ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని ప్రూవ్ చేయాలి: 'దృశ్యం' నటికి బ‌స్తీ మే స‌వాల్!

అన్సిబా హసన్ తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలను తొలుత పేర్కొన్నా.. ఆ తర్వాత టిని టామ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

Update: 2026-05-26 18:16 GMT

మలయాళ పరిశ్రమకు చెందిన `అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్` (అమ్మా) సంఘంలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. ఈ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పదవికి ప్రముఖ నటి అన్సిబా హసన్ రాజీనామా చేయడం.. ఆ రాజీనామాకు సీనియర్ నటుడు టిని టామ్ కారణమని ఆరోపించడం.. పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించింది. అత‌డు క‌క్ష క‌ట్టి త‌న‌పై సాధింపుల‌కు దిగాడ‌ని కూడా అన్సిబా ఆరోపించింది. ఈ నేపథ్యంలో టిని టామ్ స్పందిస్తూ అన్సిబా చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఈ సున్నితమైన వివాదాన్ని బహిరంగంగా కాకుండా సంస్థ అంతర్గత వేదికలపైనే చర్చించి పరిష్కరించుకోవాలని ఆయన మీడియా ముఖంగా స్పష్టం చేశారు.

అన్సిబా హసన్ తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలను తొలుత పేర్కొన్నా.. ఆ తర్వాత టిని టామ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అసోసియేషన్‌లో తాను ఏవైనా విభేదాలు వ్యక్తం చేసినప్పుడు ఆయన తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని.. ఇతరులతో తనకున్న సంబంధాలపై లేనిపోని పుకార్లు పుట్టించారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా తనను అవమానకరమైన రీతిలో `జిహాదీ` అని పిలిచారని కూడా అన్సిబా పేర్కొన్నారు. ఈ ఆరోపణలను టిని టామ్ గట్టిగా తిప్పికొట్టారు. ఇవన్నీ కేవలం నిరాధార‌మైన‌ ఆరోపణలని నిజంగానే అలాంటి సంఘటనలు జరిగి ఉంటే అన్సిబా తగిన ఆధారాలను చూపాలని సవాల్ విసిరారు.

తాను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించానని.. తమ కళాకారుల మధ్య కులమతాల పట్టింపులు ఉండవని టిని టామ్ పేర్కొన్నారు. తాను సుదీర్ఘకాలంగా `అమ్మా` ఎగ్జిక్యూటివ్ కమిటీలో పనిచేస్తున్నా.. గతంలో తనపై ఎవరూ ఇలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. తనకు మతపరమైన వివక్ష లేదని పరిశ్రమలో మెగాస్టార్ మమ్ముట్టి తనను సినిమాలకు పరిచయం చేయగా.. దర్శకుడు నాదిర్షా మిమిక్రీ రంగానికి పరిచయం చేశారని గుర్తుచేశారు. తన ఆత్మీయ స్నేహితులలో ఎక్కువ మంది ముస్లిం వర్గానికి చెందినవారేనని చెబుతూ తనపై మత మార్పిడి లేదా మతపరమైన పక్షపాత ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

రాజీనామా వ్యవహారంపై ఆయన స్పష్టత ఇస్తూ.. అన్సిబా మొదట ఫిబ్రవరి 21న రాజీనామా లేఖ ఇచ్చిందని సభ్యుల అభ్యర్థన మేరకు దానిని వెనక్కి తీసుకుందని తెలిపారు. ఆ తర్వాత మే నెలలో ఆమె మళ్లీ రాజీనామా చేసిందన్నారు. అనంతరం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆమెకు ఫోన్ చేసి మాట్లాడగా.. కేవలం వ్యక్తిగత పని ఒత్తిడి వల్లే రాజీనామా చేస్తున్నానని చెప్పిందే తప్ప ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు చేయలేదని ఆయన వెల్లడించారు. తాను మహిళల పట్ల ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదని అసోసియేషన్ కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సేవ చేస్తున్న తమలాంటి వారిని బద్నాం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వివాదం మాలీవుడ్‌లో నటీనటుల మధ్య ఉండే అంతర్గత సంబంధాలలోని స‌వాళ్ల‌ను మరోసారి తెరపైకి తెచ్చింది. అన్సిబా హసన్ తనకు సోదరి లాంటిదని పేర్కొన్న టిని టామ్ ఈ సమస్యపై ఎలాంటి చట్టపరమైన చర్యలకు వెళ్లే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. కేవలం అంతర్గత చర్చల ద్వారానే ఈ గొడవను సర్దుమణిగేలా చేయాలని ఆయన కోరారు. ఒక ప్రతిష్టాత్మక సినీ సంస్థలో పదవుల రాజీనామాలు, వ్యక్తిగత - మతపరమైన ఆరోపణల రూపంలోకి మారడం పరిశ్రమ వర్గాలలో ఆందోళన కలిగిస్తోంది.

Tags:    

Similar News