సువేందు అధికారి పీఏ మీద బుల్లెట్ల వర్షం

ఇక ఇప్పటికే బెంగాల్ లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న రాజకీయ హింసపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.;

Update: 2026-05-07 03:34 GMT

పశ్చిమ బెంగాల్ రాజకీయంగా వేడెక్కి ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలు కావడం కొత్త ప్రభుత్వం బీజేపీ ఇంకా ప్రమాణం చేయాల్సి ఉండడం మధ్యలో రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య రచ్చ సాగుతోంది. బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ అన్నట్లుగా చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా సీఎం అభ్యర్థిగా గట్టిగా పేరు వినిపిస్తున్న బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్‌ను ఉత్తర 24 పరగణాల జిల్లాలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపడంతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

రాజకీయ హింసతోనే :

ఇక ఇప్పటికే బెంగాల్ లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న రాజకీయ హింసపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాటిని మరింతగా మండించేలా ఈ దారుణ ఘటన జరగడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే చంద్రనాథ్ రథ్‌ను మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు ఆయన వాహనాన్ని అడ్డగించి మరీ అతి సమీపం నుంచి కాల్పులు జరిపారని చెబుతున్నారు. బెంగాల్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఈ ఘటన పరాకాష్టగా చెబుతున్నారు.

కారును ఆపి మరీ హత్య :

ఇక ఈ ఘటనలో దుండగులను గుర్తించి హత్య వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తుని ఒక వైపు చేస్తున్నారు. మరో వైపు చూస్తే ఈ హత్య బీజేపీ కార్యకర్తలు మద్దతుదారులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్న సువేందు అధికారి కి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న చంద్రనాథ్ రథ్ బుధవారం రాత్రి పొద్దు పోయాక కోల్‌కతా నుంచి తన ఫ్లాట్‌కు కారులో తిరిగి వస్తుండగా మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలోని జెస్సోర్ రోడ్డులో దోహరియా సమీపంలో దుండగులు ఆయన కారుని ఆపి మరీ హత్య చేశారని అంటున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్ వాహనాన్ని అడ్డగించి అతి సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారని చెబుతున్నారు.

బుల్లెట్ల వర్షంతో :

ఇక చంద్రనాథ్ రథ్ కారు మీద మొదట దుండగులు ఎటాక్ చేశారు. కారు ముందు విండ్‌షీల్డ్‌పై కాల్పులు జరిపారు. ఆ తర్వాత ముందు సీటులో కూర్చున్న చంద్రనాథ్ రథ్ పైన పెద్ద ఎత్తున బుల్లెట్ల వర్షం కురిపించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా చంద్రనాథ్ రథ్ మీదకు అనేక బుల్లెట్లు దూసుకుని రావడంతో వాటిలో కొన్ని ఆయన ఛాతీకి తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. స్థానికులు ఆయన్ని జెస్సోర్ రోడ్డులోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌కు తరలించగ అక్కడ వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లుగా ప్రకటించారు. ఇక ఈ దాడిలో అదే కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కూడా గాయపడ్డారని చెబుతున్నారు.

అతిపెద్ద తప్పు చేసింది :

మొదటి నుంచి మేము శాంతి గురించి బోధిస్తూనే ఉన్నామని అయితే టీఎంసీ అతిపెద్ద తప్పు చేసిందని అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే తరుణ్‌జ్యోతి తివారీ అన్నారు. దాంతో పాటు బీజేపీ నాయకులు అంతా ఈ ఘటన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ బీజేపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సువేందు అధికారి కూడా దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించి అనంతరం ఆసుపత్రికి వెళ్ళి తన వ్యక్తిగత సహాయకుడి మృత దేహాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పోలీసులు కేంద్ర బలగాలు మొత్తం దాడి జరిగిన ప్రాంతాన్ని దిగ్బంధించాయి. ఈ దారుణ హత్య రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.

Tags:    

Similar News