జనసేన 'ఓకే'.. టీడీపీలో ఇంకా 'వెయిటింగ్'.. రాజ్యసభ అభ్యర్థులపై ఉత్కంఠ
త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీ నుంచి నాలుగు ఖాళీలు ఏర్పడనుండగా, ఆ నాలుగు స్థానాలను అధికార కూటమి చేజిక్కించుకోనుంది.
త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీ నుంచి నాలుగు ఖాళీలు ఏర్పడనుండగా, ఆ నాలుగు స్థానాలను అధికార కూటమి చేజిక్కించుకోనుంది. దీంతో ఆయా స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. చాలాకాలంగా పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలు తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే ప్రాంతీయ, సామాజిక సమీకరణాలు పేరుతో టీడీపీ అధిష్టానం ఎవరికీ స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో కూటమిలోని కీలకమైన జనసేన పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసిందని, రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతోనే ప్రకటన చేస్తుందని అంటున్నారు.
మొత్తం నాలుగు స్థానాలను కూటమి గెలుచుకునే అవకాశం ఉండగా, మూడు పార్టీలు ఎలా పంచుకుంటాయనేది కూడా సస్పెన్స్ గా ఉందని అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు రెండు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు సార్లు బీజేపీ ఒక్కోస్థానం తీసుకుంది. దీంతో ఈ సారి బీజేపీకి అవకాశం ఇస్తారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. స్థానిక బలాబలాలు ఆధారంగా ప్రస్తుతానికి టీడీపీ రెండు, బీజేపీ, జనసేన చెరో స్థానం తీసుకోవాలని ప్రతిపాదనలు ఉన్నాయని అంటున్నారు. అయితే పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండటం, సర్దుబాటు సమస్యలు తలెత్తుతుండటం వల్ల ఈ సారి తమకు మూడు స్థానాలు కావాలని టీడీపీ అధిష్టానం కోరుతోందని చెబుతున్నారు.
మరోవైపు తమ పార్టీకి ఈ సారి రాజ్యసభ సీటు పక్కాగా భావించిన జనసేన తన పార్టీ అభ్యర్థిగా పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ పేరు ఖరారు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేష్ కు ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ సత్సంబంధాలు ఉన్నాయని, ఈ కారణంతో ఆయన ఎంపికపై ఎవరికీ అభ్యంతరాలు ఉండకపోవచ్చనని అంటున్నారు. జనసేనలో లింగమేని రమేష్ కాకుండా మరో ఇద్దరి పేర్లు వినిపించినప్పటికీ, పార్టీ అధినేత పవన్ మాత్రం లింగమనేని రమేష్ అభ్యర్థిత్వంపైనే మక్కువ చూపుతున్నట్లు చెబుతున్నారు.
ఇక టీడీపీలో మాత్రం పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది చివరి వరకు సస్పెన్స్ గా ఉంటుందని అంటున్నారు. కూటమి లెక్కల్లో టీడీపీ వాటాగా రెండు స్థానాలు ఇస్తే, అందులో ఒకటి ప్రస్తుతం రిటైర్ అవుతున్న సానా సతీష్ కే తిరిగి ఇవ్వవచ్చునని అంటున్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కేవలం ఏడాదిన్నర మాత్రమే పనిచేయడంతో మళ్లీ అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఇక మిగిలిన స్థానంపైనే ఉత్కంఠ కొనసాగుతోంది. జనసేనతోపాటు టీడీపీలో ఒక స్థానానికి అగ్రవర్ణాలకు చెందిన నేతలను ఎంపిక చేసే అవకాశం ఉండటంతో మిగిలిన స్థానం సామాజిక సమీకరణలు ఆధారంగా ఎంపిక చేయాల్సివుందని అంటున్నారు.
టీడీపీకి రెండు దక్కితే అందులో ఒకటి కాపు సామాజికవర్గానికి చెందిన సతీష్ కు కేటాయించనున్నందున, మిగిలిన సీటును ఎస్సీ, బీసీ, మైనార్టీల్లో ఒకరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఈ వర్గాల్లో సైతం తీవ్ర పోటీ కనిపిస్తోందని చెబుతున్నారు. ఎస్సీ కేటగిరిలో సీనియర్ నేత వర్ల రామయ్య, మహిళా నేత పీతల సుజాత పోటీపడుతున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా బీసీల తరఫున తన పేరు పరిశీలించాల్సిందిగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మైనార్టీ కోటాలో మండలి మాజీ చైర్మన్ షరీఫ్ ఆశిస్తున్నారని అంటున్నారు. ఇలా ఒకే పదవికి భిన్నవర్గాల నుంచి ఒత్తిడి ఎదురవుతుండటంతో టీడీపీ అధిష్టానం రాజ్యసభ అభ్యర్థుల ఊసు ఎత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోందని అంటున్నారు. దీంతో అధిష్టానం మనసులో ఏం ఉందో తెలుసుకోడానికి నేతలు తంటాలు పడుతున్నారు.