలు చేయడం మన సంస్కృతికి ఉన్న దూరదృష్టిని చూపిస్తుంది.

పంజీప్రథా కేవలం ఒక వివాహ వ్యవస్థ కాదు.. అది వంశపారంపర్య ఆరోగ్య భద్రతకు చారిత్రక చిట్టా. ఈ వ్యవస్థను సంరక్షించడం, ఆధునీకరించడం సమాజ బాధ్యత. శాస్త్రం–సంప్రదాయం కలిసినప్పుడు ఎలా ఆరోగ్యకరమైన భావితరాలను నిర్మించవచ్చో చూపించే అరుదైన నమూనా ఇదే.

Tags:    

Similar News