‘బాగా సంపాదించి చక్కగా పన్ను కడితే సమస్యలకు చెక్’

సాధారణంగా ఆదాయపన్ను శాఖకు సంబంధించి సీనియర్ అధికారులు మొదలు సాధారణ అధికారుల వరకు మీడియాకు దూరంగా ఉండటం కనిపిస్తుంది.;

Update: 2026-04-10 12:30 GMT

సాధారణంగా ఆదాయపన్ను శాఖకు సంబంధించి సీనియర్ అధికారులు మొదలు సాధారణ అధికారుల వరకు మీడియాకు దూరంగా ఉండటం కనిపిస్తుంది. చాలా అరుదుగా మాత్రమే వారు మీడియాకు అందుబాటులోకి రావటం చేూస్తుంటాం. తాజాగా రెండు తెలుగురాష్ట్రాలకు ఆదాయపన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా నియమితులయ్యారు సీనియర్ ఐఆర్ఎస్ అధికారి సురేష్ బత్తిని. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.

ఇంటర్వ్యూలో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఆయన చెప్పిన అంశాల్ని క్లుప్తంగా చూస్తే..

- పన్ను చెల్లించేవారిని ఇబ్బంది పెట్టకుండా గౌరవంగా చూసుకోవాలన్నదే మా ఉద్దేశం. ఒక్కోసారి వారి ఆర్థిక లావాదేవీలను పరిశీలించినప్పుడు.. వారు జరిపిన లావాదేవీలకు అనుగుణంగా పన్ను చెల్లించలేదనే అనుమానం వస్తే నోటీసులిస్తాం. అది తప్పదు.

- పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి అనుమానాలున్నా, సమస్యలున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయకార్‌ భవన్‌ల వద్ద సందేహాల్ని తీర్చే వ్యవస్థ ఉందన్నది మర్చిపోకూడదు.

- కొత్త చట్టంలో పన్నుల మదింపు.. చెల్లింపుల ప్రక్రియను మరింత సరళం చేశాం. ఒక్కోసారి ఒకట్రెండు లావాదేవీలు మిస్‌ అయినట్లుగా.. వాటిని అసెస్ మెంట్ లో చూపలేదంటూ నోటీసులు వస్తుంటాయి. ఇకపై అలాంటి సమస్య రాకుండా ఉండేలా సదరు పన్నుదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన లావాదేవీలకు సంబంధించి వివరాలు.. వాటికి కట్టాల్సిన పన్ను ఎంత? అన్న వివరాల్ని ముందే ఇస్తాం.

- పన్ను కట్టేందుకు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో లాగిన్‌ అయితే.. అన్ని వివరాలు పన్ను చెల్లింపుదారులకు కనిపిస్తాయి. వీటిని ఒకసారి చూసుకుని.. ఏ లావాదేవీనీ మిస్‌ చేయకుండా అన్నింటికి కలిపి పన్ను మదింపు చేసి రిటర్న్ ఫైల్ చేసే వీలుంది. గతంలో ఏదైనా ఒక లావాదేవీని చూపించకుండా ఫైల్ చేస్తే.. వాటికి నోటీసులు.. పన్నులు.. ఫైన్లు ఉండేవి. ఇప్పుడు ముందే సమాచారం ఉండటంతో గతంలో ఎదురైన పరిస్థితులు లేకుండా చేసుకునే వీలుంది.

- ఇలాంటి సమాచారాన్ని ఆర్థిక సంవత్సరం ముగిసిన ఒక నెలలోనే అందిస్తాం. అంటే.. మే.. జూన్ నాటికి అందుబాటులో ఉంటాయి. రిటర్నులు దాఖలు చేసేందుకు సమయం ఉంటుంది కాబట్టి.. ముందుగానే ఆ వివరాల్ని పరిశీలించి చెల్లింపులు జరపొచ్చు. దీంతో..పన్ను బకాయిల కేసులు ఉండవు. ఈ విధానం పన్ను చెల్లింపుదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

- తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపన్ను వృద్ధి రేటు లక్ష్యం 14 శాతం. అయితే.. సుమారు 8 శాతం ఆదాయ వృద్ధి సాధించగలుగుతాం. ఆర్థిక వ్యవస్థ కొంత మందగించటం, అమెరికా - ఇరాన్ యుద్ధం లాంటివి అంశాలతో పాటు మొన్న కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం రూ.12.5 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్నుమినహాయింపు ఇవ్వటం వల్ల కూడా వృద్ధి రేటు కొంత తగ్గే అవకాశం ఉంది.

- తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపన్ను ఫార్మా.. రియల్ ఎస్టేట్.. ఐటీ కంపెనీలు.. ఉద్యోగుల కారణంగా వస్తోంది. యుద్ధం కారణంగా ఫార్మాపై కొంత ప్రభావం పడింది. ఐటీ రంగం ప్రభావం ఇప్పుడు లేదు. వచ్చే ఏడాది ఆదాయంపై పడుతుంది. ఐటీ రంగం బాగుంటేనే.. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఈ పరిణామాలన్నీ ఒక్కోసారి వృద్ధి రేటు మీద ప్రభావాన్ని చూపుతాయి.

- ఆదాయపు పన్ను కట్టాల్సిన బ్రాకెట్‌లో ఉన్నవాళ్లలో 70 శాతం వరకూ పన్ను కడుతున్నారు. వాళ్లు కట్టేలా చేస్తున్నాం. బ్యాంకు లావాదేవీలు ఆటోమేటిక్‌గా మా శాఖకు తెలుస్తాయి. ఒక నిర్ణీత పరిమితి మించి క్రెడిట్‌ కార్డులు వాడిన వారు, ఆస్తులు కొనుగోలు చేసిన వారి సమాచారం మాకు అందుతోంది. అయితే నగదు లావాదేవీలు చేసే మిగతా 30 శాతం మంది పన్ను కట్టకుండానే ఉంటున్నారు.

Tags:    

Similar News