పవన్ సీఎం కావాలి...రగులుతున్న కాపులు ?
ఇక ఆయన ఆవేశంలో చాలా మాటలే దొర్లేశారు. కాపు, బలిజలకు సిగ్గే ఉంటే ఇలా అనిపించుకుంటామా అని కూడా అన్నారు.
తమ జాతికి కూడా ముఖ్యమంత్రి పదవి కావాలి అని కాపులు కోరుకుంటున్నారు. అది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ గానే చూడాలి. అదే సమయంలో తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ స్థాపించి రెండేళ్ళు తిరగకుండానే ముఖ్యమంత్రి కావడంతో కాపులలో కొత్త ఆశలే కాదు ఆవేశాలు రగులుతున్నాయి. వారంతా ఇపుడు విజయ్ తరహాలో పవన్ కూడా ముఖ్యమంత్రి కావాలనేది మా జాతి ఆకాంక్ష అంటున్నారు. దీని మీద టీడీపీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ అయితే ఓపెన్ గానే మాట్లాడేశారు. ఆయన ఆవేశంతో చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.
ఊడిగం చేస్తామా :
తమ జాతికీ ముఖ్యమంత్రి కావాలని ఉంటుందని ఓవీ రమణ అన్నారు. ఎంతకాలం ఊడిగం చేస్తామని ఆయన ప్రశ్నించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కులం గురించి మాట్లాడుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. కులం గురించి మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ మీనమేషాలు లెక్కిస్తున్నారని అదే వేరే వాళ్లు మాత్రం బాహాటంగానే అన్నీ చేస్తున్నారు కదా అని చెప్పుకొచ్చారు. దానికి ఉదాహరణగా ఒకాయన టీటీడీ చైర్మన్‌గా ఉండి దర్జాగా సంఘాల మీటింగ్‌లకు వెళ్లి కులం గురించి గొప్పలు చెబుతున్నారని అన్నరు.
సిగ్గు ఉంటే కనుక :
ఇక ఆయన ఆవేశంలో చాలా మాటలే దొర్లేశారు. కాపు, బలిజలకు సిగ్గే ఉంటే ఇలా అనిపించుకుంటామా అని కూడా అన్నారు. తాను ఈ వ్యాఖ్యలు చేస్తునంది కులాల మధ్య చిచ్చు పెట్టాలనేది ఏ మాత్రం కాదని, తనకు ఆ ఉద్దేశం కూడా లేదని అన్నారు. కానీ తమ జాతి నుంచి పవన్ సీఎం కావలన్నదే ఆరాటం అని ఓవీ రమణ చెప్పుకున్నారు. ఎన్నాళ్ళీ రాజకీయ ఊడిగం అని ఆయన ప్రశ్నించారు.
పవన్ ప్రత్యామ్నాయ శక్తిగా :
ఏపీలో పవన్ కల్యాణ్ పార్టీ జనసేన ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఉండాలని తామంతా కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. అదే సమయంలో తనకు ఈ జాతి వద్దనుకుంటే పవన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే కాపులు బలిజలు రగులుతున్నారని అంటున్నారు. విభజన ఏపీలో తమకు తప్పకుండా చాన్స్ వస్తుందని వారంతా ఆశ పడ్డారు. ఎందుకంటే విభజన ఏపీలో అతి పెద్ద జనాభాగా వారే ఉన్నారు. అయితే వరసగా మూడు ఎన్నికలు అయిపోయాయి కానీ కాపుల నుంచి ముఖ్యమంత్రిగా ఎవరూ అవలేని పరిస్థితి ఉంది. దాంతో వారంతా ఆవేదనగా ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో పొరుగు రాష్ట్రంలో సినీ నటుడు విజయ్ పార్టీ పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం మాత్రం వారిని మరింతగా ఇబ్బంది పెడుతోంది. దాంతోనే ఆ సామాజిక వర్గం నుంచి కీలక నేతలు అంతా బయటకు వచ్చి మీడియా సమావేశాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. మరి దీని మీద జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.