టీడీపీ కంచుకోటలో బిగ్ ఫైట్?
తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు ఏపీలో చాలా ఉన్నాయి. ఆ సీట్లలో ప్రత్యర్ధులు ఎపుడూ పెద్దగా గెలిచిన దాఖలాలు లేవు.;
తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు ఏపీలో చాలా ఉన్నాయి. ఆ సీట్లలో ప్రత్యర్ధులు ఎపుడూ పెద్దగా గెలిచిన దాఖలాలు లేవు. అలాంటిదే గుంటూరు జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గం. అక్కడ రెండు వర్గాలుగా టీడీపీ ఉంది. నిజానికి కంచుకోట టీడీపీకి అయిన ఈ నియోజకవర్గంలో ఇలా ఒకే పార్టీలో రెండు వర్గాలు ఉండడం అంటే పార్టీకి ఇబ్బందే అని అంటున్నారు. ఆ రెండు వర్గాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ గా ఇక్కడ నియోజకవర్గంలో రాజకీయ కధ సాగుతోంది.
ఆమెకు టికెట్ తో :
టీడీపీ గుంటూరు పశ్చిమ టికెట్ ని 2024 ఎన్నికల్లో అనూహ్యంగా గళ్ళా మాధవి దక్కించుకున్నారు. ఆమె ఏకంగా 50 వేల ఓట్లతో గెలిచారు. కూటమి సునామీలో ఆమె ఇంతటి విజయం దక్కించుకున్నారు. ఇక ఆమె గెలిచిన తరువాత నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే తన మాట చెల్లాలని చూస్తున్నారు . తన వారికి తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ మొదటి నుంచి ఉంటూ 2024 ఎన్నికల్లో టికెట్ ని ఆశించిన నాయకుడు కోవెలమూడి రవీంద్ర. ఇపుడు ఆయనది మరో వర్గంగా ఉంది.
పార్టీని గాడిన పెట్టినా :
ఇక చూస్తే 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాల గిరి వైసీపీలోకి జంప్ చేయడంతో ఆయన ప్లేస్ లో టీడీపీ నియోజకవర్గం ఇంచార్జిగా కోవెలమూడి రవీంద్రని నియమించారు. వైసీపీ హయాంలో పార్టీ పక్క దారి పట్టకుండా అంతా ఆయన కాసుకుంటూ వచ్చారు. తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కూడా బలంగా నమ్మారు. కానీ మాధవి రూపంలో టికెట్ రాకుండా పోయింది. అదీ ఆయన వర్గం బాధ. అయినా పార్టీ మాటకు కట్టుబడి ఆమె గెలుపునకు కృషి చేశారు కానీ ఎన్నికల తరువాత సీన్ మారింది. ఆయనను ఎమ్మెల్యే వర్గం పట్టించుకోవడం లేదు అని అంటున్నారు.
తాజాగా కీలక పదవి :
ఇదిలా ఉంటే అధినాయకత్వం ఆయన సేవలను గుర్తించి ఆయనకు గుంటూరు మేయర్ పదవిని అప్పగించింది నాలుగేళ్ళ పాటు మేయర్ గా చేసిన వైసీపీ నేతను దించేసి కూటమి ఇక్కడ గెలిచింది. దాంతో ఆయనకు ఈ స్థానం కట్టబెట్టారు దాంతో ఇపుడు మేయర్ గా అధికారిక హోదా దక్కడంతో కోవెలమూడి రవీంద్ర వర్గం మరింత జోరు చేస్తోంది అని అంటున్నారు. దాంతో కంచుకోటలో రెండు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయని అంటున్నారు. దీంతో పార్టీ పెద్దలు అయితే ఏమిటిది అని కంగారు పడుతున్నారని అంటున్నారు. ఇక పార్టీ కోసం కష్టపడే తమ్ముళ్ళు అయితే ఈ రెండు శిబిరాలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు అని అంటున్నారు. హైకమాండ్ జోక్యం చేసుకుని అంతా చక్కదిద్దలని కోరుతున్నారు కానీ అది అయ్యే పనేలా అన్నదే చర్చగా ఉంది.