టీడీపీలో 'మ‌హా' సంరంభం..!

ప్ర‌ధానంగా పార్టీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ఎంపిక కావ‌డం.. అదేవిధంగా పొలిట్ బ్యూరో నుంచి రాష్ట్ర స్థాయి క‌మిటీల వ‌ర‌కు.. కూడా బ‌ల‌మైన ప్ర‌క్షాళ‌న క‌నిపించ‌డం వంటివి పార్టీలో జోష్ నింపుతున్నాయి.

Update: 2026-05-26 19:30 GMT

తెలుగు దేశం పార్టీ(టీడీపీ)లో `మ‌హా` సంరంభం.. క‌నిపిస్తోంది. మ‌రికొన్ని గంట‌ల్లో.. పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే మ‌హానాడు ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆన్‌లైన్ మాధ్య‌మ వేదిక‌గానే.. ఈ ప‌సుపు పండుగ ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు అధినేత చంద్ర‌బాబు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండ‌లాలు, నియోజ‌క‌వ‌ర్గాలు.. క్ల‌స్ట‌ర్ల‌లో కూడా.. పెద్ద ఎత్తున భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ప్ర‌త్య‌క్ష మ‌హానాడుకు ఉండే అన్న హంగులు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఎందుకింత ప్ర‌త్యేకం..?

ఈ ఏడాది మ‌హానాడుకు చాలా ప్ర‌త్యేక‌త ఉంద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. ప్ర‌ధానంగా పార్టీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ఎంపిక కావ‌డం.. అదేవిధంగా పొలిట్ బ్యూరో నుంచి రాష్ట్ర స్థాయి క‌మిటీల వ‌ర‌కు.. కూడా బ‌ల‌మైన ప్ర‌క్షాళ‌న క‌నిపించ‌డం వంటివి పార్టీలో జోష్ నింపుతున్నాయి. దీనికి తోడు.. ``కార్య‌క‌ర్త‌లే అధినేత‌లు`` అనే టాక్ బ‌లంగా వినిపిస్తున్న నేప‌థ్యంలో ఈ ద‌ఫా మ‌హానాడుకు.. కార్య‌క‌ర్త‌ల సొబ‌గు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

అంతేకాదు..

తాజా మ‌హానాడుకు మ‌రో ప్ర‌త్యేక‌త కూడా ఉంది. టీడీపీకి వ్య‌వ‌స్థాగ‌తంగా ఉన్న కార్య‌కర్త‌లు.. నాయ‌కుల్లో భారీ జోష్ క‌నిపిస్తోంది. వ‌చ్చే 15 ఏళ్ల‌పాటు పార్టీ ప్ర‌భుత్వంలో ఉండాల‌న్న కీల‌క తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్ట‌నున్నార‌న్న విష‌యం తెలియ‌డంతో నాయ‌కుల్లో రెట్టించిన ఉత్సాహం క‌నిపిస్తోంది. దీనికితోడు.. 1983 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 23 ఏళ్లుగా పార్టీ అధికారంలో ఉన్నా.. గ‌తంలో ఎన్న‌డూ ఇవ్వ‌నన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను ఈ ద‌ఫా అమ‌లు చేస్తుండ‌డం కూడా.. మ‌హానాడుకు ప్ర‌త్యేక‌త‌ను తీసుకువ‌చ్చింది.

క్షేత్ర‌స్థాయిలో..

క్షేత్ర‌స్థాయిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. నియోజ‌క‌వ‌ర్గాలు, మండ‌లాలు, క్ల‌స్ట‌ర్లు.. ఇలాపలు రూపాల్లో విభ‌జించి.. కార్య‌క్ర‌మాన్ని దుమ్మురేపాల‌న్న స్ఫూర్తి క‌నిపిస్తోంది. దీనికి మ‌రో రీజ‌న్‌కూడా క‌నిపిస్తోంది. వ‌చ్చే రెండు మాసాల్లో మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆశావ‌హ అమాత్యులు.. మ‌హానాడును మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. దీంతో చేతికి ఎముక లేద‌న్న‌ట్టుగా మ‌హానాడుకు విరివిగా ఖ‌ర్చుచేస్తున్నారు. భారీ హంగులు, ఆర్భాటాల‌ను క‌ల్పించారు. సైకిల్ ర్యాలీలు.. మ‌హానాడుకు మ‌రింత శోభ చేకూర్చ‌నున్నాయి.

Tags:    

Similar News