తమిళనాట అమ్మ స్థానంలో ఆమె..ఎన్నికల ముందు రంగు మారుతున్న రాజకీయం
కొన్ని కారణాల రీత్యా ఏపీని మినహాయిస్తే.. తెలంగాణ, కర్ణాటక, కేరళలో జాతీయ పార్టీలు అధికారంలోకి వచ్చే చాన్స్ ఉండగా, తమిళనాడులో దాదాపు 60 ఏళ్ల కిందటే జాతీయ పార్టీలకు చెక్ పడింది.;
దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తమిళనాడు రాజకీయాలు చాలా ప్రత్యేకం. కొన్ని కారణాల రీత్యా ఏపీని మినహాయిస్తే.. తెలంగాణ, కర్ణాటక, కేరళలో జాతీయ పార్టీలు అధికారంలోకి వచ్చే చాన్స్ ఉండగా, తమిళనాడులో దాదాపు 60 ఏళ్ల కిందటే జాతీయ పార్టీలకు చెక్ పడింది. 45 ఏళ్ల కిందట పుట్టిన బీజేపీకి ఇప్పటికీ ఆ రాష్ట్రంలో కనీస పట్టు లేదు. కాంగ్రెస్.. డీఎంకేతో కలిసి మనుగడ సాగిస్తోంది తప్పితే సొంతంగా అధికారంలోకి వచ్చేది లేదు. ఇక తమిళనాడులో మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకే. మహా నటుడు ఎంజీఆర్ స్థాపించిన ఈ పార్టీని దివంగత సీఎం జయలలిత మరింత పటిష్ఠపరిచారు. అంతేకాదు.. తన చివరి ఎన్నిక (2016)లో గెలిచి తమిళనాట వరుసగా రెండోసారి ఏ పార్టీ అధికారంలోకి రాదు అన్న రికార్డును చెరిపేశారు. అదే ఏడాది జయ కన్నుమూశారు. అలా ప్రభుత్వ పగ్గాలు పళని స్వామి చేతిలోకి వెళ్లాయి.
-2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే గెలుపొందడంతో ఎంకే స్టాలిన్ తొలిసారి సీఎం అయ్యారు. వచ్చే ఏడాది వేసవిలో తమిళనాడులో ఎన్నికలు జరగాల్సి ఉంది. రెండేళ్ల కిందట స్టార్ నటుడు విజయ్ సొంత పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపారు. ఇటీవల రెండో మహానాడు కూడా నిర్వహించిన విజయ్.. ఇప్పటికైతే పార్టీని మంచి లక్ష్యాలతోనే ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది.
స్టాలిన్ -విజయ్ మధ్యలో ఆమె
స్టాలిన్ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరే ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆయవైపే మొగ్గుంది అంటున్నారు. కానీ, ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చెప్పలేం. మరి అన్నాడీఎంకే పరిస్థితి ఏమిటి..? ఇప్పుడు ఆ విషయానికే వస్తే.. మాజీ సీఎంలు పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య చీలిపోయిన అన్నాడీఎంకేకు బీజేపీతో పొత్తు మాత్రమే పెద్ద అండ. పన్నీర్ ను పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ఆయన స్థానాన్ని జయలలిత నెచ్చెలి శశికళతో భర్తీ చేయాలని చూస్తున్నారట. అన్నాడీఎంకేకు రాష్ట్రవ్యాప్తంగా కేడర్ ఉంది. విజయ్ పార్టీకి ఇంకా పునాదులు బలపడలేదు. ఈ క్రమంలో శశికళను మళ్లీ తీసుకొచ్చి డీఎంకేను ఎదుర్కొనే ఉద్దేశంలో ఉంది బీజేపీ.
నాడు జైలుకు పంపి, నేడు పార్టీలోకి పంపుతూ...
శశికళనే కాదు.. పన్నీర్ నూ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇక శశికళ... జయలలిత మరణం అనంతరం తమిళనాడు సీఎం కావడమే తరువాయి అనుకున్నారు. కానీ, బీజేపీతో వ్యవహారం సరిగా కుదరలేదు. దీంతో ఆమెపై కేసులు బయటకు వచ్చాయి. చివరకు బెంగళూరు జైల్లో శిక్ష అనుభవించారు. కొన్నాళ్ల కిందట విడుదల అయ్యారు. ఇప్పుడు పన్నీర్, శశి, పళని వర్గాలతో అన్నాడీఎంకే బలోపేతం చేసి డీఎంకేను ఢీ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా శశికళను పార్టీలోకి తీసుకోవాలంటూ పళనిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పన్నీర్, శశికళ ఇద్దరూ వస్తే తన పని ఇక కష్టమే అని పళని భావిస్తున్నారు. అందుకని వారిద్దరి రాకపై అయిష్టంగా ఉన్నారని చెబుతున్నారు.
ఏది ఏమైనా తమిళనాడులో జయలలిత కరిష్మా చెరగనిది. ఆమె లేకపోవడంతో అన్నాడీఎంకే రెండు మూడు ముక్కలైంది. అసలు ఆ పార్టీకి సరైన ఫేస్ వ్యాల్యూ లేకుండా పోయింది. ఇప్పుడు జయ స్థానంలో శశికళను ప్రవేశపెట్టి లోటును భర్తీ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మంచి ఎత్తుగడే.. ఎన్నికల్లో ఎంతవరకు వర్క అవుట్ అవుద్దో..?