తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్ : ‘దళపతి'కి మద్దతు - 21 ఏఐడీఎంకే ఎమ్మెల్యేల పదవులు సేఫ్

తమ పార్టీ విప్‌ను భేఖాతరు చేసిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఏఐడీఎంకే అధినేత పళనిస్వామి ఎందుకు వెనక్కి తగ్గారు?

Update: 2026-06-10 07:49 GMT

తమిళనాడు రాజకీయాలలో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి దళపతి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి, పార్టీ విప్‌ను ధిక్కరించిన 21 మంది ఏఐడీఎంకే ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. వారిపై ఎలాంటి అనర్హత వేటు వేయడం లేదని అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ పరిణామంతో ద్రవిడ రాజకీయంలో సమీకరణాలు మారుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 107 మంది ఎమ్మెల్యేల బలం, మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, దళపతి విజయ్ కి ఏఐడీఎంకే తిరుగుబాటు వర్గం జైకొట్టిన విషయం తెలిసిందే. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని ఏఐడీఎంకే అధిపతి పళనిస్వామి గత నెలలో స్పీకర్ కు లేఖ రాశారు. అయితే ఉన్నట్టుండి ఆయన తన లేఖను వెనక్కి తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

ఎమ్మెల్యేలకు తప్పిన గండం

పార్టీ లైన్ దాటి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతో 21 మంది ఎమ్మెల్యేల పదవులు ఊడిపోతాయనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, స్పీకర్ ప్రభాకర్ తీసుకున్న తాజా నిర్ణయం వారికి పెద్ద లైఫ్ లైన్ ఇచ్చిందని అంటున్నారు. ‘‘ఆ 21 మంది ఎమ్మెల్యేలు తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం వ్యక్తం చేశారని ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అధికారికంగా లేఖ రాశారు. పార్టీయే వారిపై చర్యలను ఉపసంహరించుకోవాలని కోరడంతో, అనర్హత ప్రక్రియను నిలిపివేస్తున్నా" అని స్పీకర్ ప్రకటించారు. దీంతో దాదాపుగా నెల రోజులుగా కొనసాగుతున్న పొలిటికల్ హైడ్రామాకు ఫుల్ స్టాప్ పడినట్లు అయింది. కాగా, ఇప్పటికే రాజీనామా చేసిన మరో నలుగురు ఎమ్మెల్యేల పేర్లు మాత్రం ఇంకా పరిశీలనలోనే ఉన్నాయని స్పీకర్ వెల్లడించారు.

విజయ్ ప్రభుత్వానికి లభించిన సుస్థిరత

ఈ పరిణామం ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి కొండంత బలాన్ని ఇచ్చిందని అంటున్నారు. విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై వేటు పడి ఉంటే, అది ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపకపోయినా రాజకీయంగా కాస్త గందరగోళానికి దారితీసేదని అంటున్నారు. కానీ ఇప్పుడు విపక్ష ఎమ్మెల్యేల మద్దతు అధికారికంగానే కొనసాగే అవకాశం ఉండటంతో, ప్రతిపక్ష పార్టీ సైతం వెనక్కి తగ్గడంతో విజయ్ సర్కార్‌ ఐదేళ్ల కాలపరిమితికి ఎలాంటి ఢోకా లేదని, ప్రభుత్వానికి పూర్తి సుస్థిరత వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది విజయ్ రాజకీయ వ్యూహ చతురతకు దక్కిన విజయంగా ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

పళనిస్వామి ఎందుకు వెనక్కి తగ్గారు?

తమ పార్టీ విప్‌ను భేఖాతరు చేసిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఏఐడీఎంకే అధినేత పళనిస్వామి ఎందుకు వెనక్కి తగ్గారు? వారిని క్షమించాలంటూ స్పీకర్‌కు లేఖ రాయడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పార్టీలో చీలిక భయాన్ని పోగొట్టడానికే పళనిస్వామి వెనక్కి తగ్గారని వ్యాఖ్యానిస్తున్నారు. ఒకేసారి 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే, వారు శాశ్వతంగా పార్టీకి దూరమవడమే కాకుండా, ఏఐడీఎంకే క్యాడర్‌లో పెద్ద చీలిక వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పటికే అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న పార్టీని మరింత బలహీనపర్చడం ఇష్టం లేకే ఈపీఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.

తమిళనాడులో మారుతున్న రాజకీయ వాతావరణంలో అధికార పార్టీతో పూర్తిగా వైరాన్ని పెంచుకోవడం కంటే, కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించడమే మేలని పళనిస్వామి భావించి ఉండవచ్చునని అంటున్నారు. పార్టీ మారే ఉద్దేశం లేదని, కొన్ని స్థానిక పరిస్థితుల వల్లే అలా చేయాల్సి వచ్చిందని ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని ఒప్పించడంలో సఫలమయ్యారని అంటున్నారు. ఒకవేళ వారిపై చర్యలు తీసుకుంటే విపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదం ఉండటంతో ఈపీఎస్ యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం. ఏదేమైనా, ఈ తాజా పరిణామంతో తమిళనాడులో తలెత్తిన రాజకీయ సంక్షోభం ప్రస్తుతానికి సద్దుమణిగిందని అంటున్నారు.

Tags:    

Similar News