పార్టీలకు ‘మద్యం’ ఫండ్? రూ.వేల కోట్ల స్కాం.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం

తన తొలి క్యాబినెట్ భేటీలో మద్యం దందా గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఒక్క కలం పోటుతో మద్యం దందాకు ఫుల్ స్టాప్ పెట్టారు.

Update: 2026-06-08 08:45 GMT

దేశ రాజకీయాల్లో మద్యం కుంభకోణాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారంలో నేతలు చిలక్కొట్టుడుకు అడ్డూ అదుపు ఉండటం లేదు. దీనికి ఏ ఒక్క రాష్ట్రం మినహాయింపు కాదని వరుస ఘటనలు రుజువు చేస్తున్నాయని అంటున్నారు. ఇప్పటివరకు వెలుగు చూసిన స్కాంలు ఒక ఎత్తైతే.. అంతకు మించి అన్నట్లు తాజాగా తమిళనాడులో మద్యం బాగోతం వెలుగుచూసింది. తన తొలి క్యాబినెట్ భేటీలో మద్యం దందా గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఒక్క కలం పోటుతో మద్యం దందాకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పటివరకు ఢిల్లీ, చత్తీస్ గఢ్, ఏపీ రాష్ట్రాల్లో లిక్కర్ స్కాం వెలుగు చూడగా, తాజాగా తమిళనాడులో జరిగిన కుంభకోణం కూడా ఔరా? అని ముక్కున వేలేసుకునేలా చేస్తోందని అంటున్నారు.

తమిళనాడు మద్యం కుంభకోణం వెలుగు చూసిన తర్వాత రాజకీయాలు చేయాలంటే స్కాంలు చేయాలా? అనే ప్రశ్న వినిపిస్తోందని అంటున్నారు. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి ప్రత్యేకంగా పార్టీ ఫండ్ వసూలు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అవినీతిపై ఉక్కుపాదం మోపాల్సిందేనని డిసైడ్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే మద్యం మాఫియాపై యుద్ధం ప్రకటించారు సీఎం విజయ్. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం విక్రయాల సంస్థ ‘టాస్మాక్’ (TASMAC) ద్వారా జరుగుతున్న భారీ దోపిడీని ఆయనే బట్టబయలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

తమిళనాడు మద్యం విభాగం మంత్రి కె. విఘ్నేష్ వెల్లడించిన వివరాల ప్రకారం గత డీఎంకే ప్రభుత్వ హయాంలో మద్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో ఏటా ఏకంగా 3,600 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రతి మద్యం సీసాపై గడచిన నాలుగేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా రూ.10 చొప్పున అదనంగా వసూలు చేశారని, రోజుకు దాదాపు 1 కోటి సీసాల విక్రయాలు జరిగే తమిళనాడులో ఈ అక్రమ వసూళ్ల ద్వారా నెలకు రూ.300 కోట్లు ప్రైవేట్ వ్యక్తుల, పాలకుల జేబుల్లోకి వెళ్లాయని మంత్రి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అలాగే డిస్టిలరీల నుండి మద్యం కొనుగోలు చేసే సమయంలో కేసుకు రూ.90 చొప్పున కమిషన్లు నొక్కేస్తూ నెలకు రూ.102 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రాజకీయ పార్టీల ఫండ్‌కు మళ్లించారని కేబినెట్ సమావేశంలో సీఎం వెల్లడించారు.

717 షాపులు బంద్

కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ ఈ అవినీతి సిండికేట్‌ను పూర్తిగా బద్దలు కొట్టేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యం కొనుగోళ్లలో జరిగే కమీషన్ల దోపిడీకి శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఇకపై మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరేలా పారదర్శక చర్యలు చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా, విద్యాలయాలు, ప్రార్థనా మందిరాలకు 500 మీటర్ల లోపు ఉన్న 717 టాస్మాక్ రిటైల్ మద్యం దుకాణాలను శాశ్వతంగా మూసివేస్తూ విజయ్ ప్రభుత్వం తన ఎన్నికల హామీని నెరవేర్చింది. తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని, గతంలో జరిగిన ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని విజయ్ సర్కార్ స్పష్టం చేసింది. ఏపీలో గత పాలకులపై విచారణ సాగుతుంటే, తమిళనాడులో కొత్త సీఎం పాత పాలకుల అవినీతి గుట్టుమట్లను రట్టు చేస్తూ దూసుకుపోతుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News