త్యాగరాజులం కాలేం బాబూ !
గతంలో పొత్తులు ఉన్నపుడు బీజేపీకి ఒక్క సీటే ఇచ్చిన వైనాన్ని వారు చెబుతున్నారు. ఇపుడు కూడా మిగిలిన సీట్లు టీడీపీకే దక్కాలని అంటున్నారు.;
ఏపీలో టీడీపీ కూటమి ఏర్పాటు అయింది. అయితే అధికారంలో పెద్దన్న పాత్ర టీడీపీదే అయినా పదవుల పందేరం విషయం వచ్చేసరికి కూటమి పార్టీలు కూడా పోటీకి వస్తున్నాయి. వారికి కూడా పదవులు ఇవ్వాల్సి వస్తోంది. జనసేనకు ఏపీలోని నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. ఇక్కడ బీజేపీకి తక్కువ ఇస్తున్నా రాజ్యసభ పదవుల విషయంలో మాత్రం కమలం పార్టీ తన వాటాను వాటంగానే తీసుకుంటోంది అన్న చర్చ వస్తోంది.
ఇప్పటికి ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు భర్తీ అయ్యాయి. అందులో టీడీపీ రెండు తీసుకుంటే బీజేపీ ఒకటి తీసుకుంది. ఇపుడు నాలుగో రాజ్యసభ సీటు ఖాళీ అయింది. అది విజయసాయిరెడ్డి రాజీనామాతో వచ్చిన ఖాళీ. దాని భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది.
ఇక ఈ సీటు కచ్చితంగా బీజేపీకి పోతుంది అన్న చర్చ అయితే ఉంది. దాంతోనే తమ్ముళ్ళు రగులుతున్నారని అంటున్నారు. ఏపీలో బీజేపీకి ఎమ్మెల్యేలు కేవలం ఎనిమిది మందే ఉన్నారు. బలమంతా టీడీపీ నుంచే ఉంది. అలాంటపుడు ఒక ఎంపీ సీటు ఇప్పటికే ఇచ్చేశాం కదా అని తమ్ముళ్ళ నుంచి వస్తున్న మాట. మరో సీటు అదనంగా ఎందుకు అన్నదే వారి ఆలోచనగా ఉంది. కూటమి మిత్ర ధర్మంగా బీజేపీకి ఇప్పటికే ఎంపీ సీటు ఇచ్చింది అని గుర్తు చేస్తున్నారు.
గతంలో పొత్తులు ఉన్నపుడు బీజేపీకి ఒక్క సీటే ఇచ్చిన వైనాన్ని వారు చెబుతున్నారు. ఇపుడు కూడా మిగిలిన సీట్లు టీడీపీకే దక్కాలని అంటున్నారు. అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాయాన్ని ఏపీకి కోరుకుంటోంది. అమరావతి రాజధాని పోలవరం విషయంలో కేంద్రం తప్పనిసరిగా చేయూతను అందిస్తేనే తప్ప ఏపీ కూటమి ముందుకు సాగ లేదన్నది ప్రభుత్వ పెద్దల మాటగా ఉంది. దాంతో పాటు అన్ని విధాలుగా ఏపీ ఇబ్బందులో ఉంది. దాంతో ఏపీకి కేంద్రం నుంచి ఏమైనా సాయం తెచ్చుకోవాలన్నా కేంద్ర పెద్దలతో మంచిగా ఉండడం బెటర్ అన్నది కూడా ఉంది.
దామంతో రాజ్యసభ సీటు బీజేపీ కోరితే ఇవ్వడానికే టీడీపీ అధినాయకత్వం చూస్తోంది. కానీ అదే తమ్ముళ్లకు పెద్దగా నచ్చడం లేదు అని అంటున్నారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో తమ సీట్లను పొత్తు పేరుతో త్యాగం చేశామని ఇపుడు కలసి వస్తున్న ఈ అవకాశాలను కూడా త్యాగం చేస్తే ఇక అర్ధమేమి ఉంటుందని తమ్ముళ్ళు అంటున్నారని టాక్.
చాలా మంది సీనియర్ నాయకులు రాజ్యసభ సీటు మీద ఆశలు పెట్టుకున్నారు. అయితే వారిని కాదని కేవలం రాష్ట్రం అభివృద్ధి అన్న పేరు మీద ఈ త్యాగాలు ఎంతదాకా చేస్తామని అంటున్నారు. నిజాఇకి బీజేపీకే కేంద్రంలో టీడీపీ అవసరం ఉందని కూడా అంటున్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎండీయే ప్రభుత్వానికి టీడీపీ ఎంపీలే ప్రాణ వాయువుగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు.
అలా ఉన్న పరిస్థితిని సొమ్ము చేసుకోకుండా ఇంకా వారికే సీట్లు ఇస్తూ పోతే ఈ పొత్తులకు త్యాగాలకూ అర్ధం ఏమి ఉంటుందని అంటున్నారు ఇవి ఇక్కడితో ఆగుతాయని కూడా గ్యారంటీ లేదని అంటున్నారు. అందువల్ల ఇప్పటికైనా టీడీపీకే రాజ్యసభ ఖాళీలు ఏమి అయినా ఇవ్వాలని కోరుతున్నారని భోగట్టా. మరి బాబు ఏమి చేస్తారో తెలియదు కానీ బీజేపీకి ఎక్కువ ముద్దు చేస్తున్నారు బాబు అన్నది అయితే అంతటా ఉందిట.