విజయ్ పార్టీ గుర్తింపు, రద్దుపై మద్రాస్ హైకోర్టులో ఏమి జరిగిందంటే..!
తమిళనాడు రాజకీయాల్లో సినీనటుడు, టీవీకే అధినేత విజయ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.;
తమిళనాడు రాజకీయాల్లో సినీనటుడు, టీవీకే అధినేత విజయ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఇటీవల కరూర్ జిల్లాలో జరిగిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో... ఈ కేసు ఎలాంటి మలుపులు తిసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
అవును... సెప్టెంబర్ 27న కరూర్ లో జరిగిన రాజకీయ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనపై దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్.లో టీవీకే గుర్తింపును రద్దు చేయడం, నటుడు విజయ్ పై అదనపు అభియోగాలను చేర్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జరిగిన వాదనలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఈసీ తరుపు న్యాయవాది వాదనలు వైరల్ గా మారాయి.
ఈ నేపథ్యంలో... మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, న్యాయమూర్తి జి. అరుళ్ మురుగన్ లతో కూడిన ధర్మాసనం ముందు హాజరైన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు న్యాయవాది నిరంజన్ రాజగోపాల్... ఈసీఐ నిబంధనల ప్రకారం టీవీకే గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా అర్హత సాధించడానికి అవసరమైన ప్రమాణాలను అందుకోలేదని వాదించారు. దీంతో... ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది!
అంటే... ఈసీ తరుపు న్యాయవాది వాదనల ప్రకారం.. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ఎన్నికల సంఘం వద్ద ఇంకా పూర్తిస్థాయి గుర్తింపు లేదు. కేవలం పార్టీ పేరు మాత్రమే రిజిస్టర్ అయింది! లైవ్ లా నివేదించిన ప్రకారం.. ఒక పార్టీ చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం 6శాతంతో పాటు అసెంబ్లీలో రెండు ఎమ్మెల్యే సీట్లు లేదా లోక్ సభలో ఒక ఎంపీ సీటును పొందాలి.
పిటిషనర్ వాదనలు!:
మధురై బెంచ్ ముందు ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది అయిన పిటిషనర్.. ర్యాలీ రద్దీగా ఉండే ప్రదేశంలో జరిగిందని.. తీవ్ర నిర్లక్ష్యం, అనుమతుల ఉల్లంఘన కారణంగా.. పిల్లలు, వృద్ధులు సహా 40 మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది గాయపడ్డారని ఆరోపించారు. ఇదే సమయంలో... నిర్వాహకులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 21ఏ కింద ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారని వాదించారు.
అంతే కాకుండా... ఎన్నికల దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపిస్తూ పార్టీ రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని.. రాజకీయ ర్యాలీలలో పిల్లలను ఉపయోగించుకోవడంపై నిషేధం అమలు చేయాలని.. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం చెల్లించాలని నటుడు విజయ్ ను ఆదేశించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను పిటిషన్ కోరింది.