దళపతికి అన్నా డీఎంకే బంపర్ ఆఫర్.. వర్క్ అవుట్ అవుతుందా?

అయితే అధికార పార్టీని తట్టుకుని నిలబడేందుకు ప్రతిపక్షం అన్నా డీఎంకే మాజీ ముఖ్యమంత్రి ఈపీఎస్ ఆధ్వర్యంలో వ్యూహరచన చేస్తోంది.;

Update: 2025-06-24 19:30 GMT

తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని భావిస్తున్న అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి టీవీకే వ్యవస్థాపకుడు దళపతి విజయ్ ను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే బీజేపీతో పొత్తుకు సిద్ధమైన ఈ.పళనిస్వామి టీవీకే పార్టీని తమ కూటమిలోకి చేర్చుకుని ఓట్లు చీలిక లేకుండా జాగ్రత్త పడే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అన్నా డీఎంకే ప్రతిపాదనకు టీవీకే అధినేత విజయ్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠకు గురిచేస్తోంది.

ఈ ఏడాది డిసెంబరులో తమిళనాడుకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో అధికారం నిలబెట్టుకునేందుకు డీఎంకే, ఐదేళ్ల క్రితం దూరమైన అధికారం తిరిగి దక్కించుకోడానికి అన్నా డీఎంకే పార్టీ ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రస్తుతం అధికార పార్టీ డీఎంకే కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొన్ని ప్రాంతీయ పార్టీలో పొత్తు కొనసాగిస్తోంది. చాలా కాలంగా యూపీఏ కూటమిలో కొనసాగిన డీఎంకే.. కాంగ్రెస్ పార్టీకి గట్టి మిత్రపక్షంగా ఇటీవల ఏర్పడిన ఇండి కూటమిలో కూడా చేరింది. ఇక ద్రవిడ ఉద్యమం, హిందీ వ్యతిరేక ఉద్యమంతో తన పట్టు నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్న డీఎంకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమనేలా సాగుతోంది.

అయితే అధికార పార్టీని తట్టుకుని నిలబడేందుకు ప్రతిపక్షం అన్నా డీఎంకే మాజీ ముఖ్యమంత్రి ఈపీఎస్ ఆధ్వర్యంలో వ్యూహరచన చేస్తోంది. ఏపీ ఫార్ములాను తమిళనాడులో ప్రయోగించాలని ప్రణాళిక రచిస్తోంది. ఏపీలో ఓట్లు చీలకుండా విపక్షమంతా కలిసికట్టుగా పోటీ చేసి గత ఎన్నికల్లో గెలిచినట్లు తమిళనాడులోనూ కూటమి కట్టాలని అన్నా డీఎంకే ఎత్తుగడ వేస్తోంది. సినీ నటుడు, దళపతి స్థాపించిన టీవీకే పార్టీకి ప్రజల్లో ఆదరణ లభిస్తుండటంతో ఓట్లు చీలిపోతాయని భయపడుతోంది. విజయ్ ఒంటరిగా పోటీచేస్తే డీఎంకే పార్టీకి మేలు జరుగుతుందని సందేహిస్తున్న అన్నా డీఎంకే తమ పార్టీతో పొత్తు కుదుర్చుకునేలా దళపతి విజయ్ కి పలు ఆఫర్లు ఇస్తోంది.

ఏపీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉప ముఖ్యమంత్రిగా చేసినట్లు అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే విజయ్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా టీవీకే పార్టీకి ఎక్కువ సీట్లు, మంత్రి పదవులు కూడా కేటాయిస్తామని ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అన్నా డీఎంకే కూటమిలో బీజేపీ కూడా చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం బీజేపీతో అన్నా డీఎంకే తెగతెంపులు చేసుకున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ జట్టుకట్టాలని మాజీ సీఎం పళనిస్వామి కోరుకుంటున్నారు. దీంతో ద్రవిడ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అన్నా డీఎంకే ఆఫర్ పై దళపతి విజయ్ స్పందన కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News