'వీకెండ్ పాలిటీషియన్'.. విజయ్ పై ఉదయనిధి కామెంట్స్ పీక్స్!

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కిపోతున్నాయి.;

Update: 2025-09-27 07:33 GMT

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కిపోతున్నాయి. ప్రధానంగా అధికార డీఎంకే, తమిళగ వెట్రి కళగం (టీవీకే) మధ్య మాటల యుద్ధాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ పై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇవి హాట్ టాపిక్ గా మారాయి!

అవును... తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కిపోతున్నాయి. ఓ పక్క అధికార పార్టీ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టగా.. టీవీకే విజయ్‌ సైతం ప్రతి శనివారం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో విజయ్‌ పై పరోక్ష విమర్శలు గుప్పించారు ఉదయనిధి స్టాలిన్.

ఇందులో భాగంగా... తాను శనివారాల్లో మాత్రమే బయటకు వచ్చే నాయకుడిని కాదని.. ఆదివారాల్లో కూడా తాను ప్రయాణిస్తూనే ఉంటానని అన్నారు. అంతెందుకు ఈ రోజు ఏ రోజు అనేది కూడా నాకు తెలియదు అని ఉదయనిధి పేర్కొన్నారు. తానేమీ ఇతర నేతల్లా వారాంతపు రాజకీయ నాయకుడిని కాదన్నారు. దీంతో.. ఈ కామెంట్స్ హీరో విజయ్ ని ఉద్దేశించే అనే చర్చ బలంగా మొదలైంది.

అయితే ఇప్పటికే ఈ విషయంపై తమిళగ వెట్రి కళగం పార్టీ వర్గాలు స్పందించాయి. ఇందులో భాగంగా... స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే శనివారాల్లో ప్రచారాలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటున్నాయి.

బీజేపీ నుంచి అదే విమర్శ!:

వీకెండ్ పాలిటీషియన్ అంటూ విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శల తరహాలోనే తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సైతం విజయ్‌ ప్రచారశైలిని తప్పుబట్టారు. ఇందులో భాగంగా... విజయ్‌ తెర వెనక నిలబడి మాట్లాడుతున్నారని, ముందుగా ఆయన బయటకు రావాలని అన్నారు.

రాజకీయ నాయకుడంటే వీకెండ్స్ లో మాత్రమే కాకుండా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. అయితే... విజయ్‌ మాత్రం అందుకు విరుద్ధంగా కేవలం శని, ఆదివారాల్లోనే ప్రజలకు అందుబాటులోకి వస్తారని అంటూ.. తాము మాత్రం ఏడాది పొడవునా ప్రజల్లోనే ఉంటామని అన్నారు.

Tags:    

Similar News