తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం.. కేంద్ర ప్రభుత్వానికి పోటీగా కొత్త పాలసీ

చెన్నైలోని అన్నా సెంటినరీ లైబ్రరీ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ ఈ రాష్ట్ర విద్య విధానాన్ని ఆవిష్కరించారు.;

Update: 2025-08-08 08:24 GMT

కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి రాజీ పడబోమని తమిళనాడు సీఎం స్టాలిన్ సంకేతాలిచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానానికి పోటీగా తమ రాష్ట్రంలో కొత్త పాలసీ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు సర్కారుకు మధ్య హిందీ భాషపై వివాదం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో స్టాలిన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. తమ ప్రజల కోసం సొంతంగా రాష్ట్ర విద్య విధానం అమలు చేస్తున్నట్లు స్టాలిన్ ప్రకటించారు.

చెన్నైలోని అన్నా సెంటినరీ లైబ్రరీ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ ఈ రాష్ట్ర విద్య విధానాన్ని ఆవిష్కరించారు. కేంద్రం చబుతోన్న త్రిభాషా సూత్రాన్ని తోసి పుచ్చుతూ ద్విభాషా అజెండాతో దీన్ని రూపొందించారు. ఈ ముసాయిదా పాలసీని రూపొందించేందుకు 2022లో రిటైర్డ్ జడ్జి జస్టిస్ మురుగేశన్ ఆధ్వర్యంలోని 14 మంది సభ్యుల కమిటీని నియమించారు. ఈ కమిటీ గత ఏడాది తమ ప్రతిపాదనలను సీఎం స్టాలిన్ కు అందజేశారు. కమిటీ సూచనల మేరకు నూతన విద్య విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఎం స్టాలిన్ శుక్రవారం ప్రకటించారు.

మాతృభాషతో పాటు ఆంగ్లం, కృత్రిమ మేధ, సైన్స్ రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చేలా ఈ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించారు. అంతేకాదు నీట్ లాంటి ప్రవేశ పరీక్షలను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త విద్య విధానంలో ప్రవేశ పరీక్షకు బదులుగా మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఇవ్వాలని నిర్ణయించారు. 11, 12వ తరగతుల మార్కుల ఆధారంగా ఆర్ట్స్, సైన్స్ వంటి కోర్సుల్లో యూజీ ప్రవేశాలు కల్పించేలా కొత్త పాలసీలో ప్రతిపాదనలు చేశారు.

త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరి చేసే జాతీయ విద్య విధానం అమలు విషయంలో కొంతకాలంగా కేంద్రం, తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతోంది. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దాలని కేంద్రం ప్రయత్నిస్తోందని స్టాలిన్ సర్కారు ఆరోపిస్తోంది. జాతీయ విద్య విధానాన్ని అమలు చేయడం లేదన్న కారణంతో సమగ్ర శిక్ష పథకం కింద రాష్ట్రానికి అందాల్సిన రూ.2,152 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేయడం లేదని ఆరోపణలు చేసింది.

Tags:    

Similar News