జూబ్లీహిల్స్ లో టీడీపీ పోటీ? ప్రధాన పార్టీల్లో మొదలైన టెన్షన్
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది.;
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది. పార్టీకి పట్టున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ టీడీపీ నేతలు అధినేత చంద్రబాబును సంప్రదించారని అంటున్నారు. దీనిపై సమాలోచనలు చేస్తున్న అధినేత కొద్దిరోజులు వేచిచూడాల్సిందిగా పార్టీ నేతలకు సూచించినట్లు చెబుతున్నారు. ఏపీలో బీజేపీతో పొత్తు ఉన్నందున తెలంగాణలో పోటీ చేసే విషయమై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా, బీజేపీ, జనసేనతో కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏపీ వలస ఓటర్లతోపాటు బీసీలు, కమ్మ సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉన్నారని, ఈ వర్గాల ఓట్లతో విజయం సాధించడం చాలా తేలికని తెలంగాణ టీడీపీ నేతలు అధినేత చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర విభజన సమయంలో 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ గెలిచిన 15 నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ కూడా ఒకటి. 2018లో కాంగ్రెస్ తో పొత్తు, 2023 ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయంతో టీడీపీ పోటీ చేయలేదు. ఇక ప్రస్తుతం ఏపీలో బలంగా ఉండటం, బీజేపీతో పొత్తు ఉండటం వల్ల జూబ్లీహిల్స్ లో పోటీకి టీడీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారని అంటున్నారు.
అదేసమయంలో ఈ స్థానంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండటం వల్ల బీజేపీ పోటీ చేసినా, ఫలితం ఆశాజనకంగా ఉండదని, బీజేపీ బదులుగా టీడీపీ పోటీ చేస్తే తెలంగాణలో మళ్లీ ఉనికి చాటుకునే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెట్టినా కష్టపడి పనిచేస్తామని హామీ ఇచ్చారంటున్నారు. అయితే టీడీపీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విషయం తేల్చకుండా, తర్వాత మాట్లాడదామని ముగించినట్లు చెబుతున్నారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ స్థానాన్ని కైవసం చేసుకుని హైదరాబాద్ నగరంలో పట్టు పెంచుకోవాలని, భవిష్యత్తులో జరిగే కార్పొరేషన్ ఎన్నికలను సానుకూలం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా పోటీకి సై అంటోంది. అయితే అనూహ్యంగా టీడీపీ నేతలు పోటీకి సిద్ధమవడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోటీకి టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. సమీకరణలు మారిపోయే అవకాశం ఉందంటున్నారు. టీడీపీ గెలిచే అవకాశాలు ఎలా ఉన్నప్పటికీ.. గెలవాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మాత్రం దెబ్బగానే చెబుతున్నారు. టీడీపీ చీల్చే ఓట్లు గెలుపోటుములను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. ప్రధానంగా టీడీపీ ఓట్లతో ఇన్నాళ్లు లబ్ధిపొందిన బీఆర్ఎస్ పార్టీకి టీడీపీ నిర్ణయం షాక్ ఇచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు.
దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకునే నిర్ణయం కోసం ప్రధాన పార్టీల నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత పోటీకి టీడీపీ సై అంటే జూబ్లీహిల్స్ లో పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ లో టీడీపీ పోటీ చేయడం వల్ల రాష్ట్రంలో బీజేపీకి నష్టం చేస్తుందనే విశ్లేషణలతో కమలనాథులు కలవరపడుతున్నారు. జూబ్లీహిల్స్ లో టీడీపీ పోటీచేస్తే, చంద్రబాబు మళ్లీ పెత్తనం చేయడానికి వస్తున్నారని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందని, మళ్లీ తెలంగాణ సెంటిమెంటు రగిలించి లబ్ధి పొందాలని చూస్తుందని అంటున్నారు. దీనివల్ల రాష్ట్రంలో మిగిలిన చోట బీఆర్ఎస్ బలపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయం పెను సంచలనంగా మారనుందని అంటున్నారు. పొరపాటున పోటీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణ రాజకీయాలు మరో మలపు తిరగడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.