'సుగవాసి'తో పోయేదేకానీ.. వైసీపీకి వచ్చేదెంత .. !
గత ఎన్నికల్లోను, అంతకు ముందు కూడా ఆయన టిడిపి నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.;
సుగవాసి బాలసుబ్రమణ్యంతో వైసిపికి ఒరిగేదేమిటి? నిజంగా ఆయన వల్ల వైసీపీకి కొత్తగా వచ్చే లాభం ఏంటి? అంటే ఏమీ లేదు అనే మాట వినిపిస్తుంది. పైగా టిడిపి ఒక రకంగా ఒక తలనొప్పిని వదిలించుకుంటే.. వైసిపి మరో విధంగా తలనొప్పిని కొని తెచ్చుకున్నట్టే అనే మాట కూడా వినిపిస్తోంది. ఉమ్మడి కడప జిల్లా రాజంపేటకు చెందిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సగవాసి పాలకొండ్రాయుడు కుటుంబానికి చెందిన బాలసుబ్రమణ్యం తాజాగా వైసీపీ కండువా కప్పుకున్నారు.
నిజానికి పాలకొండ రాయుడే జీవించి ఉంటే ఈ పరిణామం వేరుగా ఉండేది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న పాలకొండ్రాయుడు ఆది నుంచి టిడిపికి, తెలుగువారి ఆత్మగౌరవానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన కుమారుడిగా సుగవాసి బాలసుబ్రమణ్యం రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఆయన గురించి చిత్రమైన మాట చెబుతారు.. ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ కి ఎక్కువ, జడ్పిటిసి కి తక్కువ అని!. ఎందుకంటే ఆయన ఏనాడు ఎమ్మెల్యేగా గాని మరో కీలకమైనటువంటి ప్రజా ప్రతినిధిగా గాని విజయం దక్కించుకోలేదు.
గత ఎన్నికల్లోను, అంతకు ముందు కూడా ఆయన టిడిపి నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాతే రాజకీయాల్లో ఆయన టిడిపిని విభేదిస్తూ టిడిపి పై కామెంట్లు చేస్తూ తనకు రాజంపేట ఇన్చార్జి పోస్టు అప్పగించాలంటూ యాగీ చేశారు. దీంతో పలుమార్లు బీసీ జనార్దన్ రెడ్డి జోక్యం చేసుకుని సరిదిద్దె ప్రయత్నం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఒకటికి రెండుసార్లు చెప్పారు. అయినా కూడా ఎవరి మాట వినిపించుకోకుండా సుగవాసి సొంతంగా అజెండాను అమలు చేశారు.
ఇదిలా ఉంటే పార్టీకి రాజీనామా చేసిన సుడవాసిని హడావుడిగా వైసిపి చేర్చేసుకుందనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి రాజకీయ విభేదాలు లేకుండా ముందుకు సాగుతున్నారు. అలాంటి చోట ఇప్పుడు సుడవాసి వంటి వారిని తీసుకుని కండువా తప్పితే రేపు ఇదే నియోజకవర్గంలో సుగవాసి మళ్ళీ కంట్లో నలుసుగా మారతారు అనేది ఇప్పుడిప్పుడే వైసీపీ నాయకులు మధ్య చర్చ నడుస్తుంది.
అలా జరగాలని ఎవరు కోరుకోవడం లేదు. కానీ ఒకవేళ ఇదే జరిగితే అప్పుడు ఆకేపాటికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని వారు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి సుగవాసిని ఆహ్వానించారు కండువా కప్పారు.